Guntur: బిడ్డను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న స్నేహితురాలి బాధను చూడలేక..
గుంటూరు జీజీహెచ్‌లో శిశువు వివాదంపై క్లారిటీ వచ్చింది. మీరాబీ అనే మహిళ.. తన బిడ్డ చనిపోతే మరో బిడ్డను తెచ్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. భట్టిప్రోలుకు చెందిన మీరాబీ.. గుంటూరు జీజీహెచ్‌లో డెలివరీ కోసం రాగా.. తక్కువ బరువుతో పుట్టిన ఆమె బిడ్డ చనిపోయింది. శిశువు మరణంతో మీరాబీ తీవ్ర ఆవేదనకు లోనైంది.
స్నేహితురాలి ఆవేదన చూడలేకపోయింది. బిడ్డను కోల్పోయి ఆమె పడుతున్న మనోవేదన కలిచి వేసింది. ఏదో ఒకటి చేసి తన స్నేహితురాలి ఆవేదన తీర్చాలనుకున్న ఆమె చివరకు ఒక శిశువును తీసుకొచ్చి చిక్కుల్లో పడింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన మీరాబి అనే మహిళ కొద్దీ రోజుల క్రితం డెలివరీ కోసం జిజిహెచ్ కు వచ్చింది. మీరాబితో పాటు ఆమె స్నేహితురాలు ప్రభావతి కూడా సాయం చేసేందుకు ఆసుపత్రిలోనే ఉంటుంది. అయితే మీరాబి మృత శిశువు జన్మనిచ్చింది. డెలివరీ సమయంలోనే శిశువు చనిపోవడంతో మీరాబి తీవ్ర ఆవేదనకు గురైంది. మీరాబి పరిస్థితి చూసి ప్రభావతి కూడా తల్లడిల్లిపోయింది. ఇదే సమయంలో చినగంజాంకు చెందిన లక్ష్మీ అనే బాలింత అనారోగ్యంతో జిజిహెచ్ కు వచ్చింది. కొద్దీ రోజుల తర్వాత లక్ష్మీ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెకు అప్పటికే ఆడ శిశువు ఉండటాన్ని ప్రభావతి గమనించింది.
లక్ష్మీ చనిపోవడంతో ఆమె భర్త సుబ్రమణ్యం శిశువును తీసుకొని చినగంజాం వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే తన స్నేహితురాలి బాధను చూడలేక ప్రభావతి ఈ నెల ఏడో తేదిన చినగంజాం వెళ్లింది. తల్లిని కోల్పోయిన శిశువును తనకు అప్పగించాలని సుబ్రమణ్యంను వేడుకొంది. అందుకు గాను రెండు లక్షల ఇస్తానని కూడా చెప్పింది. అప్పటికే ఎనిమిది సంతానం ఉండటం, లక్ష్మీ చనిపోవడంతో శిశువును ప్రభావతికి ఇచ్చేందుకు సుబ్రమణ్యం ఒప్పుకున్నాడు.
ఆ శిశువును తీసుకొని ప్రభావతి జిజిహెచ్ కు వచ్చింది. శిశువును తన స్నేహితురాలి ఒడిలోకి చేర్చి మురిసిపోయింది. అయితే మృత శిశివుకు జన్మనిచ్చిన మీరాబి ఒడిలో శిశువు ఉండటాన్ని ఆసుపత్రి సిబ్బంది గమనించి ప్రభావతిని ప్రశ్నించారు. ఆమె జరిగినదంతా చెప్పడంతో కొత్తపేట పోలీసులకు ఆసుపత్రి వర్గాలు ఫిర్యాదు చేశాయి.
శిశువును కొనుగోలు చేశారని తెలియడంతోనే శిశు సంరక్షణా శాఖ సిబ్బంది రంగంలోకి దిగి మీరాబి వద్ద నున్న తీసుకొని తీసుకెళ్లారు. శిశువు విక్రయం జరిగిందన్న అంశంపై కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసులు కేసును చినగంజాంకు ట్రాన్స్ ఫర్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..