Andhra Pradesh: ‘వాలంటీర్ పేరు ఎత్తితే ఒప్పుకోను’.. ఎవరి నోటి నుండి ఆ పదం రాకూడదని సీరియస్ వార్నింగ్
పార్వతీపురం మన్యం జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో లబ్దిదారులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరకు ఊహించని సమాధానం వచ్చింది.
గడప గడపకు మన ప్రభుత్వంలో ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ప్రతిరోజూ ఏదో ఒక ఆసక్తికర సందర్భం ఎదురవుతూనే ఉంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మునిసిపాలిటీలో జరిగిన ఒక ఘటన ఆసక్తిగా మారింది.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సిఎం పీడిక రాజన్నదొర మూడవ వార్డు అయిన గుమడలో అధికారులతో పర్యటిస్తున్నారు. అలా ఒక ఇంటికి వెళ్లిన రాజన్నదొర ఆ ఇంట్లో మహిళను మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మీకు పథకాలు ఎవరిస్తున్నారో తెలుసా అని అడిగారు. వెంటనే ఆ మహిళ నాకు పథకాలు వాలంటీర్ ఇస్తున్నారు అని సమాధానం ఇచ్చింది.. దీంతో డిప్యూటీ సిఎం రాజన్నదొరకి పట్టరాని కోపం వచ్చింది. ఆవేశంతో ఊగిపోయాడు.. అక్కడే ఉన్న మునిసిపల్ కమీషనర్, సచివాలయం సిబ్బందిని పిలిచి వారి పై కూడా తీవ్రంగా మండిపడ్డారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సాలూరు మండలం శివరాంపురం వెళ్ళినప్పుడు కూడా అక్కడివారు కూడా పథకాలు ఇస్తుంది వాలంటీర్ అని చెప్తున్నారు. ఇలా మరోసారి వాలంటీర్ పేరు ఎవరయినా చెప్తే ఎంపిడిఓ, మునిసిపల్ కమీషనర్లు సస్పెండ్ అవుతారని వార్నింగ్ ఇచ్చారు. అంతతో ఆగకుండా చంద్రబాబు ప్రస్తావన కూడా తెచ్చారు.
చంద్రబాబు టైంలో పథకాలు ఎవరిచ్చారు అంటే చంద్రన్న ఇచ్చారని చెప్పేవారు, ఇప్పుడు జగనన్న ఇస్తే వాలంటీర్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఇదేం పద్ధతి.. ఇది కరెక్ట్ కాదు అని శివలెత్తారు.. ఈ ఘటనతో వెంటనే కార్యక్రమం ముగించి ఇదే అంశంపై మధ్యాహ్నం అధికారులతో అత్యవసర సమావేశం పెట్టారు.. ఆ సమావేశంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మున్సిపల్ సిబ్బంది, మండల ఆఫీస్ సిబ్బంది హాజరు కావాలని ఆదేశించారు.. అక్కడ కూడా వాలంటీర్లపై మండిపడ్డారు. మీరు ప్రజల వద్ద మంచిమార్కులు కొట్టేయడానికి జగనన్న పేరు చెప్పకుండా మీరు హైలైట్ అవుతున్నారని, అలా కుదరదని.. అలా జరిగితే వాలంటీర్లుతో పాటు సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే అంశం ఇప్పుడు జిల్లాలో కలకలం రేపింది..