Prakasam District News: ఆమంచి కృష్ణమోహన్, ఆమంచి స్వాములు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకులు… వీళ్ళిద్దరూ అన్నదమ్ములు.. శ్రీకృష్ణుడికి బలరాముడు ఎలాగో, ఆమంచి కృష్ణమోహన్ రాజకీయాల్లో రాణించడానికి తెరవెనుక బలరాముడిలా కాపు కాసిన వ్యక్తి ఆమంచి స్వాములు. నిన్నటి వరకు అన్నదమ్ముల అనుబంధంగా ఉన్న వీరిద్దరి మధ్య సంబంధాలను ఇప్పడు రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయి. వీరిబంధానికి బ్రేక్ పడటానికి ఆధిపత్యపోరు ఆజ్యం పోసింది. దీంతో ఎవరికివారే యుమునా తీరే అన్నట్టుగా ఆమంచి బ్రదర్స్ ఎవరికివారు రాజకీయాలు చేసేందుకు సిద్దమైపోయారు… నిన్నటి వరకు చీరాల మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ తాజాగా పర్చూరు వైసిపి ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇంతకాలం తమ్ముడి చాటు అన్నలా వ్యవహారాలు చూసుకున్న పెద్దన్న ఆమంచి స్వాములు జనసేనలో చేరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు… శనివారం మంగళగిరిలో పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో మందీమార్బలంతో వెళ్ళి ఆమంచి స్వాములు జనసేనలో చేరారు… ఆమంచి స్వాములుపై చేయిపడితే అది పవన్‌కళ్యాణ్‌పై పడినేట్టే అంటూ పవన్ కళ్యాణ్ కూడా పార్టీలో చేరిన స్వాములుకు సినిమా స్టైల్లో అభయం కూడా ఇచ్చేశారు.
దీంతో అధిష్టానం ఆదేశిస్తే పర్చూరులో తమ్ముడిపైనే పోటీ చేస్తానని చెబుతారని అంతా అనుకున్నారు… దీంతో పర్చూరులో తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్ వైసిపి నుంచి… అన్న ఆమంచి స్వాములు జనసేన నుంచి పోటీ చేస్తారని భావించారు… అయితే అనూహ్యంగా బలరాముడికి కృష్ణుడిపై ప్రేమ పుట్టుకొచ్చింది… ఎంతైనా తమ్ముడే కదా… ఒకరిపై ఒకరు పోటీ చేస్తే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు – అంటున్నారట… అంతేకాకుండా కాపుకులంలో అందరూ కాకుల్లా పొడుస్తారు సుమీ అంటూ దీర్ఘాలు తీస్తున్నారట… ఇంతకీ ఆయన చెప్పొచ్చేదేంటంటే – తమ్ముడు తమ్ముడే… పేకాట పేకాటే కాదంటున్నారు… తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్ వైసిపి టికెట్‌పై పోటీ చేయనున్న పర్చూరులో కాకుండా కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న మరో నియోజకవర్గం గిద్దలూరు నుంచి జనసేన టికెట్‌పై పోటీ చేస్తానంటున్నారట.. ఎంతైనా అన్నదమ్ముల అనుబంధం కదా… దీంతో ఆమంచి బ్రదర్స్ ఎపిసోడ్ ఉమ్మడి ప్రకాశంజిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది…
చీరాల కేంద్రంగా గత 20 ఏళ్ళుగా ఆమంచి బ్రదర్స్ రాజకీయాలు చేశారు… ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన గెలుపుకోసం అన్న ఆమంచి స్వాములు చేయని అరాచకం లేదన్నట్టుగా వ్యవహారాలు నడిపారు… చీరాలలో ఆమంచి స్వాములుపై చాలా కేసులే ఉన్నాయి… 2019లో చీరాల వైసిపి టికెట్‌పై పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ ఓడిపోయిన తరువాత నుంచి అన్నదమ్ముల మధ్య ఆధిపత్యపోరు రాజుకుంది… దీంతో కొంతకాలం నుంచి ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు… చీరాలలో టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం వైసిపిలో చేరడంతో ఆమంచి కృష్ణమోహన్‌కు చీరాలలో ఇబ్బందులు ఎదురయ్యాయి… ఆయన్ను అధిష్టానం పర్చూరు వైసిపి ఇన్‌చార్జిగా వెళ్ళాల్సిందిగా కోరింది… ఆ సమయంలో ఆమంచి కృష్ణమోహన్ చీరాలను విడిచిపెట్టి వెళ్ళేందుకు సముఖంగా లేకపోవడంతో అన్న ఆమంచి స్వాములు రంగంలోకి దిగారు… తనకు పర్చూరు వైసిపి ఇన్‌చార్జి పదవి ఇస్తే పార్టీకి సేవ చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసిపి టికెట్‌పై పోటీ చేస్తానని వైసిపి పెద్దలకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు… అయితే అధిష్టానం తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్‌వైపే మొగ్గుచూపింది… చివరకు ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసిపి ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకుని పనిచేసుకుంటున్నారు… దీంతో అన్న ఆమంచి స్వాములు పరిస్థితి వైసిపిలో ఎటూ కాకుండా పోయింది… ఈ పరిస్థితుల్లో ఇక లాభం లేదనుకున్న అన్న ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు… పర్చూరులో తమ్ముడిపై పోటీకీ కూడా ఒకదశలో సై అన్నారట.
అయితే కుటుంబంలో విబేధాలు మరింత ముదిరే అవకాశం ఉండటంతో తమ్ముడిపై పర్చూరులో పోటీ చేయకుండా కాపులు ఎక్కువగా ఉన్న మరో నియోజకవర్గం గిద్దలూరు నుంచి జనసేన నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారట… దీంతో అన్నదమ్ములు చెరోపార్టీ నుంచి చెరో ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు అవకాశం లభించినట్టయింది… ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది… జనసేనలో చేరిన ఆమంచి స్వాములు తాను గిద్దలూరు నుంచి పోటీకి సిద్దమని జనసేన అధినాయకత్వానికి తెలిపారే కాని, అక్కడి నుంచి గిద్దలూరులో పోటీ చేసేందుకు ఆయనకు టికెట్ ఇస్తామన్న హామీ మాత్రం ఇంకా లభించలేదు… రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే ఆ పొత్తులో గిద్దలూరులో టిడిపి అభ్యర్ధికే ప్రాధాన్యమిస్తారని భావిస్తున్నారు… గిద్దలూరులో పోటీ చేసేందుకు టిడిపి ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి ఎప్పటి నుంచి వర్కవుట్ చేసుకుంటున్నారు… ఈ పరిస్థితుల్లో ఆమంచి స్వాములుకు గిద్దలూరు జనసేన టికెట్ లభిస్తుందా… అంటే డౌటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం