ఉక్రెయిన్ పై దాడికి రష్యా సమాయత్తం.. అప్పటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం వరకు జరిగిందిదే..
ఉక్రెయిన్ పై దాడికి రష్యా సిద్ధమైంది. క్రిమియా, బెలారస్‌తో పాటు తూర్పు ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనికులను మోహరించింది. 90వ దశకంలో సోవియట్ యూనియన్ లో కమ్యునిస్టు పాలనకు వ్యతిరేకంగా
ఉక్రెయిన్ పై దాడికి రష్యా సిద్ధమైంది. క్రిమియా, బెలారస్‌తో పాటు తూర్పు ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనికులను మోహరించింది. 90వ దశకంలో సోవియట్ యూనియన్ లో కమ్యునిస్టు పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చెలరేగింది. 1990లో ఉక్రెయిన్ లో నాలుగు లక్షల మందితో ఇవనో -ఫ్రాకివెస్క్ నుంచి కీవ్ వరకు 400 మైళ్ల మేర మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం సొంతంగా పార్లమెంట్ ఏర్పాటు చేసుకుని, 1990 జులై లో ఒకసారి, 1991 ఆగస్ట్ 24న మరోసారి ఉక్రెయిన్ స్వాంతంత్ర్యం ప్రకటించుకుంది. 1991 డిసెంబర్ లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో ఉక్రెయిన్ కు పూర్తి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటినుంచి సోవియట్ యూనియన్లో భాగాలైన దేశాలపై పట్టు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న రష్యా.. ఆ మేరకు అడుగులు వేసింది. ఈ క్రమంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం ప్రస్తుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు నచ్చలేదు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే ప్రస్తావించడం ప్రధాన్యం సంతరించుకుంది.
పాత్రికేయుడి హత్యకు ఆదేశాలు..
ఉక్రెయిన్ తూర్పు నుంచి ఈశాన్యం వరకు రష్యాతో సరిహద్దులను కలిగివుండగా, ఉత్తరాన బెలారస్, పశ్చిమాన పోలండ్, స్లొవేకియా, హంగరీ దేశాలు, దక్షిణాన అజోవ్ సముద్రం, నల్ల సముద్రం, నైరుతి భాగంలో రొమేనియా, మాల్డోవాలతో సరిహద్దులను కలిగి ఉంది. 1992లోనే నాటోతో ఉక్రెయిన్ సంబంధాలు ప్రారంభమయ్యాయి. నాటో- ఉక్రెయిన్ వైఖరులను రష్యా తప్పబట్టింది. 1994 బుడాపెస్ట్ ఒప్పందంపై అమెరికా, రష్యా, యూకేలు సంతకాలు చేశాయి. ఉక్రెయిన్ స్వాతంత్య్రాన్ని, సరిహద్దులను గౌరవించాలని ఒప్పందం చేసుకున్నాయి. ఈ సమయంలో రష్యా అనుకూల లియోనిడ్ కుచ్ మా అధ్యక్షుడు అయ్యాక.. ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగం ప్రభావం అధికమైంది. ఓ పాత్రికేయుడి హత్యకు లియోనిడ్ ఆదేశాలు జారీ చేసిన వీడియో అప్పట్లో లీక్ అయింది. దీంతో లియోనిడ్ పరపతి దెబ్బతింది. అనంతరం తన వారసుడిగా విక్టర్ యాన్కోవిచ్ ను లియోనిడ్ ఎంపిక చేశారు. మరోవైపు రష్యా అధ్యక్షుడిగా పదవిని చేపట్టిన వ్లాదిమిర్ పుతిన్.. యాన్కోవిచ్ కు మద్దతు తెలిపారు.
ప్రత్యర్థిపై విషప్రయోగం..
అధ్యక్ష ఎన్నికల్లో యాన్కోవిచ్, ప్రజాస్వామ్య మద్దతుదారు విక్టర్ యష్చంకో మధ్య పోటీ ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో యష్చంకోపై విషప్రయోగం జరిగిందని నిర్దారణ అయింది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడంతో మూడుసార్లు పోలింగ్ నిర్వహించారు. విక్టర్ యష్చంకోను విజయం వరించడం.. రష్యాకు మింగుడు పడలేదు. అప్పటి నుంచి ఉక్రెయిన్ లో రష్యాకు వ్యతిరేక పరిస్థితులు ఏర్పడ్డాయి. 1992లో నాటో లో చేరడానికి ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలు 2008 నాటికి తారాస్థాయికి చేరాయి. 2008లో నాటోలో చేరడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు యష్బంకో, ప్రధాని టిమో షెంకో లు ప్రయత్నాలు చేపట్టారు. వీరికి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ మద్దతు తెలిపారు. బుష్ నిర్ణయాన్ని ఫ్రాన్స్, జర్మనీ దేశాలు సమర్థించాయి. ఉక్రెయిన్ లో నాటో చేరికను నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. ఫలితంగా ఉక్రెయిన్ నాటోలో చేరాలన్న ప్రతిపాదన వాయిదా పడింది.
