AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా అధ్యక్ష పీఠంపై కొనసాగుతోన్న ఉత్కంఠ

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ఇంకా వీడట్లేదు. కౌంటింగ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు. ఎన్నికలు జరిగి 3 రోజులు అవుతున్నా..ఇంకా స్పష్టంకాని ఫలితాలు. తాజా సమాచారం ప్రకారం వైట్‌హౌస్‌ పీఠానికి డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ దగ్గరవుతున్నారు. నెవెడా, పెన్సిల్వేనియాలో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. అలస్కా, నార్త్‌ కరోలినాలో ట్రంప్ లీడ్‌లో ఉన్నారు. జార్జియాలో రీకౌంటింగ్‌ జరుగుతోంది. ఇప్పటివరకు బైడెన్‌కు 264 ఎలక్ట్రోరల్‌ ఓట్లు లభించగా ట్రంప్‌కు […]

అమెరికా అధ్యక్ష పీఠంపై కొనసాగుతోన్న ఉత్కంఠ
Venkata Narayana
|

Updated on: Nov 07, 2020 | 7:04 AM

Share

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ఇంకా వీడట్లేదు. కౌంటింగ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు. ఎన్నికలు జరిగి 3 రోజులు అవుతున్నా..ఇంకా స్పష్టంకాని ఫలితాలు. తాజా సమాచారం ప్రకారం వైట్‌హౌస్‌ పీఠానికి డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ దగ్గరవుతున్నారు. నెవెడా, పెన్సిల్వేనియాలో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. అలస్కా, నార్త్‌ కరోలినాలో ట్రంప్ లీడ్‌లో ఉన్నారు. జార్జియాలో రీకౌంటింగ్‌ జరుగుతోంది. ఇప్పటివరకు బైడెన్‌కు 264 ఎలక్ట్రోరల్‌ ఓట్లు లభించగా ట్రంప్‌కు 214 ఓట్లు వచ్చాయి. దాదాపు 99 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిన జార్జియాలో రీకౌంటింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. బిడెన్, ట్రంప్ మధ్య ఓట్ల శాతంలో స్వల్ప తేడా ఉండటమే ఇందుకు కారణం. ఓట్ల శాతంలో తేడా 0.5గా ఉండటంతో రీకౌంటింగ్‌ చేయాలని నిర్ణయించారు. కౌంటింగ్‌ ముగింపు వచ్చే సరికి జార్జియాలో బైడెన్‌కు కేవలం 1579 ఓట్ల ఆధిక్యత మాత్రమే ఉంది. అయితే – విదేశాల్లో ఉన్న సైనికులు పంపించిన పోస్టల్‌ బ్యాలెట్లను ఇంకా లెక్కించాల్సి ఉంది. దాదాపు 8 వేల పోస్టల్‌ బ్యాలెట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. రీకౌంటింగ్‌తో జార్జియా ఫలితం మరింత ఆలస్యం కావచ్చు. జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, అలస్కా, నెవాడాల్లో కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఇందులో జార్జియా ప్రస్తుతం కీలకంగా మారింది. అక్కడ అభ్యర్థుల మధ్య గెలుపు దోబూచులాడుతోంది. మొదట ట్రంప్‌ ఆధిక్యంలో ఉండగా.. తాజాగా బైడెన్‌ ముందంజలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. బైడెన్‌ గెలిస్తే ఈ ఓట్లన్నీ ఆయనకే పడతాయి. అప్పుడు అధ్యక్ష పీఠం సొంతమవుతుంది. అప్పుడు ట్రంప్‌ ఆశలు ఇక గల్లంతైనట్లే. జార్జియాలో ఓడిపోయి మిగతా నాలుగింటిలో గెలిచినా ట్రంప్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకోలేరు. మరోవైపు – జార్జియాలో బైడెన్‌ గెలిస్తే సెనెట్‌లో డెమొక్రాట్ల బలం పెరుగుతుంది. అప్పుడు చట్టాలు ఆమోదించడానికి, కీలక నియామకాలు చేపట్టడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఒకవేళ జార్జియాలో ఓడిపోయి.. మిగతా రాష్ట్రాల్లో గెలవడం ద్వారా బైడెన్‌ అధ్యక్షుడైతే మాత్రం సెనెట్‌లో ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెన్సెల్వేనియాలో 95 శాతం కౌంటింగ్ పూర్తయింది. బిడెన్ 5,587 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 20 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. నెవాడాలో 89 శాతం కౌంటింగ్ పూర్తి కాగా.. బిడెన్ 11,438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకా రెండు లక్షలకు పైగా ఓట్లు లెక్కించాల్సి ఉంది. అంతేగాక.. ఈనెల10 వరకు మెయిల్‌ బ్యాలెట్లను స్వీకరించనున్నారు. దీంతో ఇక్కడి ఫలితం ఇప్పుడప్పుడే వచ్చేలా కన్పించట్లేదు. ఈ ఎన్నికల్లో అలస్కా ఫలితమే చివరగా వచ్చేలా కన్పిస్తోంది. రిపబ్లికన్లకు పట్టున్న ఈ రాష్ట్రంలో ట్రంప్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ఇంతవరకూ అక్టోబరు 29 తర్వాత వేసిన ఎర్లీ ఓటింగ్‌ లెక్కింపును ప్రారంభించనే లేదు. ఈ లెక్కింపు పూర్తవడానికి మరో వారం రోజులు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఎలక్టోరల్‌ ఓట్లు 538 కాగా.. మెజారిటీకి 270 ఎలక్టోరల్‌ ఓట్లు కావాలి. ఇప్పటివరకు చూసుకుంటే బైడన్‌కు 264 ఎలక్టోరల్‌ ఓట్లు, ట్రంప్‌కు 214 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి.