ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ అరెస్ట్.. ఏకంగా రూ. 70 కోట్ల ఆస్తులను గుర్తించిన ఏసీబీ

మాజీ డిప్యూటీ CM , శ్రీకాకుళం జిల్లా YCP అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ వద్ద గతంలో ప్రభుత్వ పీఏగా చేసిన గొండు మురళి ఆస్తులపై ఏసీబీ రైడ్స్ నిర్వహించింది.

ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ అరెస్ట్.. ఏకంగా రూ. 70 కోట్ల ఆస్తులను గుర్తించిన ఏసీబీ
Gondu Murali. Ex Deputy Cm
Follow us
S Srinivasa Rao

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2024 | 9:36 AM

మాజీ డిప్యూటీ CM , శ్రీకాకుళం జిల్లా YCP అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ వద్ద గతంలో ప్రభుత్వ పీఏగా చేసిన గొండు మురళి ఆస్తులపై ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో గురువారం ఉదయం నుండి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు ACB అధికారులు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు, జిల్లాలోని మురళీ స్వగ్రామం కోటబొమ్మాళి మండలం దంత గ్రామం, లింగనాయుడిపేట, అతను పని చేస్తున్న బుడితి CHCలోనూ సోదాలు చేపట్టారు. కృష్ణ దాసు MLA గా, డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో సుదీర్ఘకాలం ఆయన వద్ద మురళీ PAగా పని చేశారు. కృష్ణ దాస్‌కి సన్నిహితుడిగా మెలిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తన మాతృశాఖ అయిన వైద్య ఆరోగ్యశాఖలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని బుడితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఓ సాధారణ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు మురళీ. గొండు మురళికి 20 ఎకరాలకు పైగా భూమి, విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో పలు ప్లాట్లు, ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, కిలో బంగారు ఆభరణాలు, 11.36 కిలోల వెండి వస్తువులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్‌ విలువ రూ.70 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు. గతంలో కృష్ణ దాస్ PAగా ఉన్న సమయంలో మురళి చక్రం తిప్పుతూ అతనికి తాయిలాలు ఇచ్చేవారికే ప్రభుత్వ అభివృద్ధి పనులు అప్పచెబుతున్నారని ఆరోపిస్తూ పలువురు కాంట్రాక్టర్లు టెక్కలిలో అధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భం కూడా ఉంది.

ACB సోదాలపై స్పందించిన మాజీ డిప్యూటీ సీఎం..

తన మాజీ P.A. గొండు మురళీ ఆస్తులపై జరిగిన ఏసీబీ దాడులకి సంభందించి మాజీ డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాసు స్పందించారు. మురళీ అయిన, ఇంకొకరైనా తప్పు చేస్తే అధికారుల సోదాలు చేయడం సర్వసాధారణమే అని కృష్ణ దాస్ తెలిపారు. తప్పు నిరూపితమైతే దానికి తగిన శిక్ష ఉంటుందని, దాన్ని తాను ఆహ్వానిస్తున్నాని చెప్పారు. ఎవరు తప్పు చేసినా దానికి అతీతులు కారని అన్నారు. తప్పు చేయకుండా ఉండాలి. మంచి పాలన అందించి పద్ధతిగా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నట్లు సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..