AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అచ్చమైన తెలుగింటి సంస్కృతి.. ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల కాన్వాయ్.. కోరిక నెరవేర్చుకున్న నవ వధువు!

"ఓల్డ్ ఈజ్ గోల్డ్" అనే మాటకు నిలువెత్తు రూపంగా నిలిచింది ఈ వేడుక. నేటి ఆధునిక కాలంలో ఆడంబరాలకు పోయి, లక్షల రూపాయలు ఖర్చు చేసి విదేశీ కార్లలో ఊరేగుతున్న పెళ్లి జంటల మధ్య, అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఒక వధువు మాత్రం మన మూలాలను గుర్తుకు తెచ్చేలా ఎడ్లబండిని ఎంచుకోవడం విశేషం.

అచ్చమైన తెలుగింటి సంస్కృతి.. ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల కాన్వాయ్.. కోరిక నెరవేర్చుకున్న నవ వధువు!
Bride On Bullock Cart
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Apr 12, 2026 | 8:08 PM

Share

“ఓల్డ్ ఈజ్ గోల్డ్” అనే మాటకు నిలువెత్తు రూపంగా నిలిచింది ఈ వేడుక. నేటి ఆధునిక కాలంలో ఆడంబరాలకు పోయి, లక్షల రూపాయలు ఖర్చు చేసి విదేశీ కార్లలో ఊరేగుతున్న పెళ్లి జంటల మధ్య, అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఒక వధువు మాత్రం మన మూలాలను గుర్తుకు తెచ్చేలా ఎడ్లబండిని ఎంచుకోవడం విశేషం.

అమలాపురం రూరల్ మండలం ఎ.వేమవరప్పాడు గ్రామానికి చెందిన భాగ్య సుష్మకు, కొర్లపాటివారి పాలెంకు చెందిన మనోజ్ తో వివాహం నిశ్చయమైంది. సాధారణంగా పెళ్లికూతురు అంటే లగ్జరీ కార్లలో వేదిక వద్దకు రావడం మనం చూస్తుంటాం. కానీ భాగ్య సుష్మ మాత్రం పూర్వపు సంప్రదాయాన్ని గౌరవిస్తూ, ముస్తాబు చేసిన ఎడ్లబండిపై ఊరేగుతూ కళ్యాణ వేదికకు చేరుకుంది.

కేవలం ఒక బండి మాత్రమే కాకుండా, ఏకంగా 16 ఎడ్లబండ్లతో కూడిన ఒక పెద్ద కాన్వాయ్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “బండెనక బండి కట్టి.. 16 బండ్లు కట్టి” అన్నట్లుగా వధువుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ ఎడ్లబండ్లపైనే అమలాపురం పట్టణ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లారు.

ఆడి, బెంజ్, రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన వాహనాల హడావిడి ఎక్కువగా ఉన్న నేటి రోజుల్లో, కోనసీమ మట్టి పరిమళం ఉట్టిపడేలా సాగిన ఈ ఊరేగింపు స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. పాత తరం జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, కొత్త తరానికి మన సంస్కృతిని పరిచయం చేసిన ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. సంప్రదాయబద్ధంగా సాగిన ఈ ఊరేగింపుతో వివాహ వేదిక వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

అమలాపురానికి చెందిన భాగ్య సుష్మ హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. అయితే, తన పెళ్లిని పక్కా కోనసీమ సంప్రదాయంలో జరుపుకోవాలని నిశ్చయించుకుంది. ఆధునిక కార్ల హడావిడి వద్దు అనుకుని, తన చిన్ననాటి కోరిక మేరకు ఎడ్లబండిపై పెళ్లి మండపానికి వెళ్లాలని తండ్రికి చెప్పింది. ఆమె కోరిక మేరకు ఎడ్లబండిని పూలతో, కొబ్బరాకులతో అందంగా అలంకరించారు. మేళతాళాల మధ్య సుష్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్లబండిపై ఊరేగింపుగా వెళ్తుంటే, అచ్చమైన పాతకాలపు పెళ్లిని చూస్తున్నట్లు ఉందని ఊరి జనం మురిసిపోయారు. రావూరి, పరసా వారి ఈ వేడుకలో సుష్మ-మనోజ్ ల వివాహం ఆధునికతను, సంప్రదాయాన్ని మేళవించి అందరినీ ఆకట్టుకుంది.

వీడియో ఇక్కడ చూడండి…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us