AP News: పొలంలో మెరుస్తూ కనిపించిన రాయి.. ఏంటోనని చూడగా.. వాటే లక్
వర్షాకాలంలో కర్నూలు జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి, రామగిరి ప్రాంతాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. మట్టి పొరలు కొట్టుకుపోయి వజ్రాలు దొరుకుతుంటాయి. ఈ సీజన్‌లోను వజ్రాలు దొరుకుతున్నాయి. తాజాగా ఓ వ్యవసాయ కూలీకి వజ్రం దొరికింది.
సుడి తిరిగింది.. లక్ కలిసొచ్చింది. కర్నూలు జిల్లాలో తుగ్గలి మండలంలో పొలంలో పనులు చేస్తుండగా.. ఓ వ్యవసాయం కూలీగా మెరుస్తూ ఓ రాయి కనిపించింది. ఏంటా అని పరీక్షగా చూడగా.. అది వజ్రం అనిపించింది. వ్యాపారి దగ్గరికి తీసుకెళ్లగా అది వజ్రమే అని నిర్ధారించారు. అంతేకాదు రూ.2.5 లక్షలు ఇచ్చి ఆ వజ్రాన్ని కొనుగోలు చేశారు. అయితే బహిరంగ మార్కెట్‌లో ఆ వజ్రం విలువ రూ.5లక్షల విలువ ఉంటుందని సమాచారం. ఆ కూలికి సగం ధర ఇచ్చి వ్యాపారి మోసం చేశాడని స్థానికంగా చర్చించుకుంటున్నారు. బొల్లవానిపల్లెలో పొలం పనులకు వెళ్లిన కూలీకి ఈ వజ్రం దొరికిందట. పొలాల్లో వజ్రం లభించినా.. సామాన్యులకు వాటి విలువ, ధరపై అవగాహన ఉండదు. అధికారులకు తెలియకుండా ఆ వజ్రాన్ని అమ్మాలి అనుకోని.. ఎంతో కొంత ధరకు విక్రయిస్తుంటారు స్థానికులు. తుగ్గలి సమీప ప్రాంతాల్లో ఏటా ఇలా కోట్లలో వజ్రాలు వ్యాపారం జరుగుతుందట.
పంటలు లేక ఎండిన రాయల సీమ బీళ్ళలో మిలమిల మెరిసే వజ్రాలు బయటపడుతుంటాయి. ఒకనాటి రతనాల సీమే నేటి రాయల సీమన్నది జగమెరిగిన సత్యం. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో రాయలసీమలో రత్నాలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు రాశులుగా పోసి అమ్మవారట. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రత్నాలు, వజ్రాలను ఎడ్ల బండ్లల్లో తరలించే వారని కథలు కథలుగా చప్పుకుంటారు. నేడు జరుగుతున్నది అదే వజ్రాల వేటన్నది స్థానికుల మాట. మరో వాదన కూడా ఉంది. భూమి పొరల్లో జరిగే అనేకానేక మార్పుల కారణంగా అక్కడి పరిస్థితులను బట్టి వజ్రాలు, రంగురాళ్ళు ఏర్పడతాయి. కారణం ఏదైనా పత్తికొండలోని తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, బసినేపల్లి కొత్తూరు చెన్నంపల్లి చెరువు తండ తదితర గ్రామాలలో వజ్రాల లభ్యమవుతున్న ఘటనల గురించి ప్రతి ఏటా వింటున్నాం. గతంలో ఒక కేరెట్ నుంచి ముప్పై కేరెట్ల వజ్రాలు దొరికిన సందర్భాలు అనేకం. కూలీలు సైతం రాత్రికి రాత్రే లక్షాధికారులు గా మారిపోయిన ఘటనలేనకం ఉన్నాయి. పొలాల్లో చిన్న చిన్న రాళ్లు మెరుస్తూ ఉంటాయి. అవి రంగురాళ్ళు. తొలకరి వర్షాలతో వజ్రాలు సైతం ఉబికి వస్తుంటాయి.