ఈ కట్టడం మసీదుగా మారబోతున్నదా?

ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌ కూడా ఈ సూత్రానికి తగినట్టుగా వ్యవహరిస్తున్నారు. తయ్యిప్ ఎర్డోగాన్ మనస్తత్వమేమిటో.. ఎలాంటివారో మనకు చాలా బాగా తెలుసు.. మన ప్రధాని మోదీ ఆయనను దూరం పెట్టింది కూడా అందుకే! బడితె ఉన్నోడిదే బర్రె..

  • Balu
  • Publish Date - 11:15 am, Fri, 3 July 20
ఈ కట్టడం మసీదుగా మారబోతున్నదా?

Hagia Sophia Into a Mosque Again (Undoing Atatürk) : అధికారంలోకి రావడానికి, ఉన్న అధికారాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రార్థనమందిరాలు, మసీదులు బాగా అక్కరకు వస్తాయి.. ఇది సార్వజనీన సూత్రం! ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌ కూడా ఈ సూత్రానికి తగినట్టుగా వ్యవహరిస్తున్నారు. తయ్యిప్ ఎర్డోగాన్ మనస్తత్వమేమిటో.. ఎలాంటివారో మనకు చాలా బాగా తెలుసు.. మన ప్రధాని మోదీ ఆయనను దూరం పెట్టింది కూడా అందుకే! బడితె ఉన్నోడిదే బర్రె… బలమున్నోడిదే రాజ్యం మన పెద్దలు ఊరికే అనలేదు.. ఇస్తాంబుల్‌లోని చారిత్రక కట్టడమైన హయా సోఫియాను మసీదుగా మార్చాలనే ప్రతిపాదనలో కేవలం రాజకీయపరమైన అంశమే దాగుంది.. మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు దండుకోవాలన్న కుటిన యత్నమూ ఉంది.

ఇప్పుడా చారిత్రక కట్టడం మసీదు కాబోతున్నదా లేక ఇప్పుడున్నట్టుగానే మ్యూజియంగా ఉంటుందా అన్నది తేలడానికి మరో 15 రోజుల సమయం ఉంది.. ఈ ప్రతిపాదనపై తీసుకోవలసిన నిర్ణయాన్ని టర్కీ దేశపు అత్యున్నత న్యాయస్థానంగా పరిగణించే కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ వాయిదా వేసింది. 17 నిమిషాల పాటు సాగిన విచారణ తర్వాత 15 రోజుల తర్వాత తీర్పును ప్రకటిస్తామని కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ తెలపడంతో మళ్లీ టర్కీలో ఈ కట్టడం చుట్టూ రాజకీయాలు మొదలయ్యాయి.

ఒకవేళ కోర్టు మసీదుగా మార్చండని తీర్పు ఇస్తే మాత్రం 85 ఏళ్లుగా మ్యూజియంగా ఉంటూ వస్తున్న ఈ చారిత్రక కట్డడంలో మళ్లీ ప్రార్థనలు ప్రారంభమవుతాయి.. అసలు గత ఎన్నికల్లో తయ్యిప్‌ ఎర్డోగన్‌ ప్రధాన ఎజెండా ఇదే! అధికారంలోకి వస్తే హయా సోఫియాను మళ్లీ మసీదుగా మారుస్తానని తెగ ప్రచారం చేసుకున్నారాయన! ఆ అంశమే ఆయనను గెలిపించిందా లేదా అన్నది పక్కన పెడితే చాలా మంది ఈయన ప్రతిపాదనకు ఓకే చెప్పారని అర్థమవుతోంది.

15 శతాబ్దల ఘన చరిత్ర ఉన్న ఈ పురాతనమైన కట్టడానికి ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి.. ఎన్నో రాజ్యాల, రాజవంశీకుల ఉత్థాన పతనాలకు ఈ కట్టడం ఓ సజీవ సాక్ష్యం. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ చారిత్రక కట్టడానికి ఇప్పుడు మతం రంగు పులుముకుంది.. మ్యూజియంగా మారకముందు ఇది మసీదుగా ఉండిందన్నది ఎంత నిజమో.. అంతకు ముందు ఇదో చర్చిగా ఉన్నది కూడా అంతే చారిత్రక వాస్తవం.. ఇస్లాం మద్దతుదారులు దీనిని మసీదుగా మార్చాల్సిందేనని ఎప్పటినుంచో పట్టుబడుతున్నారు.. సెక్యులర్లు మాత్రం వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

ఈ వివాదంలో ఇతర దేశాలు కూడా జోక్యం చేసుకోవడం మొదలు పెట్టడంతో ఇదో అంతర్జాతీయ సమస్యగా మారింది. గ్రీస్‌ సాంస్కృతిక శాఖ మంత్రి లీన మెండోని ఈ ప్రతిపాదనకు మొదటి నుంచి వ్యతిరేకి! టర్కీ ప్రభుత్వం మతవాదాన్ని ప్రేరేపిస్తున్నదని ఆమె ఘాటుగానే విమర్శించారు. ప్రస్తుతం మ్యూజియంగా ఉన్న హయా సోఫియాను మసీదుగా మార్చడం అంత సులభమైన పని కాదని, అన్ని వర్గాలు ఆమోదించాలని యునెస్కో డిప్యూటీ డైరెక్టర్‌ ఎర్నెస్టో ఒట్టోన్‌ రామిరెజ్‌ అంటున్నారు కానీ రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా? తయ్యిప్‌ ఎర్డోగాన్‌కు తిమ్మిని బమ్మి చేసే చాతుర్యం ఉంది కాబట్టే అంతర్జాతీయ సమాజం కాసింత ఆందోళన చెందుతోంది..

