ఒకటీ కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు భూకంపాలు.. సోమవారం టర్కీ, సిరియాల్లో వరుసగా సంభవించిన ఈ భూకంపాలు నిలువునా వణికించాయి. పెద్ద ఎత్తున భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఈ రెండు దేశాల్లోని భూకంపాల తీవ్రత కారణంగా భారీ ఎత్తున విధ్వంసం. వేలకొద్దీ ప్రాణాలు బలి. వందలాది మంది ఇంకా శిథిలాల కిందే. టర్కి, సిరియాలో ఘోర భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారు ఝామున.. భారీగా భూమి కంపించడంతో.. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7. 8గా నమోదైంది. టర్కీ, సిరియా సరిహద్దుకు రెండు వైపులా భయానక వాతావరణం ఏర్పడింది. ఒక్క టర్కీలోనే 3 వేలకుపైగా ఇళ్లు నేలకూలాయి.
టర్కీ, సిరియాలకు సాయమందించడానికి 45 దేశాలు ముందుకొచ్చాయి. సహాయక చర్యల కోసం గాలింపు బృందాలు, వైద్య సామాగ్రిని పంపనున్నట్టు ప్రకటించాయి. అమెరికా, రష్యా, జర్మనీ, తైవాన్ తో పాటు భారత్ కూడా ఈ జాబితాలో ఉంది. టర్కీ, సిరియా భూకంప బీభత్సంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రెండు దేశాలకు అన్నివిధాల సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
సిరియాలోని అలెప్పో, హమా సహా పలు పట్టణాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొన్ని క్షణాల్లో శిథిలాలు దిబ్బలు దిబ్బలుగా పేరుకుపోయి కనిపించాయి. భూకంపం ధాటికి జనం విలవిలలాడారు. ఈ విలయం కారణంగా రెండు దేశాల్లో సుమారు 3400 మందికి పైగా చనిపోయారు. శిథిలాల కింద ఇప్పటికీ వందలాది మంది చిక్కుకుని ఉన్నారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టర్కీలోని గాజియాన్ తెప్ నగరానికి 33 కిలోమీటర్ల దూరంలో.. 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తర్వాత దాదాపు యాభై శక్తివంతమైన ప్రకంపనలు రెండు దేశాలనూ వణికించాయి. ఈ ప్రకంపనల్లో ఒకదాని తీవ్రత 7. 5 నుంచి 7. 8 మధ్య నమోదయ్యింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ఆస్పత్రులు కిక్కిరిసిపోయి కనిపించాయి. ఎటు చూసినా కాంక్రీటు కుప్పలు, ఇనుప చువ్వలు. వీటి కింద నలిగిపోతున్న వారి కోసం అన్వేషణ సాగించారు రెస్క్యూ సిబ్బంది. కొన్ని చోట్ల శిథిలాల అడుగుల నుంచి జనం ఆర్తనాదాలు వినిపించాయి.
#BREAKING #TURKIYE #TURQUIA #TURQUIE #TURKEY
?TURKIYE :POWERFUL EARTHQUAKE MAGNITUDE 7.4 HIT 10 CITIES IN SOUTHEASTERN REGION?#VIDEO SANLIURFA CITY
Buildings continue to collapse due to AFTERSHOCKS #BreakingNews #UltimaHora #Earthquake #Terremoto #Temblor #Gempa #Deprem pic.twitter.com/kgEtacneUJ
— loveworld (@LoveWorld_Peopl) February 6, 2023
భూకంప తీవ్రతకు భవనాలు కదిలిపోవడంతో.. జనం రోడ్లపైకొచ్చి బిక్కుబిక్కుమన్నారు. టర్కీలోని 10 ప్రావిన్సుల్లో 1600 మందికి పైగా మరణించగా.. 11 వేల మంది గాయపడ్డారు. 2470 మందిని శిథిలాల నుంచి రక్షించారు. భూకంప ప్రాంతాల నుంచి జనం బయట పడ్డానికి ప్రయత్నించడంతో రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి.
ఇప్పటికే కొన్నేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలంగా ఉన్న సిరియాను ఈ భూకంపం మరింత భయకంపితం చేసింది. తిరుగుబాటు దారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో నలభై లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతమంతా భూకంపం ధాటికి తీవ్రంగా దెబ్బతినింది. ఇక్కడ 380 మందికి పైగా మరణించారు. ఇక సిరియా ప్రభుత్వ పాలనలోని ప్రాంతాల్లో సుమారు 540 మంది మరణించారు. 1300 మందికి పైగా గాయాల పాలయ్యారు.
తొలి భూకంపం వచ్చిన కొన్ని గంటల వ్యవధిలో.. టర్కీ సిరియా దేశాలను మరో రెండు భూకంపాలు వణికించాయి. రెండో భూకంపం నిన్న మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో వచ్చింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7. 6గా నమోదయ్యింది. టర్కిలోని ఎకినజు పట్టణంలో రెండో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సాయంత్రం ఆరింటికి 6. 0 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. ఇలాంటి భూకంపాలు మరింత కుదిపేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఈ భూకంప ప్రభావం సైప్రస్ సహా లెబనాన్ వంటి దేశాల్లోనూ కనిపించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..