అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. ప్రెసిడెంట్ రేసులో చివరకు నిలబడి తలపడేది ఎవరన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాట్ పార్టీ నుంచి ఆ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలుస్తున్నారు. వారిద్దరూ ఎన్నికల క్యాంపైన్ కూడా మొదలుపెట్టేశారు. అయితే ఇప్పుడు అధ్యక్ష పదవికి ఒక్కసారిగా భారత వారసత్వ మూలాలున్న కమలా హారిస్ పేరు తెరమీదకు వచ్చింది. అధ్యక్ష ఎన్నికల బరిలో జో బైడెన్‌కు బదులు కమలా హారిస్‌ను డెమోక్రాట్ పార్టీ చివరి క్షణంలో బరిలో నిలిపే ఛాన్స్ ఉందన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరోవైపు ఉపాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున ఒహియో సెనేటర్ జె.డి.వాన్స్ పేరు ఖరారయ్యింది. వాన్స్ సతీమణీ ఉషా చిలుకూరి కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే కావడం విశేషం. అలా రేసులో ఉన్న రెండు పార్టీల నుంచి కీలక పదవులకు పోటీ పడుతున్న వారిలో భారత్‌తో ఏదో విధంగా సంబంధం ఉండటంతో ఈ ఏడాది నవంబర్ 5న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బైడెన్ కాదంటే.. కమలాకే ఛాన్స్..
ఇటీవల నిర్వహించిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో అధ్యక్షుడు బైడెన్ తడబడగా.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధించారు. బైడెన్ మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారని.. ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని రిపబ్లికన్లు సలహా ఇస్తున్నారు. డెమొక్రాటిక్ పార్టీ నుంచి బైడెన్‌కు బదులు మరో వ్యక్తికి అవకాశం ఇస్తే మంచిదని సొంత పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. దీంతో బైడెన్‌కు బదులు కమలా హారిస్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రెసిడెంట్ రేసులో నిలిచే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష బరిలో తానే ఉంటానని బైడెన్ చెబుతున్నా.. ఏ క్షణంలోనైనా ఈ విషయంలో మార్పు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బైడెన్ అధ్యక్ష బరిలో నుంచి వైదొలగితే.. ప్రస్తుతం ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్‌కు ఆ అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అందుకే.. యావత్ ప్రపంచం చూపు కమలా హారిస్ వైపు చూస్తోంది. మరీ ముఖ్యంగా కమలా హారస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందన్న కథనాలతో.. ఇటు భారత్‌లోనూ అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలపై ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనికి కారణం.. ద మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ కమలా హారిస్ మన భారతీయ మూలాలున్న మహిళ కావడమే. సూపర్ పవర్ అమెరికాకు భారత సంతతికి చెందిన ఓ మహిళ అధ్యక్ష పీఠానికి చేరువ కావడం 130 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమే. మూడున్నరేళ్ల క్రితం ఆమె అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా భారతీయ హృదయం ఎంతో గర్వంతో పొంగిపోయింది. ఇప్పుడు అధ్యక్ష పీఠానికి దగ్గర కావడంతో ఇప్పుడు భారతీయులందరూ ఆమె వైపే చూస్తున్నారు.
యూఎస్ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ మహిళ ప్రెసిడెంట్ పీఠాన్ని అధిష్టించలేదు. అమెరికా చరిత్రలో వైస్ ప్రెసిడెండ్ పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ కమలా హారిస్. 1984లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ సారా పాలిన్ ఉపాధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచినా.. పార్టీల ఓటమి కారణంగా వారు విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. 2020 ఉపాధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ సాధించిన విజయం అంత ఈజీగా అయ్యింది కాదు. ఎన్ని ఆటంకాలు, విమర్శలు ఎదురైనా.. తన ప్రతిభతో సూపర్ పవర్ దేశానికి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిన కమలా హారిసే నెక్ట్స్ టైం అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉందంటూ కొందరు విశ్లేషకులు అప్పట్లోనే జోస్యం చెప్పారు. ఇప్పుడు డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా పేరు ఖరారు అయితే.. డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఖాయమని ఆ దేశ మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కమలా హారిస్ భారత మూలాలు..
