Turkey Earthquake: విధివంచిత టర్కీ.. రోడ్డుమీద బతుకునీడుస్తున్న లక్షలాదిమంది అభాగ్యులు..
విధివంచిత దేశం టర్కీ... ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. పెను విపత్తు మిగిల్చిన విషాదం నుంచి కొద్దికొద్దిగా కోలుకుంటోంది. గూడు కోల్పోయిన టర్కీ వాసులకు ఆసరా ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం ఒక ఇన్నోవేటివ్ థాట్‌ని ఇంప్లిమెంటేషన్‌లో పెట్టేసింది.
విధివంచిత దేశం టర్కీ… ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. పెను విపత్తు మిగిల్చిన విషాదం నుంచి కొద్దికొద్దిగా కోలుకుంటోంది. గూడు కోల్పోయిన టర్కీ వాసులకు ఆసరా ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం ఒక ఇన్నోవేటివ్ థాట్‌ని ఇంప్లిమెంటేషన్‌లో పెట్టేసింది. ప్రాణాల్ని అరచేత పట్టుకుని బితుకుబితుకుమంటూ బతుకునీడుస్తున్న భూకంప పీడితులకు టర్కీ ఇస్తున్న తాత్కాలిక ఉపశమనం ఏంటి… అది ఎలా సాధ్యమవుతోంది..?
టర్కీలో దాదాపు 40 వేల మందిని మింగేసింది మాయదారి భూకంపం. సిరియాలో కూడా ఐదువేలు దాటింది మృతుల సంఖ్య. చావుకేకలు ఆగినట్టు కనిపించినా… సాధారణ జనజీవనం జాడ వెతికినా కనిపించడం లేదక్కడ. రోజుల తరబడి పేరుకుపోయిన శిథిలాలు, అందులో శవాల గుట్టలు… అక్కడి పర్యావరణాన్ని ప్రమాదకరంగా మార్చేసింది. అంటువ్యాధులు పెరిగినప్పటికీ పరిస్థితి కంట్రోల్లోనే ఉందంటోంది టర్కీ సర్కారు.
ప్రళయం సమయంలో.. దాదాపు 150 దేశాలు సహాయక చర్యల పేరుతో ఊతమిచ్చాయి. ఇప్పుడు అందరూ తమతమ దేశాలకు తిరిగొచ్చేశారు. ఆపరేషన్ దోస్త్ పేరుతో టర్కీలో మానవతను చాటుకున్న మన ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్‌కి సెల్యూట్ చేశారు ప్రధాని మోదీ. ఎన్నో ప్రాణాల్ని కాపాడిన మన జాగిలాల సేవల్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.
శిథిలమైన కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే… మిగతా టర్కీ మొత్తం ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ప్రశాంతంగానే కనిపిస్తోంది. నేలతల్లి మళ్లీ ఎప్పుడు ఆగ్రహిస్తుందో… ఏ క్షణాన మళ్లీ భూమి కంపిస్తుందో అనే భీతి అక్కడి జనంలో కనిపిస్తూనే ఉంది. భూకంప పీడిత టర్కీలో సాహసోపేత పర్యటన చేసిన టీవీ9 టీమ్…. అక్కడ రీహాబిలిటేషన్ పనుల్ని కూడా కళ్లకు కట్టినట్టు రిపోర్ట్ చేసింది.
టర్కీలో ఇప్పటివరకూ భూకంపం కారణంగా కోటీ 35 లక్షల మంది ఆశ్రయం కోల్పోయారు. లగ్జరీ అపార్ట్‌మెంట్లు కూడా పేకమేడల్లా కూలిపోవడంతో అపరశ్రీమంతులు సైతం దిక్కుమొక్కూ లేక అల్లాడిపోతున్నారు. చలికి వణికిపోతున్న ఈ అభాగ్యులు… గూడు కోసం పడుతున్న అవస్థలు చెప్పడానికి మాటలు సరిపోవు. అందుకే… యుద్ధప్రాతిపదికన నిరాశ్రయులకు తాత్కాలిక వసతి కల్పిస్తోంది టర్కీ ప్రభుత్వం. మైనస్ డిగ్రీల టెంపరేచర్, ఆగిపోయిన విద్యుత్ సరఫరా… రోడ్ల మీదే బితుకుబితుకుమంటూ బతుకుతున్న జనం…. ఈ అభాగ్యుల కోసం ప్లాన్ చేసిన టెంపరరీ ఆశ్రయం పేరే… కంటెయినర్ సిటీ.
ఎకరాలకొద్దీ ఖాళీ స్థలాన్ని చదును చేసి… కంటెయినర్ సిటీ కోసం యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం భారీ సైజు మెషినరీని వాడుతున్నారు. మరోచోట తయారైన కంటెయినర్లను ట్రాలీల సాయంతో తీసుకొచ్చి ఇక్కడ అమర్చి… దీనికి ఓ కాలనీ రూపునివ్వబోతున్నారు. టర్కీలోని పది నగరాల్లో ఇటువంటి కంటెయినర్ సిటీలు రెడీ అవుతున్నాయి. ఒక్కో కంటెయినర్ సిటీ… కనీసం ఏడువేల మందికి ఆశ్రయం కల్పిస్తుంది.
అంకారా, ఇస్తాంబుల్ లాంటి నగరాల్లో వాడుకలోకి రాబోతున్న కంటెయినర్ సిటీలు ఒక రెవెల్యూషనరీ థాట్. ఇటువంటి మహా విపత్తుల సమయంలో వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ… ఈ తాత్కాలిక ఇళ్లు ఎలా నిర్మిస్తారు… వాటిలో ఉండే సదుపాయాలేంటి..?
చూడ్డానికి అగ్గిపెట్టెల్లా చిన్న సైజులో కనిపిస్తున్నా ఈ కంటెయినర్ హౌస్ మామూలు నివాసానికి ఏమాత్రం తీసిపోదు. జనావానికి అవసరమైన సకల సదుపాయాలూ ఇందులో ఉంటాయి. పైగా… భూకంపం వచ్చినా కూలిపోవు కనుక… వీటితో ప్రమాదం ఉండదు. కనీసం కొంతకాలమైనా టర్కీ జనానికి ఉపశమనం ఇవ్వబోతున్నాయి ఈ కంటెయినర్ సిటీలు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..