Shooting In US: అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి , 11మందికి గాయాలు
గత కొద్ది రోజులుగా అమెరికాలో వరసగా కాల్పుల ఘటనలు జరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. శనివారం రోజున సౌత్ స్ట్రీట్‌లో వందలాది మంది ప్రజలు సాయంత్రం ఆనందిస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.
Shooting In US: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఫిలడెల్ఫియాలో( Philadelphia) జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా 11 మంది గాయపడ్డారు. నివేదికల ప్రకారం, సౌత్ స్ట్రీట్‌లో(South street) అనేక రెస్టారెంట్లు , బార్‌లతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు చర్యలు తీసుకున్నారు. నగరంలో వీకెండ్ లో రద్దీగా ఉండే ప్రాంతంలో కాల్పులు జరిగాయని పోలీసు ఇన్‌స్పెక్టర్ డిఎఫ్ పేస్ చెప్పారు. అంతేకాదు కాల్పులు జరుపుతున్న ఆగంతకుడుపై ఓ అధికారి కాల్పులు జరిపినట్లు చెప్పారు. అయితే ఈ కాల్పుల్లో నిందితుడికి గాయాలు అయ్యాయో లేదో తెలియదన్నారు.
శనివారం రోజున సౌత్ స్ట్రీట్‌లో వందలాది మంది ప్రజలు సాయంత్రం ఆనందిస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలిపారు. కాల్పులు జరిగిన తర్వాత పద్నాలుగు మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఆస్పత్రికి చేరుకునే మార్గ మధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే మరణించినవారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
ఈ కాల్పుల ఘటనలో గాయపడిన మిగిలినవారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉందని తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరిని ఇప్పటి వరకూ అరెస్ట్ చేయలేదన్నారు. ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, ముష్కరులను గుర్తించేందుకు పోలీసులు నిఘా ఫుటేజీలను పరిశీలిస్తారని చెప్పారు. గత కొద్ది రోజులుగా అమెరికాలో వరసగా కాల్పుల ఘటనలు జరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..