టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది . రియాక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.7గా నమోదైంది. USGS ప్రకారం.. ఈ సారి భూకంపం దక్షిణ టర్కిష్ నగరమైన కహ్రామన్‌మరాస్‌కు సమీపంలో సంభవించింది. దేశంలోని అనేక నగరాలను శిథిలాలుగా మార్చిన భూకంపాల శ్రేణిలో.. 15.7 కి.మీ లోతులో మళ్ళీ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం అర్ధరాత్రి 00:03:15 (UTC+05:30)కి సంభవించిందని కూడా తెలియజేసింది. దీంతో నగర వాసులు మళ్ళీ ఉల్కిపడ్డారు. గత వారం రోజులుగా టర్కీ వాసులు భూకంపం సృష్టించిన విధ్వంసాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. దేశంలోని నగరాలకు నగరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వేలాది భవనాలు కూలిపోయాయి. వరసగా సంబంధించిన పలు భారీ భూకంపం కారణంగా ఇప్పటివరకు 29,000 మందికి పైగా మరణించారు. మరోవైపు, సిరియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇప్పటివరకూ 4,500 మరణించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఈ వరస భూకంపాల వలన రెండు దేశాల్లో కలిపి ఇప్పటి వరకూ మొత్తం 34 వేల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. 92,600 మందికి పైగా గాయపడ్డారు.
An earthquake of magnitude 4.7 occurred 24 km South of South-East (SSE) of Kahramanmaraş, Turkey: USGS Earthquakes
— ANI (@ANI) February 12, 2023
రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది గత ఆరు రోజులుగా చలిలో నిరంతరం శ్రమిస్తున్నారు. భూకంపం సంభవించిన ఆరు రోజుల తర్వాత కూడా కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. తాజాగా భవనాల శిథిలాల నుండి గర్భిణీ స్త్రీ మరియు ఇద్దరు పిల్లలతో సహా కొంతమంది ప్రాణాలను బయటకు తీశారు.
మరోవైపు.. అక్రమ నిర్మాణ కార్యకలాపాలకు పాల్పడుతున్న 130 మందికి పైగా వ్యక్తులను టర్కీ న్యాయ అధికారులు విచారిస్తున్నారు. భూకంపం కారణంగా కుప్పకూలిన భవనాల నిర్మాణంలో బాధ్యులైన 134 మందిని విచారిస్తున్నట్లు టర్కీ న్యాయ శాఖ మంత్రి బెకిర్ బోజ్‌డాగ్ ఆదివారం తెలిపారని టర్కీ ప్రభుత్వ వార్తా సంస్థ అనడోలు వెల్లడించింది.
భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు టర్కీ, సిరియాకు సహాయం చేస్తున్నాయి. మందుల నుంచి సహాయ సామాగ్రి వరకు అక్కడికి పంపుతున్నారు. టర్కీ, సిరియాలకు భారత్ శనివారం మరిన్ని సహాయ సామగ్రిని పంపింది. దీంతో పాటు పలు దేశాలు కూడా ఇరు దేశాలకు సహాయాన్ని అందిస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..