2019 ఆంధ్రరాష్ట్ర హైలైట్స్‌..

2019..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక సంచలనాలు, పెను మార్పులు, కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ పరిణామాలే కాకుండా, రాష్ట్ర స్థితిగతులను సైతం అవి ప్రభావితం చేశాయి. మచ్చుకు కొన్ని పరిశీలించినట్లయితే.. * మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట ధీక్షః ఫిబ్రవరి 11, 2019..దేశరాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద సందడి నెలకొంది. ప్రత్యేక హోదా నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. నల్లచొక్కాలు ధరించిన టీడీపీ నేతలంతా కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..తమ డిమాండ్లు వినిపించారు. […]

2019 ఆంధ్రరాష్ట్ర హైలైట్స్‌..
Follow us
Anil kumar poka

| Edited By:

Updated on: Dec 26, 2019 | 10:40 PM

2019..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక సంచలనాలు, పెను మార్పులు, కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ పరిణామాలే కాకుండా, రాష్ట్ర స్థితిగతులను సైతం అవి ప్రభావితం చేశాయి. మచ్చుకు కొన్ని పరిశీలించినట్లయితే..

* మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట ధీక్షః ఫిబ్రవరి 11, 2019..దేశరాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద సందడి నెలకొంది. ప్రత్యేక హోదా నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. నల్లచొక్కాలు ధరించిన టీడీపీ నేతలంతా కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..తమ డిమాండ్లు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేసిందని ఆరోపిస్తూ..అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తిన వేదికగా ధర్మాపోరాట దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల కోసం చేపట్టిన దీక్షకు మద్దతుగా పలు జాతీయ పార్టీల కార్యకర్తలు సైతం తరలివచ్చారు. మూడురోజుల పాటు సాగిన ఈ ధర్మపోరాట దీక్షలో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని గట్టిగానే వినిపించారు. అది వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కలిసివస్తోందని అంతా భావించారు. కానీ,..

* మార్చి 14 అర్ధరాత్రి..వైఎస్‌ వివేకానంద రెడ్డి దారుణ హత్యః 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర 15-వ శాసనసభకు కూడా ఎన్నికలు ప్రకటించింది ఈసీ. ఎన్నికల వేడిలోనే ఏపీలో దారుణం చోటుచేసుకుంది. వైఎస్‌ సోదరుడు, జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కడప జిల్లా పులివెందులలోని తన ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను గొడ్డలితో నరికి చంపారు. మార్చి 14 గురువారం రాత్రి మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి వచ్చిన ఆయన మర్నాడు ఉదయానికి తన నివాసంలోనే శవంగా కనిపించారు. ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో జరిగిన హత్య… రాజకీయంగానూ సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులెవరో, దోషులెవరో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఓ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మరో సిట్ బృందం ఏర్పాటు చేసింది. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్ కుటుంబీకులతో పాటు దాదాపు 13 వందల మంది అనుమానితులను దర్యాప్తు బృందాలు విచారించాయి.

* ఎన్నికల వేళ..మాజీ స్పీకర్‌ కోడెలపై దాడి * 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగ్‌ జరిగింది. ఎన్నికల పోలింగ్ రణరంగాన్ని తలపించింది. ఒక వైపు ఈవీఎంలు మొరాయించగా,  మరో వైపు పలు చోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి..గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనుమెట్లలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైసీపీ నేతలు దాడికి దిగారు. ఆయన చొక్కాను చింపేస్తూ, ఆయనకు అడ్డుగా నిలిచిన గన్ మెన్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కోడెలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చాలాచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇద్దరు మృతి చెందారు. ఎన్నికలలో పోటీ చేస్తున్నఅభ్యర్థులపై కూడా కొన్ని చోట్ల దాడులు జరిగాయి. పోలింగు నిర్వహణ తీరుపై ఎన్నికల సంఘం పలు రాజకీయ పార్టీలు, నాయకులు, సామాన్య పౌరుల నుండి విమర్శలు ఎదుర్కొంది. కొన్ని పోలింగ్ బూతులలో రీపోలింగ్ నిర్వహించారు. ఇక 23 మే 2019 న జరిగిన ఓట్ల లెక్కింపు తరువాత, వైఎస్ఆర్ పార్టీ 151స్థానాలలో విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ 23 స్థానాలలో, జనసేనపార్టీ 1 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాయి.

* ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారంః 23 మే 2019 న జరిగిన ఓట్ల లెక్కింపు తరువాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలకు గాను 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంది.. భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వైఎస్ జగన్‌ 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతీరేకాల మధ్య జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రిగా కర్తవ్యాన్ని, బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లా నుంచే జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

* పోలవరం రివర్స్‌ టెండరింగ్ః వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీక‌రించిన త‌ర్వాత ప‌లు మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. దేశంలో తొలిసారిగా రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని భావించిన సీఎం జగన్ ఈ విధానం అమ‌లులోకి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వ‌ర్క్స్ నుంచి ఎడ‌మ కాలువ‌కు అనుసంధానం చేసే 65వ ప్యాకేజీ ప‌నుల‌కు రివ‌ర్స్ టెండ‌రింగ్ ప‌ద్ధతి నిర్వహించారు. దాని ద్వారా రూ. 58 కోట్ల రూపాయలు ఆదా చేసిన‌ట్టు ప్రభుత్వం చెబుతోంది. హెడ్ వ‌ర్క్స్, ప‌వ‌ర్ స్టేష‌న్ ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచారు. రూ. 4,987.55 కోట్ల విలువచేసే ప‌నుల‌కు టెండర్లు పిలువగా.. 12.6 శాతం తక్కువ మొత్తానికే ఈ పనులు చేపట్టేందుకు ‘మేఘా’ సంస్థ ముందుకొచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రాజెక్టు కాంట్రాక్టుల విష‌యంలో కూడా రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్రక్రియ‌కు శ్రీకారం చుడ‌తామ‌ని ప్రమాణ స్వీకారం నాడే జగన్‌ ప్రకటించారు.

* రాజధాని రగడ- అమరావతి మూడు ముక్కలాటః ఏపీ శాసనసభ సమావేశాల చివరి రోజు రాజధాని అంశం పై  సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కారాదని, వికేంద్రీకరణ జరగాలని అందుకే ఏపీకి మూడు రాజధానులు అవసరముందని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జుడిషియల్ క్యాపిటల్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని చెప్పిన సీఎం జగన్ విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునేమోనని సూచనప్రాయంగా తెలియజేశారు.

మూడు రాజధానులంటూ సీఎం చేసిన ప్రకటన, GN RAO కమిటీ నివేదిక ఇవ్వడంపై రాజధాని రైతులు భగ్గుమంటున్నారు. దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నారు. సీఎం జగన్ కి అభివృద్ధి వికేంద్రీకరణ కు సంబంధించి ఆలోచన ఉన్నప్పుడు నాడు టీడీపీ హయాంలో అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఎందుకు అంగీకరించారని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని నిలదీస్తున్నారు. వైఎస్‌సీపీ ధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు రాజధానిపై రోజుకో రకమైన ప్రకటనలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. నిన్నటి వరకు కూడా మంత్రులు రోజుకో రకమైన వ్యాఖ్యలు చేస్తే , సీఎం జగన్ కూడా మూడు రాజధానులు ఉండొచ్చు అని చెప్పటం దేనికి సంకేతం అని వారు ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానుల అంశంపై అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. చూడాలి జగన్ ప్రకటించిన ఈ మూడు ముక్కలాట 2020లో ఏపీలో పరిస్థితులను ఎలా మారుస్తుందో.