కమలా హ్యారిస్‌కు భారతీయ-జమైకా వారసత్వ మూలాలు ఉన్నాయి. కమల తల్లి శ్యామలా గోపాలన్ స్వస్థలం చెన్నై. న్యూట్రిషనిస్ట్ అయిన శ్యామలా గోపాలన్ ఎండోక్రైనాలాజిలో రీసెర్చ్ కోసం అమెరికా వెళ్లినప్పుడు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పరిచయమైన డొనాల్డ్ హారిస్‌ను పెళ్లి చేసుకోని అక్కడే స్థిరపడ్డారు. డొనాల్డ్ హారిస్ జమైకా మూలాలున్న వ్యక్తి. వారికి 1964 అక్టోబర్ 20న జన్మించిన కమల.. లాయర్‌గా కొనసాగారు. 2003లో శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా విజయం సాధించారు. 2016లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేసి సెనేటర్‌గా ఎంపికయ్యారు. 2020లో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
తమిళనాడుకు చెందిన కమలా హారిస్ అమ్మమ్మ, తాతయ్య అంతా అభ్యుదయ భావాలున్న వారే. తాత పీవీ గోపాలన్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. దౌత్యాధికారిగా కూడా పని చేశారు. అమ్మమ్మ మహిళలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఎవర్నెస్ కోసం ప్రచారం చేసేవారు. చిన్నతనంలో తరచూ చెన్నైకు వస్తుండటం వల్ల కమలా మీద తాత పీవీ గోపాలన్ ప్రభావం ఎక్కువే అంటారు ఆమె బంధువులు. బాల్యంలో తన తాతయ్యతో చెన్నై బీచ్‌లో గడిపిన క్షణాలు మరవలేనివని గతంలో కమలా ఓ సందర్భంలో పేర్కొన్నారు.
కమల ఆత్మకథ ‘ద ట్రూత్స్ వి హోల్డ్’ పుస్తకం 2018లో విడుదలైంది. అందులో ‘‘కమల అంటే తామర అని అర్థం. భారత సంస్కృతిలో దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పైకి ఆ పువ్వు కొలనులో తేలియాడుతున్నట్లే కనిపిస్తుంది. కానీ, దాని వేళ్లు కొలను అడుగున బలంగా పాతుకుపోయి ఉంటాయి’’ అంటూ అమెరికన్లకు తన పేరు గురించి ఆ పుస్తకంలో వివరించారామె. అంతేకాదు.. తన ప్రస్థానానికి సంబంధించిన కీలక అంశాలను కూడా ఆ పుస్తకంలో పొందుపర్చారు.
కమలాకు మాయా అనే చెల్లెలు ఉన్నారు. చిన్నప్పుడు వారి ఇంట్లో ఎప్పుడూ నల్ల జాతి అమెరికన్ గాయకుల సంగీతం వినిపిస్తూ ఉండేది. చెల్లెలు మాయాతో కమలాకు అనుబంధం ఎక్కువే. కమలాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే, ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. కమలా, మాయాలను వారి తల్లి ఒంటరిగానే పెంచారు. కమలా తల్లి శ్యామల 2009లో చనిపోయారు. అప్పటికి ఆమె వయసు 70 ఏళ్లు.
కమల హోవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అమెరికాలో నల్లజాతీయులు ఎక్కువగా చదువుకునే యూనివర్సిటీల్లో అది ఒకటి. తన జీవితంపై ఎక్కువగా ప్రభావితం చూపిన అనుభవాల్లో కాలేజీ జీవితమూ ఒకటని ఆమె చెబుతుంటారు. న్యాయశాస్త్రంలో కమలాహారిస్ డిగ్రీ పొందారు. 2003లో శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీగా పనిచేసారు. తరువాత 2016లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా కొనసాగారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవి చేపట్టిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అమెరికన్, తొలి ఏసియన్ అమెరికన్ కూడా కమలా హారిసే. తన వాక్పటిమ, సంభాషణా చాతుర్యం, వాదనా పటిమతో చాలా తక్కువ సమయంలోనే ప్రజాకర్షణ పొందిన జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగారు.
