నేటి నుంచే కొత్త ఇసుక పాలసీ.. ఇసుక కొరత ఇక్కట్లు తీరినట్లేనా..!

నేటి నుంచే కొత్త ఇసుక పాలసీ.. ఇసుక కొరత ఇక్కట్లు తీరినట్లేనా..!

నేటి నుంచి ఏపీలో కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కొత్త విధి విధానాలను జారీ చేసింది జగన్ ప్రభుత్వం. ఇసుక పాలసీ అమలు, ధరల నిర్ధారణ, 1966 చట్టంలో సవరణలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం నాలుగు వేర్వేరు జీవోలు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై ఏపీ ఖనిజ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరుగుతాయి. ఇసుకను.. రీచ్‌ల నుంచి స్టాక్ యార్డులకు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 05, 2019 | 7:40 AM

నేటి నుంచి ఏపీలో కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కొత్త విధి విధానాలను జారీ చేసింది జగన్ ప్రభుత్వం. ఇసుక పాలసీ అమలు, ధరల నిర్ధారణ, 1966 చట్టంలో సవరణలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం నాలుగు వేర్వేరు జీవోలు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై ఏపీ ఖనిజ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరుగుతాయి. ఇసుకను.. రీచ్‌ల నుంచి స్టాక్ యార్డులకు తరలించి.. అక్కడి నుంచి అమ్మకాలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రతి జిల్లాల్లో కొన్ని స్టాక్ యార్డులను ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో టన్ను ఇసుక ధర రూ.375గా నిర్ణయించారు. అలాగే టన్ను ఇసుకకు రవాణా చార్జీ కిలోమీటర్‌కు రూ.4.90గా ఖరారు చేశారు. అయితే 15 కిలోమీటర్లలోపు ఉంటే ఈ ధర గిట్టుబాటు కానందున దాని కోసం వేరే ధర నిర్ణయించనున్నారు. 15 కిలోమీటర్లు దాటిన ప్రాంతాలకు ఈ ధరనే నిర్ణయిస్తారు. తొలి దశలో భాగంగా 41 ఇసుక రీచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఇసుక కావాలనుకున్న వారు ఏపీఎండీసీ ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాలి. నగదు చెల్లింపులు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఏపీవ్యాప్తంగా 102 ఇసుక రీచ్‌లను ప్రభుత్వం గుర్తించింది. ఏపీ దాటి ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలించడానికి అనుమతి లేదు. జీపీఎస్ లేకుండా ఇసుకను తరలిస్తే భారీ జరిమానాలు విధించనుంది. ఇసుక రీచ్‌లు, స్టాక్ యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసిన ప్రభుత్వం… పూర్తి పారదర్శకంగా ఇసుక విధానం అమలవ్వాలని ఆదేశించింది. అలాగే రిజర్వాయర్లు, డ్యామ్‌లు, బ్యారేజీల దగ్గర ఇసుక తవ్వకాలు జరిపే పనులను ప్రభుత్వం నీటి పారుదల శాఖ (ఇర్రిగేషన్)కు అప్పగించింది. ఇక పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాలో వద్దో నిర్ణయించే బాధ్యత స్థానిక తహశీల్దార్లకు అప్పగించింది.

అయితే అధికారం చేపట్టాక సీఎం వైఎస్ జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో కొత్త ఇసుక పాలసీ ఒకటి. గత ప్రభుత్వం హయాంలో ఇసుక రవాణాలో అవినీతి పెరిగిందని భావించిన జగన్.. కొత్త ఇసుక పాలసీకి శ్రీకారం చుట్టారు. అయితే ఇది అమల్లోకి తీసుకొచ్చే క్రమంలో ఇటీవల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసి.. ధర్నా కూడా చేశాయి. జగన్ తీసుకునే నిర్ణయాల వలన సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఇసుక పాలసీ ద్వారా భవిష్యత్‌లో ఇసుక కొరత తీరుతుందేమో చూడాలి. అలాగే ఇసుక కొరత వలన రాజధాని అమరావతిలోని పలు భవనాల నిర్మాణంతో పాటు ఏపీలోని పలు ప్రాజెక్ట్‌ల పనులు ఆగిపోగా.. ఇవాళ్టి నుంచైనా అవి తిరిగి ప్రారంభం అవుతాయేమో చూడాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu