UKRAINE-RUSSIA WAR: మరింత తీవ్రంగా రష్యా, యుక్రెయిన్ యుద్దం.. ఆ లక్ష్యం నెరవేరితేనే పుతిన్ ఆగేది..!
Russia Ukraine Crisis: పక్షం రోజులకుపైగా కొనసాగుతున్న రష్యా, యుక్రెయిన్ యుద్దానికి ముగింపెప్పుడు ? ఈ ప్రశ్న ఇపుడు సామాన్యులను సైతం వేధిస్తోంది...
UKRAINE-RUSSIA WAR INTENSIFIED PUTIN TARGET IS KYIV: పక్షం రోజులకుపైగా కొనసాగుతున్న రష్యా, యుక్రెయిన్ యుద్దానికి ముగింపెప్పుడు ? ఈ ప్రశ్న ఇపుడు సామాన్యులను సైతం వేధిస్తోంది. ఫిబ్రవరి నాలుగో వారంలో రష్యా ప్రారంభించిన దురాక్రమణ (?)కు ధీటుగా స్పందించిన యుక్రెయిన్ మిలిటరీ ఇపుడు అలసి పోయినట్లు, యుద్ద వనరులను పూర్తి స్థాయిలో కోల్పోయినట్లు కనిపిస్తోంది. అయితేనేం యుక్రెయిన్ సైన్యం వెన్ను చూపడం లేదు. వీరోచిత పోరాటంతో తమ దేశాన్ని రక్షించుకుంటామంటూనే వుంది. సైన్యానికి తోడుగా వందలాది మంది సామాన్య ప్రజలు ఆయుధాలు చేతబట్టి యుద్దంలోకి దిగారు. అయితే.. రెండు, మూడు రోజుల క్రితం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రకటన చూసిన తర్వాత యుద్దం ముగింపు దశకు వచ్చినట్లే కనిపించింది. కానీ రష్యా మాత్రం ఓవైపు చర్చల్లో పురోగతి వుంది అంటూనే దాడులను ముమ్మరం చేసింది. యుక్రెయిన్ దేశంలోని కీలక నగరాల్లో విధ్వంసం సృష్టించడమే కాకుండా రాజధాని కీవ్ ఆక్రమణకు రంగం సిద్దం చేసుకుంది. ఈ క్రమంలో యుద్దం ఆగాలంటే ఇపుడేం జరగాలి ? ఏ విషయంలో రష్యా పంతం నెరవేరితే యుద్దానికి విరమణ లభిస్తుంది ? ఇవి చర్చనీయాంశాలుగా మారాయి.
2021 ఏప్రిల్ నుంచి వ్యూహాత్మకంగా తమ సైన్యాన్ని యుక్రెయిన్ దేశానికి మూడువైపులా మోహరించడం మొదలుపెట్టాడు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. నవంబర్ తర్వాత మిలిటరీ మోహరింపు మరింత ఊపందుకుంది. రష్యన్ సైనిక దళాల కదలికలు.. యుద్దానికి వినియోగించుకునే ట్యాంకర్లు, ఇతర మిలిటరీ వాహనాల తరలింపు కూడా మొదలైంది. ఈ సమాచారం అందుకున్న యుక్రెయిన్ అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్రయించింది. నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ)లో చేరేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రష్యా కదలికలను పసిగట్టిన అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరికలు జారీ చేయడం మొదలుపెట్టాయి. యూరప్ దేశాల హెచ్చరికలతో డిసెంబర్ 2021లో రష్యా తమ బలగాలను వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించింది. మూడు రోజుల్లో బలగాల ఉపసంహరణ పూర్తవుతుందని కూడా పుతిన్ ఆనాడు నమ్మబలికాడు. కానీ పుతిన్ ప్రకటన కేవలం ప్రకటనకే పరిమితమైంది. రష్యా దళాలు యుక్రెయిన్ సరిహద్దులోనే వుండిపోయాయి. ఆ తర్వాత జనవరి 2022 నుంచి పుతిన్ మరింత వ్యూహాత్మకంగా రష్యన్ మిలిటరీని యుక్రెయిన్ దేశానికి ఉత్తరాన వున్న బెలారస్, దక్షిణాన నల్లసముద్రంలో వున్న క్రిమియా ప్రాంతాలను తరలించారు. నిజానికి క్రిమియా 2014 దాకా యుక్రెయిన్ దేశంలో అంతర్భాగం. ఆ తర్వాత రష్యా ఆధీనంలోకి వెళ్ళింది. క్రిమియాను రష్యా పాలిత ప్రాంతంగా గుర్తించే విషయంలో యుక్రెయిన్ అనుసరించిన విధానం రష్యాకు ఆగ్రహం తెప్పించింది. దానికి తోడు నాటో కూటమిలో చేరడం, అమెరికా, బ్రిటన్ దేశాలకు యుక్రెయిన్ దగ్గరవడం పుతిన్‌కు నచ్చలేదు సరికదా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్యంగా పెట్టుకున్న రష్యా పునర్వైభవానికి యుక్రెయిన్ చర్యలు విఘాతం కలిగిస్తున్నాయని ఆయన భావించారు. యుక్రెయిన్‌పై సైనిక చర్య జరపడం ద్వారా ఆ దేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేలా పుతిన్ వ్యూహాన్ని రచించారు. ఆ వ్యూహం ప్రకారమే యుక్రెయిన్ దేశంపై దాడులకు ఫిబ్రవరి నాలుగో వారంలో శ్రీకారం చుట్టారు.
నిజానికి ఫిబ్రవరి మూడోవారంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. యుక్రెయిన్ దేశాన్ని మూడు వైపులా చుట్టేసిన రష్యన్ సైన్యం ఫిబ్రవరి 16వ తేదీన యుద్దాన్ని ప్రారంభిస్తుందని అమెరికా చెబుతూ వచ్చింది. ఈక్రమంలో జర్మనీ ఛాన్స్‌లర్ షొంజే రంగంలోకి దిగారు. ఫిబ్రవరి 15వ తేదీన ఆయన రష్యా రాజధాని మాస్కోకు వెళ్ళారు. పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ చర్చల ఫలితమో లేక రష్యా వ్యూహమో ఫిబ్రవరి 16 తేదీన తమ బలగాలను యుక్రెయిన్ సరిహద్దు నుంచి ఉపసంహరిస్తున్నామని ప్రకటించారు. సహజంగానే రష్యా ప్రకటనను అమెరికా, బ్రిటన్, యుక్రెయిన్లు విశ్వసించలేదు. దాంతో రష్యా కొన్ని వీడియోలను విడుదల చేసింది. అందులో రష్యన్ బలగాలు వెనక్కి మళ్ళుతున్నట్లుగా వుంది. అయితే.. ఆ బలగాలు ఎటు వెళుతున్నాయో ఆ వీడియోల్లో క్లారిటీ లేదు. కానీ రష్యా తమ బలగాలను ఉపసంహరించడం కాదు.. అదనంగా మరిన్ని బలగాలను యుక్రెయిన్ సరిహద్దుకు తరలిస్తోందంటూ అమెరికా, బ్రిటన్ దేశాలు శాటిలైట్ చిత్రాలను విడుదల చేశాయి. అదేక్రమంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతున్నట్లు సంకేతాలందాయి. అదేసమయంలో తూర్పు యుక్రెయిన్ ప్రాంతంలోని డాన్ బాస్ ఏరియాలో రష్యా అనుకూల తీవ్రవాద సంస్థలు జనావాస ప్రాంతాలే లక్ష్యంగా కాల్పులు ప్రారంభించాయి. ఈ తీవ్రవాదులను నిర్మూలించేందుకు యుక్రెయిన్ సైన్యం రంగంలోకి దిగింది. పరస్పర దాడులతో తూర్పు యుక్రెయిన్ ప్రాంతం భీతావహ దృశ్యాలకు వేదికైంది. ఈక్రమంలోనే డాన్ బాస్ ప్రాంతంలోని డోనెట్స్క్, లోహాన్స్క్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు రష్యా ప్రకటన చేసింది. ఈ రెండింటిని ప్రత్యేక