అమెరికాలో అందరికీ సమానావకాశాలు దక్కాలని మొదట్నుంచీ తన వాణి వినిపించారు కమల. నల్లజాతీయుల సమస్యలూ, దక్షిణాసియా వాసుల ఇబ్బందులూ, వలసదారుల కష్టాలూ తెలిసిన వ్యక్తిగా కమలాకు రాజకీయ వర్గాల్లో గుర్తింపు ఉంది. మహిళలూ, అల్పాదాయ వర్గాల ప్రతినిధిగానూ పేరుంది.
యుఎస్ అధ్యక్ష ఎన్నికలపై భారతీయుల ఆసక్తి..
భారత మూలాలున్న కమలా హారిస్ అమెరికా అధ్యక్ష రేసులో నిలవడం యావత్ దేశ ప్రజలను ఉధ్విగ్నానికి గురిచేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారత్‌లో మునుపెన్నడూ లేనంతగా ఆసక్తిని రేపుతోంది. కమలా హారిస్ ప్రెసిడెంట్ రేసులో నిలుస్తారన్న కథనాలతో ఆ దేశంలోని మహిళలు, ఇండో- అమెరికన్స్, ఎన్నారైలు.. భారత్‌లోనే కాదు అటు జమైకాలోనూ ఆసక్తి నెలకొంటోంది. కారణం- కమలా హారిస్ మూలాలు ఆ దేశంలోనూ ఉన్నాయి. కమలా తల్లి భారతీయురాలైతే తండ్రి జమైకన్. అందుకే కమలాను ఓ వైపు ఆసియన్‌గా గుర్తిస్తూనే ఇంకో వైపు ఆఫ్రికన్‌గా కూడా వర్ణిస్తుంటారు. ఇంతకీ మీరు ఏ దేశస్థురాలిగా చెప్పుకోడానికి ఇష్టపడతావు అంటే.. నా మూలాలకు గర్వపడుతూనే అమెరికన్‌గా ఉండటానికి ఇష్టపడతానంటారామె. ప్రస్తుత ఎన్నికల్లో కమలాకు ఇవన్నీ కలిసొచ్చిన అంశాలుగా రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
కమలాను యుఎస్ అధ్యక్ష పీఠం వరిస్తే భారత్‌తో ఆమె ఎలాంటి సంబంధాలను నిర్వహిస్తారనేది ఇప్పుడే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే కశ్మీర్, ఆర్టికల్ 370 అంశాలపై భారత ప్రభుత్వ విధానాలను గతంలో కమలా హారిస్ విభేదించారు. కశ్మీర్ ప్రజలు ఒంటరి వాళ్లు కాదని, మేము అండగా ఉంటామనడం అప్పట్లో విమర్శలకు దారితీసింది. చాలా మంది ప్రవాసభారతీయులు కమలాహారిస్ ప్రసంగాన్ని తప్పుపట్టారు కూడా.
కమలా హారిస్ అంతటి సమర్థవంతురాలిని తను చూడలేదని గతంలో బైడెన్ అన్నారు. ఎలాంటి బెరుకు లేకుండా పోరాడే యోధురాలు.. దేశంలోని అత్యుత్తమ ప్రజా సేవకురాల్లో ఆమె ఒకరని ప్రశంసించారు. కమలాను అధ్యక్ష బరిలో నిలిపితే నల్ల జాతీయుల ఓట్లు, ఆసియా ఓట్లు, మహిళల ఓట్లు తమ పార్టీకి వస్తాయని డెమొక్రాటిక్ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు.
తమిళనాడులో కమలా బ్యానర్లు, కటౌట్లు..
కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన సమయంలో తమిళనాడులో కమలా హ్యారిస్ పేరు మార్మోగిపోతోంది. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ స్వస్థలం..తిరువరూరులో బ్యానర్లు, కటౌట్లతో హోరెత్తిస్తుంచారు స్థానికులు. ఆ ఎన్నికల్లో కమల గెలవాలంటూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు స్థానికులు. కమలా హారిస్ కుటుంబీకులతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తున్నారు. మన్నారుగుడిలోని కులచెందిరపురం అయ్యనారు స్వామి ఆలయానికి కమలా హారిస్ కుటుంబం ఎప్పటినుంచో విరాళాలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె అగ్రరాజ్య వైస్ ప్రెసిడెంట్ అయిన వేళ అక్కడ పెద్ద సంఖ్యలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ట్రంప్ గుండెల్లో గుబులు..
