Vanita Gupta: అగ్రరాజ్యంలో చరిత్ర సృష్టించిన మరో భారత సంతతి మహిళ.. అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా
భారత సంతతికి చెందిన వనితా గుప్తా అమెరికాలో చరిత్ర సృష్టించారు. అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా నియామితులయ్యారు.
Vanita Gupta : భారత సంతతికి చెందిన వనితా గుప్తా అమెరికాలో చరిత్ర సృష్టించారు. అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా నియామితులయ్యారు. ఈ పదవి చేపట్టనున్న శ్వేతజాతియేతర, తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా నియామకాన్ని ధ్రువీకరించేందుకు యూఎస్ సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించగా 51 ఓట్లు సాధించారు.ఈ క్రమంలో ఆమె నియామకానికి సెనేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంద మంది సభ్యులున్న సెనేట్‌లో రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీలకు చెరో 50 మంది సభ్యులున్నారు. టై అయితే ఓటు వేసేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం ఓటింగ్‌కు హాజరయ్యారు. న్యాయవిభాగ నామినీగా వనితను అధ్యక్షుడు బైడెన్ వనితను ఎంపిక చేశారు. దీంతో ఆమె నియామకానికి సెనేట్‌లో ఆమోదముద్ర పడింది.
ఈ మేరకు సెనెట్‌లో ఓటింగ్ జరగ్గా.. రిపబ్లికన్ నేత, సెనెటర్ లీసా మర్కోస్కీ మద్దతు పలకగా 51-49 స్వల్ప ఆధిక్యంతో వనిత విజయం సాధించారు. అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా విజయం సాధించినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభినందనలు తెలిపారు. భారతదేశం నుంచి వలస వెళ్లిన ఆమె తల్లిదండ్రులు ఫిలడెల్ఫియా ప్రాంతంలో స్ధిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం ప్రారంభించిన వనితా గుప్తా యేల్ విశ్వవిద్యాలయం నుండి బాచిలర్స్ డిగ్రీని సాధించారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి ఆమె ప్రొఫెషనల్ లా డిగ్రీని పొందారు.
ఆమె పౌర హక్కుల కోసం సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నారు. వనిత మొదట ఎన్‍ఏఏసీపీ లీగల్ డిఫెన్స్ ఫండ్‍లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ( ACLU ) లో ఉన్నత న్యాయ-లాభాపేక్షలేని న్యాయ సంస్థలో పనిచేశారు. అనంతరం ఒరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో న్యాయ శాఖలోని పౌర హక్కుల విభాగానికి నాయకత్వం వహించారు.