రష్యా ఆగ్రహం..
నాటో తీరుతో రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009 జనవరి 1న ఉక్రెయిన్, ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరా నిలిపివేసింది. అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యలో పుతిన్ తో ఉక్రెయిన్ ప్రధాని టిమోషెంకో చర్చలు జరిపారు. 2010 లో రష్యా అనుకూలుడు విక్టర్ యాన్కోవిచ్ ఉక్రెయిన్ అధ్యక్ష పదవి చేపట్టారు. తమ దేశం నాటోతో తటస్థంగా ఉంటుందని యాన్కోవిచ్ ప్రకటించారు. 2009 గ్యాస్ సంక్షోభ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారించి, మాజీ ప్రధాని టిమోషెంకోకు అధ్యక్షుడు యాన్కోవిచ్ జైలుశిక్ష విధించారు. ఈ ఘటనను ఉక్రెయిన్ ప్రతిపక్ష నేతలు, అమెరికా, ఐరోపా దేశాలు తప్పుబట్టాయి.
ఈయూతో సంబంధాలు..
2013లో యూరోపియన్ యూనియన్(ఈయూ) సహకారానికి అధ్యక్షుడు విక్టర్ యాన్కోవిచ్ ముందడుగు వేశారు. సంతకం చేసే చివరి నిమిషంలో యాన్కోవిచ్ వైఖరి మార్చుకున్నారు. దీంతో ఉక్రెయున్ లో భారీగా అల్లర్లు చెలరేగాయి. రాజధాని కీవ్ లోని మైదన్ స్క్వేర్ లో ప్రభుత్వ భవనాలను ఆందోళనకారులు ఆక్రమించారు. ఈ ఆందోళనలు, ఘర్షణల్లో వందమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో 2014లో యాన్కోవిచ్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు. ఈ ఆందోళనల అనంతరం ఉక్రెయిన్లో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఈ నూతన ప్రభుత్వాన్ని రష్యా గుర్తించలేదు. ఇది తిరుగుబాటు చర్యగా ప్రకటించింది. అనంతరం ఉక్రెయిన్ ప్రాంతం క్రిమియాలో రష్యా సైనికుల మద్ధతుతో సాయుధుల తిరుగుబాటు చేశారు. సాయుధుల ఆధీనంలో ఉన్న క్రిమియాలో చేపట్టిన రెఫరెండంలో రష్యాలో చేరేందుకు ప్రజలు సుముఖత వ్యక్తం చేశారు.
నేటికీ కొనసాగుతున్న ఘర్షణలు
ఫలితంగా క్రిమియా తమదేశ భూభాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యాపై అమెరికా, ఈయూ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. 2014 ఏప్రిల్ నెలలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో 40వేల మంది సైనికులను రష్యా మోహరించింది. ఉక్రెయిన్ లోని డాన్ బాసో ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో తమ ప్రమేయం లేదని రష్యా వెల్లడించింది. 2014 జూన్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెస్ట్రన్ కంట్రీస్ అనుకూలుడు పెట్రో పొరోషెకో.. డాన్ బాసో లో రష్యా అలర్లను ప్రేరేపిస్తోందని పశ్చిమ దేశాలు ఆరోపించాయి. 2014 సెప్టెంబర్ లో ఫ్రాన్స్, జర్మనీల మధ్యవర్తిత్వంతో రష్యా- ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కారణంగా కొంతకాలం అల్లర్లు నిలిచిపోయాయి. అనంతరం చెలరేగిన ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రష్యా అనుకూల తిరుగుబాటుదారులు, ఉక్రెయిన్ సైన్యం మధ్య నేటికీ ఘర్షణలు కొనసాగుతున్నాయి. తిరుగుబాటుదారులు, ఉక్రెయన్ దళాల మధ్య జరిగిన పోరులో 14,000 మందికి పైగా మృతి చెందారు. మరోవైపు ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులతో అక్కడి ప్రజల్లో రష్యా పట్ల వ్యతిరేకత పెరిగింది. నాటో, ఈయూలో చేరాలన్న డిమాండ్ కు మద్దతు పెరిగింది.