బైడెన్‌కు బదులుగా కమలా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తారన్న ఊహాగానాలతో ట్రంప్ గుండెల్లో గుబులు మొదలైంది. వలస వచ్చిన వారికి జన్మించిన ఆమెకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదంటూ గతంలో అక్కసు వెళ్లగక్కారు. కమలా హారిస్‌పై తన విమర్శల దాడిని ట్రంప్ ఈ సారి మరింత పెంచే అవకాశముంది. అయితే ఆయన వాదనను అమెరికా న్యాయనిపుణులు, డెమోక్రాట్స్ కొట్టిపారేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు చేపట్టే వ్యక్తులు..1787 తర్వాత అమెరికాలోనే జన్మించి పుట్టుకతో సహజ పౌరసత్వం పొందినవారై ఉండాలి. కమలా హారిస్ 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జన్మించారని..దీంతో ఆమె పోటికి అర్హురాలేనని..దీనిపై ఎలాంటి చర్చ అవసరం లేదని వారు స్పష్టం చేశారు. గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి కూడా ట్రంప్ ఇలానే ప్రచారం చేశారని డెమోక్రాట్స్ అంటున్నారు.
తాజాగా విడుదలైన ఓ వీడియోలో కమలా హారిస్‌పై నోరు పారేసుకోవడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆహె అభ్యర్థిత్వంపై ఏ స్థాయిలో ఆందోళన చెందుతున్నారో చెప్పకనే చెప్పారు. ప్రెసిడెంట్ రేసులో కమలా నిలిస్తే.. అమెరికాకు చెందిన మహిళలతో పాటు ఇండో- ఆఫ్రో- అమెరికన్లు ఆమె వైపే మొగ్గుచూపుతారని ట్రంప్ వర్గంలో ఆందోళన నెలకొంటోంది. కమలా అభ్యర్థిత్వం ఖరారైతే నిన్నటి దాకా ఓ లెక్క.. ఇక మరో లెక్క అన్నట్టు పరిణామాలు అనూహ్యంగా మారిపోనున్నాయి. కమలా హారిస్‌కు భారతీయ మూలాలు ఉండటం.. ఆమె అభ్యర్థిత్వాన్ని ఏషియన్స్ సపోర్ట్ చేయడంతో ట్రంప్‌కు నిద్ర కరువయ్యే అవకాశముంది.
ఉపాధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి తెలుగింటి అల్లుడు వాన్స్
ఇక జేడీ వాన్స్ విషయానికొస్తే ఓ రకంగా ఈయన ఇండియాకు మరీ ముఖ్యంగా తెలుగు వారి అల్లుడని చెప్పొచ్చు. ఆయన భార్య ఉష చిలుకూరి. ఉష తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. యేల్ విశ్వ విద్యాలయం నుంచి ఉష హిస్టరీలో డిగ్రీ పొందారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ నుంచి తత్వ శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయసంబంధ విభాగాల్లో ఎక్కువ కాలం పని చేశారు. పుట్టి పెరిగిందంతా కాలిఫోర్నియాలో శాండియాగో ప్రాంతం. యేల్ లా స్కూల్లో ఉష-వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో హిందూ సంప్రదాయంలో వారిద్దరూ పెళ్లి చేసుకోవడం విశేషం. వీరికి ముగ్గురు పిల్లలు. రాజకీయంగా అనేక విషయాల్లో భర్తకు అను నిత్యం తోడుగా ఉంటూ వచ్చారు ఉష.
అమెరికాలో ఉంటున్న భారతీయులను ఆకట్టుకుంటే తమ విజయం సులువవుతుందని రెండు ప్రధాన పార్టీలు భావిస్తాయి. అమెరికాలోని అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, మిచిగాన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో భారతీయ ఓటర్లు దాదాపు 13 లక్షల మంది ఉన్నారు. వీరే అధ్యక్ష ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్. మొత్తానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉన్న రెండు పార్టీల్లోనూ భారతీయ మూలాలున్న వ్యక్తులు ప్రధాన పదవులకు పోటీ చేస్తుండటం యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్ డౌన్లోడ్ చేసుకోండి.