వృద్ధాప్య పింఛన్ కోసం వెళ్లిన 36 ఏళ్ల మహిళ.. ఆధార్ కార్డు చూసిన అధికారులు షాక్..!
ఆధార్ నమోదులో చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారిపోయింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లికి చెందిన నారాయణమ్మ పరిస్థితి ఇప్పుఅగమ్యగోచరంగా తయారైంది. ఆమె అసలు వయసు 36 సంవత్సరాలు. కానీ ఆధార్ కార్డులో మాత్రం పుట్టిన తేదీ తప్పుగా నమోదైంది. దీంతో అధికారిక రికార్డుల్లో ఆమె వయసు ఏకంగా 102 సంవత్సరాలుగా కనిపిస్తోంది.

ఆధార్ నమోదులో చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారిపోయింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లికి చెందిన నారాయణమ్మ పరిస్థితి ఇప్పుఅగమ్యగోచరంగా తయారైంది. ఆమె అసలు వయసు 36 సంవత్సరాలు. కానీ ఆధార్ కార్డులో మాత్రం పుట్టిన తేదీ తప్పుగా నమోదైంది. దీంతో అధికారిక రికార్డుల్లో ఆమె వయసు ఏకంగా 102 సంవత్సరాలుగా కనిపిస్తోంది.
భర్త మరణించడంతో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన సమయంలో ఈ విషయం నారాయణమ్మకు తెలిసింది. ఆధార్‌లో వయసు తప్పుగా నమోదై ఉండటంతో పింఛన్ ప్రక్రియకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తన వాస్తవ వయసును నిరూపించుకుని ఆధార్‌లో వివరాలను సరిచేయించుకునేందుకు ఆమె ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ ఒక కీలక గుర్తింపు పత్రంగా మారింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు, బ్యాంకింగ్ సేవలు, వివిధ ధ్రువపత్రాల జారీ, ప్రయాణ సేవలు వంటి అనేక అవసరాలకు ఆధార్ వివరాలు కీలకంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆధార్‌లో పుట్టిన తేదీ, పేరు, చిరునామా వంటి వివరాల్లో తప్పులు ఉంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆధార్ ప్రారంభ దశలో సరైన జనన ధ్రువపత్రాలు లేదా ఇతర ఆధారాలు అందుబాటులో లేకపోవడంతో కొంతమంది వివరాలు అంచనా ఆధారంగా నమోదు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని సరిచేయాలంటే సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాల్సి రావడం, నిర్దిష్ట ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండటంతో ముఖ్యంగా చదువుకోని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నారాయణమ్మకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆమె అసలు వయసు 36 సంవత్సరాలు. కానీ ఆధార్ కార్డులో మాత్రం పుట్టిన తేదీ 18-10-1924గా నమోదైంది. దీంతో అధికారిక రికార్డుల్లో ఆమె వయసు ఏకంగా 102 సంవత్సరాలుగా కనిపిస్తోంది. ఆధార్‌లో నమోదైన తప్పుడు పుట్టిన తేదీ కారణంగా తనకు రావాల్సిన పింఛన్ పొందడంలో ఇబ్బందులు తలెత్తాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అధికారులను సంప్రదించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆధార్‌లో వయసు, పుట్టిన తేదీ తదితర వివరాల్లో తప్పులు ఉన్నవారు చాలామంది ఉన్నారని ప్రజలు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రతి ఒక్కరి సమస్యకు వెంటనే పరిష్కారం లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి. తన ఆధార్‌లో నమోదైన తప్పుడు పుట్టిన తేదీని సరిచేసి, వాస్తవ వయసు ఆధారంగా పింఛన్ పొందేలా అధికారులు సహకరించాలని నారాయణమ్మ వేడుకుంటోంది. తనలాంటి వారు ఆధార్ తప్పుల కారణంగా ప్రభుత్వ పథకాలకు దూరం కాకుండా.. అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె కోరుతోంది.
ఒక చిన్న నమోదుతప్పు.. 36 ఏళ్ల మహిళను అధికారిక రికార్డుల్లో 102 ఏళ్ల వృద్ధురాలిగా మార్చింది. ఆధార్ వివరాల్లో పొరపాట్లు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలకు సులభమైన పరిష్కార మార్గం చూపాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
