US vs Iran: ఇరాన్‌కు అమెరికా వార్నింగ్.. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా B-52 బాంబర్ల మోహరింపు
అటు వార్, ఇటు వార్నింగులతో మిడిల్ ఈస్ట్‌లో వార్ టెన్షన్ మరింత పెరిగింది. ఇజ్రాయెల్‌పై అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే దాడి చేస్తామంటూ హెచ్చరించిన ఇరాన్‌కు గట్టి వార్నింగ్ సిగ్నల్ ఇచ్చింది ఆగ్రరాజ్యం.
అమెరికాకు చెందిన బి-52 బాంబర్ విమానాలు… పశ్చిమాసియాకు చేరుకున్నాయి. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు తాము ఈ విమానాలను మోహరిస్తామని అగ్రరాజ్యం హెచ్చరించిన కేవలం 24 గంటల్లోనే ఇవి గల్ఫ్ ప్రాంతానికి చేరుకున్నాయి. వీటితోపాటు ఫైటర్ జెట్లు, ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, బాలిస్టిక్ మిసైల్స్ కూడా తరలించింది. ఇరాన్, దాని మద్దతున్న సంస్థలు అమెరికా సైన్యం లేదా తమ దేశ ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే అడ్డుకుని తమ వారిని…అంటే ఇజ్రాయెల్‌ను కాపాడుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అని ఇరాన్‌కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇక అమెరికా బాంబర్ల రాక, వార్నింగులతో కాక పెరిగింది. అమెరికాపై ఇరాన్ మండిపడుతోంది. అగ్రరాజ్యానికి గట్టి సమాధానం చెబుతామని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హెచ్చరించారు.
అమెరికా ఎంట్రీ ఇస్తే…తమ అణు విధానాన్ని పునః పరిశీలించాల్సి ఉంటుందని ఖమేనీ సలహాదారు కమాల్ ఖర్రాజ్ అన్నారు. అమెరికా ప్రకటన తర్వాత, ఇజ్రాయెల్ దూకుడు చూపిస్తోంది. ఇజ్రాయెల్ కమాండోలు లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపారు. లెబనాన్ తీరంలో ఓ హెజ్‌బొల్లా సీనియర్ ఆపరేటివ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ దాడులను లెబనాన్ తీవ్రంగా పరిగణించింది. ఐరాసలో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై దాడి విషయంలో ఇరాన్ స్వరం మారింది. నిన్నమొన్నటివరకు ప్రతిదాడి సంకేతాలను అంతగా ఇవ్వని టెహ్రాన్ ఇప్పుడు ప్రతీకారం తప్పదంటోంది.
ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వార్నింగుల నేపథ్యంలో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. లెబనాన్‌లోని బెకా వ్యాలీపై ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో 52 మంది మృతి చెందగా.. 72 మంది గాయపడ్డారు. గాజాలోనూ 24 గంటల్లో 42 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. హెజ్‌బొల్లా రాకెట్ దాడుల్లో 11 మంది ఇజ్రాయెలీలు గాయపడ్డారు.
మరిన్ని అంతర్జతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..