తిరువణ్ణామలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి
తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. మోక్ష మార్గంగా భావించే ఇడుక్కు పిల్లయ్యార్ గుహలో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుడు మణికుమార్ (36) ఊపిరాడక మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ గుహలో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ భక్తుడు ఊపిరాడక మృతిచెందాడు. ఈ ఘటన భక్తుల్లో తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ (36) శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరువణ్ణామలైలోని శ్రీ ఉన్నాములయ్యమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లాడు. అనంతరం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయానికి చేరుకున్నాడు. దీన్ని మన తెలుగువారు మోక్ష మార్గం అని పిలుస్తారు.
గుహ ఆకారంలో ఉండే ఈ ఆలయంలో భక్తులు వెనుక ద్వారం నుంచి పడుకుని లోపలికి వెళ్లి, ఇరుకైన మార్గంలో పాకుతూ ముందువైపు ద్వారం గుండా బయటకు వస్తుంటారు. అయితే మణికుమార్ శరీరాకృతి లావుగా ఉండటంతో గుహ మధ్యలోనే ఇరుక్కుపోయాడు. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు బయటకు తీసేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో ఆయనకు ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కొంతసేపటి తర్వాత ఇతర భక్తులు తీవ్రంగా శ్రమించి ఆయనను గుహ నుంచి బయటకు తీసి 108 అంబులెన్స్‌లో తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సమాచారం అందుకున్న తిరువణ్ణామలై తాలూకా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయం ప్రత్యేకత
గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయం చిన్న గుహ ఆకారంలో ఉంటుంది. భక్తులు వెనుకవైపు ఉన్న ప్రవేశ మార్గం ద్వారా పడుకుని లోపలికి వెళ్లి, ఇరుకైన గుహలో పాకుతూ ఎదురువైపు ద్వారం గుండా బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత నంది, ఇడుక్కు పిల్లయ్యార్‌ను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ ఆచారం నిర్వహించే క్రమంలోనే మణికుమార్ గుహలో ఇరుక్కుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
