చైనా తర్వాత భారత్‌ను తాకిన హెచ్‌ఎంపీవీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలి సారిగా స్పందించింది. ఈ వైరస్ ను సాధారణ వైరస్‌గా WHO అభివర్ణించింది. HMPV అంటే హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ కొత్తది కాదని..దీనిని 2001లోనే గుర్తించామని సంస్థ తెలిపింది. ఇది చాలా కాలంగా ప్రజలలో ఉంది.. ఈ వైరస్ ప్రభావం శీతాకాలంలో పెరుగుతుందని పేర్కొంది.
ఇటీవల చైనాలో అనేక HMPV కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ వైరస్ కేసులు భారతదేశంలో కూడా వెలుగులోకి రావడం మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆందోళన మరింత పెరిగింది. ఈ వైరస్ కూడా కరోనా లాంటి వినాశనానికి కారణమవుతుందా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజలు భయాందోళన చెందవద్దని ఇటీవల ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు WHO కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్‌లో ఇది శీతాకాలం, వసంతకాలంలో వ్యాపించే సాధారణ వైరస్. శ్వాసకోశ ఇబ్బంది, సాధారణ జలుబు వంటి లక్షణాలు ఉండవచ్చు అని పేర్కొంది.
దేశంలో ఇప్పటివరకు అధికారికంగా తొమ్మిది హెచ్‌ఎంపివి కేసులు నమోదయ్యాయి, మహారాష్ట్రలో బుధవారం ఉదయం తొమ్మిదవ కేసు నమోదైంది, ఈ ఇన్‌ఫెక్షన్ హిరానందని హాస్పిటల్‌లోని 6 నెలల బాలికలో కనుగొనబడింది. గతంలో నాగ్‌పూర్‌లో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో తొలి వైరస్ కేసు నమోదైంది. అక్కడ రెండు కేసులు, తమిళనాడులో రెండు కేసులు, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. అయితే తెలంగాణాలో గత ఏడాది డిసెంబర్ లోనే ఈ వైరస్ కేసులు నమోదయ్యాయని ఓ ప్రైవేట్ ల్యాబ్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..