Road Accidents in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం రహదారులు రక్తసిక్తమయ్యాయి. పలు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించారు. ప్రకాశం జిల్లాలోని అద్దంకి శివారు గరటయ్య కాలనీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని వివరాలు సేకరించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలాఉంటే.. గుంటూరు జిల్లాలోని కొల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారు. గ్రావెల్ లారీ అదుపు తప్పి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కొల్లూరు ఎస్టీ కాలనీకి చెందిన వీరంకి దాసు, జట్టి దినేష్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కాగా.. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం ఏడీబీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కారును లారీ గురువారం ఉదయం ఢీకొట్టగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం పెద్దవలస నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read: