Andhra: పెళ్లి వేళ నవజంట అద్భుత నిర్ణయం.. ఏంటో తెలిస్తే మీరు సైతం అభినందిస్తారు..
విజయనగరం జిల్లా కొత్త జంట వినూత్న ఆలోచన చేసింది. అవయవదానం చేయడం ద్వారా మరణానంతరం ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు. అంతేకాదు బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 60 మందిని ఈ మంచి పనిలో భాగం చేశారు.

పెళ్లంటే తాళాలు, తప్పెట్లు, తలంబ్రాలు, మూడు ముళ్లు, ఏడడుగులు అని అంటారు. నిండు నూరేళ్లు దంపతులు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలంటే కూడా గొప్పగా ఉండాలని భావిస్తారు. అందుకోసం భారీగా ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లితంతు పూర్తి చేస్తారు. పేదవారి నుంచి ధనవంతుల వరకు పెళ్లంటే ఒక పండుగ. ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు ఖర్చు చేసి వివాహ వేడుకను జరుపుకుంటారు. వివాహాన్ని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో జరుపుకుంటూ ఉంటారు. ఇటీవల కొత్తగా పెళ్లి చేసుకోబోయే జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో ఎన్నో వెకిలి చేష్టలు వేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన ఘటనలు ఎన్నో చూశాం. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఒక ఎత్తైతే పెళ్లిలో సంప్రదాయాలను పక్కనపెట్టి విమర్శల పాలవుతున్న ఘటనలు మనం చూస్తునే ఉన్నాం. అలా పెళ్లిళ్లలో వెర్రితలలు వేస్తూ పెళ్లి తంతునే నవ్వులపాలు చేస్తున్న ఈ రోజుల్లో ఓ నవయువ జంట మాత్రం అందుకు భిన్నంగా సందేశాత్మక నిర్ణయం తీసుకొని పలువురికి ఆదర్శంగా నిలిచింది.
చీపురుపల్లి మండలం పత్తికాయవలసలో బాలి శ్రీనివాసనాయుడు అనే యువకుడు లావేరు మండలం కేశవరాయపాలెంకి చెందిన ప్రియాంక అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహాన్ని సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా చేసుకున్నాడు. అయితే ఇద్దరు కలిసి ఒకటవుతున్న సందర్భంగా భవిష్యత్తులో మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ యువజంట నిర్ణయించుకున్నారు. ఇద్దరం కలిసి బ్రతికి ఉన్నంతవరకు పదిమందికి సేవ చేద్దాం, ఆ క్రమంలోనే చనిపోతే అప్పుడు కూడా పలువురికి సేవ చేసే చనిపోదాం అని నిర్ణయించుకున్నారు. అందుకు ఏమి చేస్తే బాగుంటుందని స్నేహితులతో చర్చించారు. ఈ క్రమంలోనే వారికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. మరణానంతరం మరికొందరిని బ్రతికించాలని అవయవదానం చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం వారితో ఆగకుండా వారి కుటుంబసభ్యులకు కూడా స్పూర్తి నింపి అందరూ కలిసి అవయవదానంకు ముందుకు వచ్చారు. వెంటనే చీపురుపల్లిలో ఉన్న మానవీయ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు గోవిందరాజులును ఆహ్వానించి పెళ్లి జంటతో పాటు మరో 60 మంది కుటుంబసభ్యులు తమ అవయవదాన పత్రాలను అందజేశారు. ఇప్పుడు వీరు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తుంటే నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