దేశాలుగా యుక్రెయిన్ అంగీకరిస్తే.. యుద్దం తప్పుతుందని చాలా మంది భావించారు. కానీ రష్యా డాన్ బాస్ ఏరియాను ఆక్రమించుకునేందుకు రంగంలోకి దిగింది. ఫిబ్రవరి 24వ తేదీన రష్యా సైన్యం యుక్రెయిన్ సరిహద్దు దాటేసింది. దాడులు ప్రారంభించింది. రష్యా సైన్యాన్ని తిప్పికొట్టేందుకు యుక్రెయిన్ ప్రతిఘటించినా పెద్దగా ఫలితం లేకపోయింది. తూర్పు యుక్రెయిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూనే.. మరోవైపు రష్యా సైన్యం బెలారస్ మీదుగా యుక్రెయిన్ బోర్డర్ దాటింది. చారిత్రాత్మక చెర్నోబిల్ అణు కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంది.
చెర్నోబిల్ స్వాధీనం తర్వాత రష్యా సైన్యం రాజధాని కీవ్ వైపు పయనం మొదలుపెట్టడంతో యుద్దం తీవ్ర రూపం దాల్చినట్లయ్యింది. ఈక్రమంలోనే యుక్రేనియన్లు వేల సంఖ్యలో దేశం విడిచిపోవడం మొదలైంది. తమ దేశానికి పశ్చిమాన వున్న పోలండ్, హంగరీ, స్లోవేకియా, రోమేనియాలపై వారు తరలివెళ్ళారు. దాంతో రైళ్ళు కిక్కిరిసి పోయాయి. రోడ్ల మార్గాన, కాలినడకన వేలాది మంది ఎల్వీవ్ నగరం వైపు వెళ్ళి అక్కడ పోలండ్ బోర్డర్ దాటేందుకు ప్రయత్నించారు. మరోవైపు యుద్ద విరమణ కోసం కొన్ని దేశాలు ప్రయత్నించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నయానాభయానా ఒప్పించేందుకు యత్నించాయి. ఇంకోవైపు అమెరికా సహా పలు దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యన్ బ్యాంకుల లావాదేవీలను స్థంభింప చేశాయి. ఈ ఆంక్షల ప్రభావం పుతిన్‌పై ఏ విధంగాను కనిపించలేదు. కానీ వివిధ దేశాల్లో వున్న రష్యన్లు మాత్రం తమ అకౌంట్లు బ్లాక్ అవడంతో అవస్థల పాలయ్యారు. అంతర్జాతీయంగా ఇంత పెద్ద స్థాయిలో ఒత్తిడి పెరుగుతున్నా పుతిన్ మాత్రం ఏ మాత్రం దిగిరాలేదు. కీవ్ నగరమే లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగుతూనే వున్నాయి. పుతిన్ దృష్టిలో కీవ్ నగరం అత్యంత కీలకం.. ప్రతిష్టాత్మకం కూడాను. ఎందుకంటే 700 సంవత్సరాల క్రితం మాస్కో కంటే ముందు సంయుక్త రష్యాకు కీవ్ నగరమే రాజధాని. అలాంటి చారిత్రక నేపథ్యం వున్న కీవ్ తమ గుప్పిట్లోను వుండాలనేది పుతిన్ అభిమతం. దాడుల నేపథ్యంలో యుక్రెయిన్ మాత్రం పూర్తిగా కునారిల్లిపోయింది. దాడులతో అతలాకుతలమైంది. ప్రధాన నగరాలు ఖార్కీవ్, ఒడెస్సా, కీవ్, సుమీ, జప్రోజియా వంటివి చాలా మేరకు విధ్వంసమయ్యాయి. జరుగుతున్న డ్యామేజీ తీవ్రంగా వుండడంతో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కీలక ప్రకటన చేశాడు. నాటో చేరే విషయంలో ఇకపై ఎలాంటి ముందడుగు వేయబోమని ప్రకటించారు. ఇది రష్యా ప్రధాన డిమాండ్లలో ఒకటి కావడంతో యుద్దం ముగుస్తుందని కొందరు భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.
