AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రికి తగ్గ తనయుడు.. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో సత్తా చాటిన విజయనగరం కుర్రాడు!

తండ్రి స్పూర్తితో దేశం మెచ్చే క్రీడాకారుడిగా మన్ననలు పొందుతున్నాడు విజయనగరం జిల్లా కొండవెలగాడకి చెందిన వల్లూరి అజయ్. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో తండ్రి భారత్‌కు కాంస్య పథకాన్ని తెచ్చిపెడితే.. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన సీనియర్ కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో అజయ్‌ స్వర్ణ పథకాన్ని సాధించి తండ్రికి తగ్గ తనయుడిగా పెరుతెచ్చుకున్నాడు.

తండ్రికి తగ్గ తనయుడు.. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో సత్తా చాటిన విజయనగరం కుర్రాడు!
Valluri Ajay Babu
Gamidi Koteswara Rao
| Edited By: Anand T|

Updated on: Aug 31, 2025 | 8:25 PM

Share

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా ఇటీవల నిర్వహించిన సీనియర్ కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడకి చెందిన వల్లూరి అజయ్ బాబు అద్భుత ప్రతిభ కనబరిచాడు. 79 కిలోల బరువు విభాగంలో బరిలో దిగిన అజయ్ బాబు.. స్నాచ్‌లో 152 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 183 కిలోలు ఎత్తి, మొత్తం 355 కిలోల బరువుతో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో అజయ్ పేరు ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ క్రీడా రంగంలో మారుమోగుతోంది. దీంతో అజయ్ బాబు విజయం వెనుక ఉన్న స్పూర్తి గాధ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తోంది. అజయ్ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత తరపున పోటీ పడి, కాంస్య పతకాన్ని సాధించి దేశానికి కీర్తి తెచ్చిపెట్టారు. తండ్రిని ఆదర్శంగా తీసుకున్న అజయ్ చిన్ననాటి నుంచే కఠోర సాధన చేస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగాడు. శ్రమ, పట్టుదల, క్రీడ పై ఉన్న అంకితభావంతో ఇప్పటికే పలు జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించాడు.

తాజాగా కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించడంతో ఆయన స్వగ్రామం కొండవెలగాడతో పాటు జిల్లావాసులు సైతం ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. గ్రామస్తులు, అభిమానులు, క్రీడా ప్రియులు శభాష్ అజయ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. స్థానిక క్రీడా సంఘాలు ఆయన సాధనను మెచ్చుకుంటున్నారు. భవిష్యత్‌లో కూడా ఒలింపిక్స్ సహా మరిన్ని వేదికల పై పతకాలు సాధించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

అజయ్ విజయం కేవలం వ్యక్తిగత గౌరవమే కాకుండా యువతకు క్రీడల వైపు మక్కువ పెంచే ప్రేరణగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పట్టుదల, కష్టపడి శ్రమిస్తే ఎవరైనా విజయ శిఖరాలను అధిరోహించవచ్చని అజయ్ మరోసారి నిరూపించాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.