జగన్@100 డేస్.. పరిపాలన ఎలా సాగిందంటే..!

జగన్@100 డేస్.. పరిపాలన ఎలా సాగిందంటే..!

ఎండా వానను లెక్కచేయక.. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి.. ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను తెలుసుకొని.. ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’ అని చెప్పిన జగన్.. 151 సీట్లను గెలుచుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ తరువాత ‘‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను’’ అని మే 30న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. ఇవాళ్టికి వంద రోజులను పూర్తి చేసుకున్నారు. ఈ వంద రోజుల్లో ఆయన పలు సంచలన […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 06, 2019 | 11:00 AM

ఎండా వానను లెక్కచేయక.. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి.. ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను తెలుసుకొని.. ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’ అని చెప్పిన జగన్.. 151 సీట్లను గెలుచుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ తరువాత ‘‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను’’ అని మే 30న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. ఇవాళ్టికి వంద రోజులను పూర్తి చేసుకున్నారు. ఈ వంద రోజుల్లో ఆయన పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆశా వర్కర్లకు 10వేల జీతం పెంపు, ప్రభుత్వంలోకి ఆర్టీసి సిబ్బంది విలీనం, ప్రభుత్వం ద్వారా మద్యం విక్రయం, గ్రామ/వార్డు వాలంటీర్ల నియామకం, తిరుమల తిరుపతిలో అన్యమత ఉద్యోగుల తొలగింపు వంటి నిర్ణయాలను జగన్ తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఇన్ని రోజుల్లో విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. తన పంథాలో ముక్కుసూటిగా పరిపాలన చేస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కొన్ని నిర్ణయాలతో పక్క రాష్ట్రాల్లో పేరును సంపాదించుకున్నారు జగన్.

అయితే ఈ వంద రోజుల్లో ఆయన ప్రభుత్వంపై ఎన్నో వివాదాలు కూడా నడిచాయి. పీపీఏలను రద్దు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఈ విషయంలో మాత్రం తాను వెనక్కి తగ్గేది లేదని జగన్ చెప్పుకొచ్చారు. ఆ తరువాత కృష్ణా నది కరకట్టపై అక్రమ కట్టడాల విషయంలో జగన్ ప్రభుత్వం రాజీ లేని నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య రగడ మదలైంది. ఆ తరువాత పోలవరం రివర్స్ టెండరింగ్‌పైనా జగన్‌ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రివర్స్ టెండరింగ్‌పై నవయుగ కంపెనీ హైకోర్టుకు వెళ్లడం.. తీర్పు నవయుగ కంపెనీకి అనుకూలంగా రావడంతో ఏపీ ప్రభుత్వానికి తొలి దెబ్బ తగిలినట్లైంది. ఇక దీన్ని అస్త్రంగా వాడుకున్న టీడీపీ.. వైసీపీది రివర్స్ పాలన అంటూ సెటైర్లు వేసింది.

ఆ తరువాత జగన్‌కు ఎదురైన మరో సవాలు రాజధాని అంశం. అమరావతిలో ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ నిర్మాణాలు చేపడితే భవిష్యత్‌లో డబుల్ ఖర్చు అవుతుందని మంత్రి బొత్స చేసిన కామెంట్లతో రాజధాని రగడ మొదలైంది. దీనిపై ప్రభుత్వం, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏకంగా సీఎంనే అడ్డుకొని, వ్యతిరేక నినాదాలు చేసే పరిస్థితి వచ్చేసింది. అయితే దీనిపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ప్రజల్లో అసంతృప్తిని ఇచ్చింది. సీఎం హోదాలో ఒక్క మాట అయినా మాట్లాడి ఉండాల్సింది అన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఇక ఇసుక కొరత కూడా ప్రభుత్వానిపై ప్రజలకు వ్యతిరేకతను తీసుకొచ్చింది. ఈ కొరతపై టీడీపీ విమర్శలు గుప్పించి, ధర్నా కూడా చేసింది. అయినా జగన్ మాత్రం వివరణ ఇవ్వకపోవడం గమనర్హం. అలాగే అన్న క్యాంటీన్ల మూసివేత, తెల్ల రేషన్ కార్డుదారులకు కేవైసీ తిప్పలు, ప్రజావేదిక కూల్చివేత అంశాల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజల నుంచి కాస్త వ్యతిరేకత వచ్చిందనేది నిపుణుల మాట.

మొత్తానికి చెప్పాలంటే ఈ వంద రోజుల్లో ప్రజలు ఆయనపై పెట్టుకున్న అంచనాల్ని కొంతమేరకు అందుకున్నా.. పూర్తిస్థాయి సంతృప్తి కలిగించలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీనికి పాలనపై అనుభవం లేకపోవడం కూడా ఒక కారణమని వారు అంటున్నారు. అలాగే కేంద్రం- ఏపీ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు చెప్పుకోదగ్గ విధంగా లేవు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థలో కూడా.. క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. కాగా మరోవైపు ఏపీ సర్కారును నిధుల కొరత కూడా వేధిస్తోంది. రాజధాని వివాదం వలన.. రియల్ ఎస్టేట్ పడిపోవడం ప్రభుత్వానికి వేధిస్తోన్న మరో సమస్య. ఇవన్నీ పాలనను ముందుకు సాగనివ్వకుండా అడ్డుకుంటున్నాయి.

ఇక నవరత్నాలే తొలి ప్రాధాన్యాంశంగా భావిస్తున్న జగన్.. వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్తున్నారు. మద్యపాన నిషేధంలోనూ చెప్పిన మాటకు కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకుంటానని తెలిపిన జగన్.. తన పాలనలోనూ పారదర్శకతను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఓ వైపు విపక్షాల విమర్శలు.. మరోవైపు సవాళ్లతో.. ప్రజాభిమానాన్ని పొందేందుకు ఆయన చాలా ప్రయత్నాలే చేస్తున్నారు.

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu