North Korea: ఉత్తర కొరియాలో ఆకలి కేకలు.. విదేశాల సాయం కోరేందుకు కిమ్‌కు నోరు వస్తుందా?
North Korea Food Shortage: కరడుగట్టిన నియంత కిమ్ జోంగ్ ఉన్న ఏలుబడిలోని ఉత్తర కొరియా తీవ్ర ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొంటోంది. తిండి గింజలు లేక జనం ఆకలితో అలమటిస్తున్నారు.
North Korea Food Shortage: కరడుగట్టిన నియంత కిమ్ జోంగ్ ఉన్న ఏలుబడిలోని ఉత్తర కొరియా తీవ్ర ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొంటోంది. తిండి గింజలు లేక జనం ఆకలితో అలమటిస్తున్నారు. మరో గత్యంతరం లేక చాలా మంది నిత్యవసర గృహోపకరణాలను అమ్ముకుని ఆకలి తీర్చుకుంటున్నారు. 1990నాటి తీవ్ర కరువు పరిస్థితుల తర్వాత మరోసారి ఇక్కడ అదే తరహా పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదే పరిస్థితులు కొనసాగితే ఇక తాము బతికి బట్టకట్టడం కష్టమేనని ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీవ్ర ఆహార ధాన్యాల కొరతతో దేశంలో లక్షలాది ఆకలి చావులు తథ్యంకావచ్చన్న ఆ దేశ అధికారిక గణాంకాలే చాటిచెబుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడం కిమ్ సర్కారుకు సవాలుగా మారింది. ఆ దేశంలో గత మూడు దశాబ్ధాల కాలంలో మునుపెన్నడూ లేనిస్థాయిలో నెలకొంటున్న ఆహార సంక్షోభ పరిస్థితిని ప్రభుత్వ సంస్థ కొరియా డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ కూడా ధృవీకరిస్తోంది.
ఉత్తర కొరియా జనాభా 2.6 కోట్ల మంది. ఆ దేశ ప్రజల ఆకలి తీరాలంటే ప్రతియేటా తక్కువలో తక్కువ 5.75 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు కావాలి. అయితే గత ఏడాది ఆ దేశంలో 4.4 మిలిమన్ టన్నుల ఆహార ధాన్యాలను దిగుబడి అయినట్లు అంచనావేస్తున్నారు. దీంతో ఆ దేశానికి 1.35 మిల్లియన్ టన్నుల ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతోంది. గతంలోనూ ఆ దేశం ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొంది. అయితే ఈ సారి భారీ స్థాయిలో కొరత ఉండటంతో దీన్ని అధిగమించడం కిమ్ ప్రభుత్వానికి సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఏడాది వేసవికాలంలో ఏర్పడిన తుపాను కారణంగా ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. దీంతో భారీగా పంట నష్టం జరగడంతో పాటు అక్కడ కొత్తగా పంట సాగుబడి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. సాగుకు అనువైన ప్రాంతాలపైనే తుపాను ఎక్కువ ప్రభావాన్ని చూపింది.
దీనికి తోడు కరోనా పాండమిక్ కారణంగా ఉత్తర కొరియా తమ దేశ సరిహద్దులను మూసేయడంతో పొరుగుదేశాల నుంచి వ్యవసాయ పనిముట్లు దిగుబడి చేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ పనిముట్లు అందుబాటులో లేకపోవడం ఆ దేశ వ్యవసాయ రంగం పాలిట శాపంగా మారింది. పంట సాగుబడి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో అన్నదాతలు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంటోంది. దేశంలోకి కరోనా వైరస్ రాకూడదన్న ముందుచూపుతో కిమ్ విధించిన తీవ్రమైన ఆంక్షలు కూడా ఆ దేశ జనం పాలిట శాపంలా మారింది.
కయ్యాల మారి ఉత్తర కొరియాకు చైనాతో తప్ప మిగిలిన పొరుగు దేశాలతో సంబంధాలు అంతంత మాత్రమే. ఆ విషయానికి వస్తే మిగిలిన ప్రపంచ దేశాలతోనూ పెద్దగా ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు లేవు. సాయం చేస్తామన్నా మీ సాయం మాకొద్దులే అనే అహంకారపూరిత నైజం నియంత కిమ్ సొంతం. దేశ జనం ఆకలి బాధను తీర్చేందుకు సాయం చేయాలని ఇతర దేశాలను కోరేందుకు కిమ్‌కు నోరు రాకపోవచ్చు. ప్రస్తుత ఆహార ధాన్యాల సంక్షోభాన్ని గట్టెక్కేందుకు చైనా సాయం తీసుకోవాలని కొరియా డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ కిమ్ ప్రభుత్వానికి సూచించింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో చైనా కూడా తిండి గింజల కొరతను ఎదుర్కొంటోంది. ముందుచూపుతో గత కొన్ని మాసాల నుంచే విదేశాల నుంచి తిండి గింజలు దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాకు ఏ మేరకుఆ దేశం సాయం చేయగలదో వేచిచూడాల్సిందే. నమ్ముకున్న దేశాలను నట్టేట ముంచడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య.
ఈ నేపథ్యంలో పరిస్థితి చేయిదాటిపోక ముందే కిమ్ స్పందించాల్సిన అవసరం ఉంది. తనను నమ్ముకున్న జనం కోసం కిమ్ ఇతర దేశాల సాయాన్ని కోరుతారో? జనం ఆకలి బాధను చూసీచూడనట్లు ఉండిపోతారో? వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి..
జియో టీవీని ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లో చూడాలనుకుంటున్నారా? ఇలా ట్రై చేయండి..
భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!