రష్యా సైబర్ దాడులు..
2016లో కీవ్ పవర్ గ్రిడ్, 2017లో ఉక్రెయిన్ నేషనల్ బ్యాంక్, ఎలక్ట్రిక్ గ్రిడ్ తదితరాలపై రష్యా సైబర్ దాడి చేసింది. 2019లో నటుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. జెలెన్స్కీ చేసిన శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2021 ఏప్రిల్ లో ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద వ్యతిరేక విన్యాసాలు చేశారు. 2021 ఆగస్టులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహాయం కోరారు. నాటోలో ఉక్రెయిన్ సభ్యత్వానికి అంగీకరించిన అమెరికా.. నాటోలో చేరడానికి అవసరమైన నిబంధనలను ఉక్రెయిన్ పాటించకపోవడంతో నాటో సభ్యత్వం అభ్యర్థన పెండింగ్ లో పడింది. 2021 నవంబర్ నాటికి ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా పూర్తి స్థాయిలో సైనికులను మోహరించింది.
పుతిన్ కు బైడెన్ వార్నింగ్..
2021 డిసెంబర్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపారు. రష్యా దూకుడు మానకుంటే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వాలని రష్యా లిఖిత పూర్వక హామీకు కండిషన్ పెట్టారు. అంతేకాక, బాల్కన్ దేశాలు, రొమేనియా నుంచి బలగాలను విరమించాలని డిమాండ్ చేశారు. నాటో సభ్యత్వంపై ఉక్రెయిన్ ను అడ్డుకోలేమన్న అమెరికా.. పుతిన్ డిమాండ్ నేపథ్యంలో 2022 జనవరి 26న అమెరికా లిఖితపూర్వకంగా స్పందించింది. ఉక్రెయిన్ ను నాటోలో చేరకుండా ఆపలేమని బైడెన్ సర్కార్ స్పష్టం చేసింది. అయితే ఆయుధ నియంత్రణ తదితర అంశాలపై చర్చలకు సిద్ధమని అమెరికా స్పష్టం చేసింది.
2022 ఫిబ్రవరి లో విషమించిన పరిస్థితులు..
జనవరిలో ఉక్రెయిన్ ను ఆక్రమించమని రష్యా విదేశాంగ శాఖ ఉపమంత్రి సెర్గీన రెబకోవ్ స్పష్టం చేశారు. రష్యా- ఉక్రెయిన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించడానికి ఫ్రాన్స్, జర్మనీలు మధ్యవర్తిత్వం నెరిపినా పరిస్థితులు మారలేదు. జర్మనీ, తదితర ప్రాంతాల్లో ఉన్న తన బలగాలను పోలాండ్, రొమేనియా దేశాలకు అమెరికా తరలించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని తమ రాయబార కార్యాలయాన్ని 48 గంటల్లో మూసివేసేందుకు అమెరికా చర్యలు చేపట్టింది. దౌత్య సిబ్బంది కుటుంబాలను తరలించేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొంత మందితో పోలండ్ సరిహద్దుల్లోని ఎల్వివ్ లో దౌత్య కార్యాలయం నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.
యుద్ధానికి సై అంటున్న రష్యా..
పొరుగుదేశం, మిత్రదేశమైన బెలారస్ కు 30 వేలమంది బలగాలను రష్యా తరలించింది. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతం క్రిమియాలో సైతం బలగాలను మోహరించింది. రష్యా ఏ రోజైనా దాడి చేయనుందన్న అమెరికా నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు డచ్ ఎయిర్‌లైన్ కేఎల్‌మ్, స్కైఅప్ సంస్థ విమాన రాకపోకలను నిలిపివేసింది. తమ గగనతలాన్ని మూసివేయలేదన్న ఉక్రెయిన్ ప్రకటించింది. 2021లో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో నాటోవైపు 59 శాతంమంది ఉక్రెయిన్లు మొగ్గు చూపారు.
ఇవీ చదవండి.
Health Tips: మీకు ఈ సమస్యలు వెంటాడుతున్నాయా..? వంట గదిలో ఉండే వాటితో అద్భుతమైన ఫలితాలు
Andhra Pradesh: ఒక వ్యక్తినే 2 సార్లు కిడ్నాప్ చేసిన కిడ్నాపర్.. ఇదో విచిత్రమైన స్టోరీ