డ్యామిట్.. టారిఫ్ కథ అడ్డం తిరిగింది.. భారత్ దెబ్బకు ట్రంప్ రివర్స్ గేమ్..
బాగా నొప్పెట్టేలా గిచ్చి ఆనక ఓదార్చడం, కొట్టి ఊరడించడం డొనాల్డ్ డ్రంప్‌కి బాగా అలవాటున్న తొండాటే. కుంటిసాకులు చూపి ఇండియాతో సుంకాలాట ఆడుకున్న పెద్దమనిషి.. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్‌కి దిగుతున్నారా? టారిఫ్ గేమ్ అడ్డం తిరుగుతోందన్న సందేహాల నడుమ ట్రంప్ తాజాగా ఇండియాతో బుజ్జగింపు వ్యాఖ్యానాలకు దిగడం... దేనికి సంకేతం?

యువరటెన్షన్ ప్లీజ్..! ఇండియాతో మేం చేసే వ్యాపారంతో పోలిస్తే, ఇండియా మాతో చేసే వ్యాపారం చాలా ఎక్కువ. సుంకాల దగ్గర మారాం చేస్తే మాకంటే మీరే ఎక్కువ నష్టపోతారు.. తస్మాత్ జాగ్రత్త.. అని పాత సూక్ష్మాన్నే కొత్తగా చెప్పజూశారు అమెరికా ప్రెసిడెంట్. ట్రూత్‌లో ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ రెండుదేశాల మధ్య బిజినెస్ రిలేషన్స్‌ని మళ్లీ చర్చకు పెట్టేశాయి. దశాబ్దాలుగా ఇండియా నుంచి అమెరికాకు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తులు ఎగుమతౌతున్నాయ్.. ఇంతటి హాట్ క్లయింట్‌ను ఇండియా దూరం చేసుకుంటే అది వాళ్లకే దురదృష్టం అంటూ సెటైరికల్ డైలాగేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్..
వాళ్లు వేసిన భారీ సుంకాలతో మా వస్తువులు ఇండియాలో అమ్ముకోలేక ఇన్నాళ్లూ ఘోరంగా నష్టపోయాం.. ఇండియాతో వాణిజ్యం పూర్తిగా ఏకపక్ష విపత్తుగా సాగింది, అందుకే ప్రతీకార సుంకాలు వేశాం.. అని తన వాణిజ్య అరాచకాన్ని సమర్థించుకున్నారు ట్రంప్. పైగా, చమురు గానీ, మిలిటరీ ఉత్పత్తులుగానీ ఎక్కువ మొత్తంలో రష్యానుంచే కొనుగోలు చేస్తున్న ఇండియా, ఆ విషయంలో అమెరికాను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఇప్పుడు సుంకాలు సున్నాసైజుకు తగ్గిస్తాం అంటూ ఇండియా వైపు నుంచి ఆఫర్ వస్తోందని, కానీ, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఈ పని ఇండియా కొన్నేళ్ల కిందటే చేయాల్సిందని చెప్పుకొచ్చారు. మోదీ-పుతిన్ భేటీ నేపథ్యంలో ట్రంప్ నుంచి ఇలా బుజ్జగింపు వ్యాఖ్యలు రావడం ఆసక్తికరంగా మారింది.
ఇండియాకున్న అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌లలో అమెరికా ఒకటి. గత ఆర్థికసంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 79.44 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. కానీ, మనదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 41.5 బిలియన్ డాలర్లు మాత్రమే. దాదాపు మూడున్నర లక్షల కోట్లు. అమెరికాకు జరిగే ఎగుమతులతో పోలిస్తే ఇది దాదాపుగా సగం. ఈ తేడానే ఎక్స్‌పోజ్ చేస్తూ, మాతోనే మీకు ఎక్కువ అవసరం సుమా అంటూ ఇండియాతో మైండ్‌గేమ్ ఆడుతున్నారు డొనాల్డ్ ట్రంప్.
అటు, షాంఘై సహకార సదస్సుకు కొద్ది నిమిషాల ముందు అమెరికా కార్యవర్గం సోషల్ మీడియా ద్వారా ఇండియాను దువ్వడానికి ప్రయత్నించింది. ఇప్పటివరకు భారత్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడిన అమెరికా స్వరంలో సడన్‌గా మార్పు కనిపించింది. భారత్-అమెరికా సంబంధాలు సరికొత్త ఎత్తులకు చేరుకుంటున్నాయి. ఈ నెలలో మా దోస్తీని ఇంకా ముందుకు తీసుకెళ్లే అంశాలపై దృష్టిపెట్టబోతున్నాం… మా ఆర్థికబంధంలోని అద్భుతమైన అవకాశాలను గుర్తించాం.. అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. సుంకాల డ్రామాతో ఇండియాతో తెగిన దౌత్యసంబంధాలను ఏదో విధంగా పునరుద్ధరించుకోవాలన్నదే అమెరికా ప్రయత్నంగా తెలుస్తోంది. అయినా, నరం లేని ట్రంప్ నాలిక మీద మనోళ్లకు ