ఆడుకుంటుండగా ఏదో కుట్టిందంటూ చెప్పిన చిన్నారి.. కట్ చేస్తే.. క్షణాల్లో జరగరానిది జరిగిపోయింది..
Anantapur District: చిన్నారి ఆడుకుంటున్న సమయంలో బాత్రూం పైపు వద్ద చేయి పెట్టింది. అక్కడ ఏదో కుట్టిందని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని తల్లిదండ్రులు.. ఏదో గీసుకొని ఉంటుందిలే అని ఊరికే ఉండిపోయారు.

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పందికుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పాము కాటుతో జోష్నవి అనే రెండవ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. పందికుంట గ్రామానికి చెందిన సురేష్, రేణుక దంపతుల కూతురు జోష్నవి ఇంటి వద్ద ఆడుకుంటుండగా పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి ఆడుకుంటున్న సమయంలో బాత్రూం పైపు వద్ద చేయి పెట్టింది. అక్కడ ఏదో కుట్టిందని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని తల్లిదండ్రులు.. ఏదో గీసుకొని ఉంటుందిలే అని ఊరికే ఉండిపోయారు. ఇక కాసేపటికే చిన్నారి నోట్లో నుంచి నురగలు కక్కుతూ పడిపోయింది. దీంతో తల్లిదండ్రులు అనుమానంతో కుట్టినది ఏ విషపు పురుగో అయి ఉంటుందని చిన్నారి ఆడుకున్న ప్రదేశంలో వెతికారు. బాత్రూం పైపులో దూరిన పాము కనిపించడంతో.. వెంటనే తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు పామును చంపారు. అనంతరం చిన్నారిని హుటాహుటిన గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జోష్నవి మృతి చెందింది. చిన్నారి తనకేదో కుట్టిందని చెప్పిన మాటలను అప్పుడే పట్టించుకుని.. సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలించి ఉంటే చిన్నారి బ్రతికి ఉండేదేమో.. తల్లిదండ్రుల చిన్నపాటి అలసత్వం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