తాజా పరిణామాల నేపథ్యంలో పుతిన్ ఏమి కోరుకుంటున్నారు అనే విషయంపై పలువురు పలురకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. అయితే.. ఈ విశ్లేషణలను క్రోడీకరిస్తే మాత్రం యుక్రెయిన్ దేశాన్ని పూర్తిగా గుప్పిట్లో పెట్టుకునే దాకా పుతిన్ దాడులు ఆపరన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈలోగా యుక్రెయిన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగుతున్నాయని అంచనా. పశ్చిమ యుక్రెయిన్‌పై ఇంతకాలం దాడులు చేయని రష్యా మార్చి 10, 11, 12 తేదీలలో పశ్చిమ యుక్రెయిన్ ప్రాంతంలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తోంది. ఇంకోవైపు కీవ్ నగరాన్ని చుట్టుముట్టిన రష్యన్ సైన్యం ఏ క్షణంలో అయినా నగరాన్ని ఆక్రమించుకునేందుకు సిద్దంగా వున్నాయి. ఈనేపథ్యంలో రష్యా వ్యూహాన్ని పలువురు విశ్లేషిస్తున్నారు. కీవ్ నగరాన్ని నిర్బంధించడం ద్వారా జెలెన్స్కీ ప్రభుత్వాన్ని కూలదోసి.. రష్యా అనుకూల వ్యక్తికి సారథ్యం బాధ్యతలు అప్పగించడం రష్యా వ్యూహంలో ఓ భాగంగా తెలుస్తోంది. అయితే.. జెలెన్స్కీ లొంగిపోతే.. తమ డిమాండ్లకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే అతన్ని పదవీచ్యుతున్ని చేయబోమని రష్యా ప్రకటించడం విశేషం. కమెడియన్ పాత్రలు పోషించిన జెలెన్స్కీ యుద్ద ప్రారంభమయ్యాక చూపిన తెగువ, సాహసం అతన్నిపుడు యుక్రేయిన్లతో ఓ వార్ హీరోని చేసాయి. దాంతో అతను రష్యా డిమాండ్లకు తలొగ్గి తన హీరోయిజాన్ని కోల్పోతాడా అన్నది సందేహమే. ఈక్రమంలో జెలెన్స్కీని మార్చాల్సిన అగత్యం రష్యా ముంగిట కనిపిస్తోంది. అదేసమయంలో యుక్రెయిన్ భవిష్యత్తులోను తోక జాడించకుండా వుండేందుకు మిలిటరీ పరంగా ఆ దేశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే పుతిన్ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే పశ్చిమ యుక్రెయిన్‌లో వున్న మిలిటరీ బేస్‌లను కూడా రష్యాన్ సైన్యం ధ్వంసం చేస్తోంది. యుక్రెయిన్‌ను పూర్తిగా చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా పుతిన్ అడుగులు వేస్తున్నట్లు తాజా విశ్లేషణలు చాటుతున్నాయి. చెప్పుచేతల్లో వుండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదా జెలెన్క్కీని దారిలోకి తెచ్చుకోవడం.. భవిష్యత్తులో తోక జాడించకుండా అన్నింటా నిర్వీర్యం చేయడం.. ఈ లక్ష్యాలు నెరవేరిన మరునిమిషంలో రష్యా యుద్దాన్ని ముగించే అవకాశం వుందని తెలుస్తోంది.