Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆంధ్ర టైమ్‌ ఆగయా.. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డబ్బుల వరద

ఆంధ్ర టైమ్‌ ఆగయా. అడిగితే చాలు.. కాదనకుండా ఇచ్చేస్తున్నారు కేంద్రం పెద్దలు. రిక్వెస్ట్‌ వెళ్తే చాలు.. నిధుల వరద పారిస్తున్నారు. వరుస గుడ్‌ న్యూస్‌లతో ఏపీ దిల్‌ ఖుష్‌ చేస్తున్నారు. కేంద్రం బూస్టప్‌తో ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కుతున్నాయి. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతికి మహర్దశ పడుతోంది.

Andhra Pradesh: ఆంధ్ర టైమ్‌ ఆగయా.. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డబ్బుల వరద
Amaravati
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 25, 2024 | 9:24 AM

ఏపీ ప్రజల ఆశలు నెరవేరుతున్నాయి… రాజధాని వాసుల కలలు చిగురిస్తున్నాయి. ప్రతి దాంట్లో ఏపీకి కేంద్రం నుంచి అగ్ర తాంబూళం అందుతోంది. అడిగిందే తడువుగా ఏపీకి నిధుల వరద పారిస్తోంది. ఒక్క రాజధానికే కాదు… శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు… అమలాపురం నుంచి అనంతపురం వరకు…. నవ్యాంధ్ర నలుమూలలా అభివృద్ధి జరిగేలా భరోసా దక్కుతోంది. కేంద్రం సరైన సమయంలో సహకారం అందిస్తూ ఉండడంతో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి.

రూ.2,245 కోట్లతో 57 కి.మీ. రైల్వేలైన్‌ నిర్మాణం

తాజాగా అమరావతి రైల్వే అనుసంధానం ప్రాజెక్టుకు సెంట్రల్‌ కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2 వేల 245 కోట్ల రూపాయలతో 57 కి.మీ అమరావతి రాజధానికి కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటు కానుంది. అమరావతి నుంచి హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ కొత్త లైన్‌ నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కి.మీ పొడవైన వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. ఇదే కాకుండా మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది కేంద్రం. ఏపీలో రహదారుల అభివృద్ధికి రూ.252.42 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

బడ్జెట్లో ఏపీకి రూ.15 వేల కోట్లు

కేంద్రం తోడ్పాటుతో జవసత్వాలు పొంది.. అమరావతి మహా నగరంగా రూపుదిద్దుకుంటుందన్న ఆశలు మొలకెత్తుతున్నాయి. అమరావతి నిర్మాణానికి కేంద్రం భరోసా ఇవ్వడమే కాకుండా.. బడ్జెట్లో భారీగా రూ.15 వేల కోట్లు ప్రకటించింది. ఇవే కాకుండా, పోలవరంకు 12 వేల కోట్లు, కేపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద మౌలిక సదుపాయాల కల్పనకు 2400 కోట్లు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట 5000 కోట్లు, 15 వ ఆర్థిక సంఘం నిధులు 1450 కోట్లు, విశాఖ, విజయవాడలలో మెట్రోలకు 40 వేల కోట్లకు అనుమతులు, ఏపీ అమరావతి నిర్మాణం కోసం ఏపీ సీఆర్డీయేకు 11వేల కోట్ల రుణం.. ఇలా ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తులకు వెనువెంటనే స్పందిస్తూ డబ్బులు కేటాయిస్తోంది కేంద్రం. ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు1,036 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇందులో పోలవరం, విశాఖ, విజయవాడలో మెట్రో రైల్, అమరావతి లాంటివి విభజన హామీల్లో ఉన్నవే. కానీ గతంలో వీటికి కేంద్రం నుంచి పెద్దగా సహకారం లభించలేదు. కానీ ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబుకు ఉన్న పరపతి వేరు. ఏపీ శాసిస్తే…. కేంద్రం పాటించాలి అన్నట్లు పరిస్థితి మారింది. ఇటు నుంచి చంద్రబాబు రిక్వెస్ట్‌ సిగ్నల్‌కు కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్స్‌ వస్తున్నాయి. దీంతో 2027 టార్గెట్‌ చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. 2027లోపు రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన మరిన్ని నిధులు పొంది.. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలన్నీ శుభ పరిణామాలని అటు ప్రభుత్వం.. ఇటు ప్రజలు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి