ఆఫ్రికా దేశంలో పేదరికం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పొట్టకూటికోసం ఆఫ్రికన్లు ప్రపంచంలోని ధనిక దేశాలకు శ్రామిక బానిసలుగా అమ్ముడుపోతుంటారు. తరాలు మారినా.. టెక్నాలజీ అభివృద్ధి చెందినా.. ఆఫ్రికన్ల జీవితాల్లో మాత్రం ఇసుమంత కూడా మార్పు రావట్లేదు. తాజాగా ఓ చైనీస్ యజమాని.. ఇద్దరు ఆఫ్రికన్ కార్మికులను కొరడాలతో విచక్షణా రహితంగా కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియో క్లిప్‌లో ఓ కంటైనర్‌లో ఇద్దరు ఆఫ్రికన్ యువకులు కాళ్లు ముడుచుకుని కూర్చుని ఉండటం చూడొచ్చు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ చైనా వ్యక్తి వారిపై అరుస్తూ చేతిలో కొరడాను పట్టుకుని వారిని చావబాదడం కనిపిస్తుంది. దెబ్బలకు తాళలేక ఆ ఇద్దరు వ్యక్తులు చేతులతో తలలు దాచుకోవడం వీడియోలో చూడొచ్చు. అయినా ఏ మాత్రం కనికరం లేకుండా చైనా దొర ఆ కార్మికులను చావగొట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను డామ్ లుక్రే అనే యూజర్ ఎక్స్‌లో మే 3న మధ్యాహ్నం 12.26 గంటలకు పోస్ట్ చేయగా కేవలం నిమిషాల వ్యవధిలోనే దాదాపు 13 మిలియన్ల వీక్షణలు, లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనీయులు ఆఫ్రికన్ వర్కర్లను ట్రాన్స్ అట్లాంటిక్ బానిసలుగా ట్రీట్ చేస్తున్నారంటూ వీడియోకి క్యాప్షన్‌లో లూక్రే రాశాడు. ఆఫ్రికాలోని శ్వేతజాతీయుల కంటే చైనీయులకు చాలా ఎక్కువ జాత్యహంకారం ఉందని పేర్కొన్నాడు.
‘ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల ఘటనల్లో అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు’, ‘ప్రతి జాతికి బానిసలు ఉన్నారు. అలాగే ప్రతి జాతి వారిలో చెడ్డ వ్యక్తులు ఉన్నారు. ప్రతి జాతిలో మెజారిటీగా ఉన్న మంచి వ్యక్తులందరూ.. అన్ని జాతులలోని చెడ్డవారికి వ్యతిరేకంగా కలిసి నిలబడవలసిన సమయం ఇది’, ‘ఉద్యోగులను కొట్టకూడదనే ఇంగిత జ్ఞానం లేదా.. చూసేందుకు జుగుప్సాకరంగా ఉంది’ అని నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో పేర్కొన్నారు. కాగా ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆఫ్రికన్ కార్మికుల పట్ల చైనీస్ ప్రాజెక్ట్ మేనేజర్ల దుర్మార్గాన్ని ఎత్తిచూపుతూ ఓ నివేదిక వెలువడింది. ఆఫ్రికాలోని స్థానిక కార్మికులు దుర్భాషలాడుతున్నారని, భయంకరమైన పరిస్థితుల్లో వారితో బలవంతంగా పని చేయిస్తున్నారని, కాంట్రాక్ట్ జీతం కంటే చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారని ఓ వార్తాపత్రిక తెలిపింది. ఈ ఆఫ్రికన్ ఉద్యోగులతో ఎక్కువ గంటలు పని చేయిస్తూ.. తక్కువ వేతనాలు ఇస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
🔥🚨BREAKING NEWS: This disturbing footage of a Chinese employer in Africa treating his employees like Trans Atlantic slaves is going viral across the internet.
Viewers have begun discussing on how it appears the Chinese are ‘fare more racist than the White man’ in Africa. pic.twitter.com/4zTnliEQea
— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) May 2, 2024
2022లో సెంట్రల్ ఆఫ్రికన్ దేశమైన రువాండాలోని కోర్టు ఓ చైనీస్ వ్యక్తికి 20 యేళ్ల జైలు శిక్ష విధించింది. ఓ వర్కర్‌ని కొరడాతో కొడుతున్న వీడియో వైరల్ అవడంతో ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటన తర్వాత రువాండాలోని తన పౌరులను స్థానిక చట్టాలను అనుసరించాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.