ఇస్తాంబుల్‌లోని ఫతిః జిల్లాలో బోస్పోరస్‌లో ఈ చారిత్రక కట్టడం ఉంది.. గ్రీకులో హాజియా సోఫియా, లాటిన్‌లో శాంక్ట సోఫియాగా ఈ కట్టడాన్ని పిల్చుకుంటారు. మొదట ఇది చర్చినే! ఒట్టోమన్‌ వంశీయులు దీన్ని మసీదుగా మార్చారు.. క్రీస్తుశకం 537లో బైజాంటీన్‌ చక్రవర్తి జస్టినియాన్‌ ఈ కట్టడాన్ని నిర్మించారు. దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద క్రైస్తవ చర్చిగా విలసిల్లింది.. అనేక మార్లు ఒడిదుడుకులకు లోనైంది. భూకంపాలు ఈ కట్టడాన్ని దెబ్బ తీసినా మళ్లీ మళ్లీ నిర్మాణం గావించుకుంది. రోమ్‌లోని సెయింట్‌ పీటర్‌ బాసలిక్‌ చర్చ్‌ నిర్మాణమయ్యే వరకు ఈ కట్టడం గోపురమే ప్రపంచంలో అతి పెద్దదిగా ఉండింది.

క్రీస్తుశకం 1204 నుంచి 1261 వరకు రోమన్‌ క్యాథలిక్‌ క్రైస్తవ మందిరంగా ఉన్న ఈ కట్టడం క్రీస్తుశకం 1261 నుంచి 1453 వరకు గ్రీక్‌ ఆర్ధోడక్స్‌ క్రైస్తవ మందిరంగా ఉండింది.. క్రీస్తుశకం 1453లో ఇస్లాం వంశీయులైన ఒట్టోమన్‌లు ఈ నగరాన్ని ఆక్రమించుకుని దీన్ని మసీదుగా మార్చేశారు. 1931లో టర్కీలో నెలకొన్న అంతర్గత యుద్ధాల కారణంగా ఈ మసీదు తలుపులు మూతపడ్డాయి.. అయితే మూడో దశకంలో టర్కీ కొత్త రూపాన్ని సంతరించుకుంది..

టర్కీష్‌ రిపబ్లిక్‌ సృష్టికర్త అయిన ముస్తఫా కెమల్‌ అటాటుర్క్‌ సెక్యులర్‌ భావాలున్న వ్యక్తి.. ఆయన అధికారంలోకి రాగానే ఈ మసీదును మ్యూజియంగా మార్చేశారు.. ఆధునిక టర్కీ ఓ సెక్యూలర్‌ దేశమని ప్రపంచానికి తెలియపరిచాడు. 1934లో చేసిన చట్టం ప్రకారం ఈ భవనంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరగకూడదు.. ఇప్పుడు ఆ దేశపు అత్యున్నత న్యాయస్థానం దీనినే పరిశీలిస్తోంది.. ముస్తఫా కెమల్‌ అటాటుర్క్‌ చేసిన సవరణలో చట్టబద్ధత ఎంత అన్నది తేల్చబోతున్నది.

అధ్యక్షుడు అండదండలతో గత కొంతకాలంగా ఈ కట్టడాన్ని మసీదుగా మార్చాలని ఇస్లాంవాదులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. హయా సోఫియాను మసీదుగా మారిస్తే మాత్రం క్రైస్తవులు ఊరుకోరని.. వారి మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆర్చ్‌ బిషప్‌ పాట్రియార్క్‌ బర్థోలమ్యూ హెచ్చరిస్తున్నారు.. అదే జరిగితే దేశం రెండుముక్కలవుతుందని అంటున్నారు. హయా సోఫియాను మసీదుగా మార్చడమన్నది అంత క్షేమకరం కాదని చెబుతున్నారు యూఎస్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పోంపేయో.

అమెరికా రాయబారి శామ్‌ బ్రౌన్బ్యాక్‌ కూడా మసీదుగా మార్చకూడదని అంటున్నారు. మరోవైపు అధికారపక్షమైన జస్టిస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పార్టీ – ఏకేపీ మాత్రం ప్రపంచదేశాల జోక్యంపై తీవ్రంగా అధిక్షేపిస్తున్నది.. టర్కీ భూభాగంలో ఉన్న ఈ కట్టడంపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు తమకు ఉందని..దీనిపై ఏథెన్స్‌కు ఎలాంటి సంబంధం లేదని అంటోంది.. తమ దేశం, సంపదపై నిర్ణయాధికారం తమకు మాత్రమే ఉందని చెబుతున్నారు ఆ దేశ విదేశాంగ మంత్రి మెవ్లట్‌ కవుసోగ్లు. మొత్తంమీద ఎన్నో విషాదాలను చవి చూసిన శతాబ్దాల ఓ చారిత్రక కట్టడంపై ఇప్పుడు మతం రంగు పులుముకొనడమే అతి పెద్ద విషాదం..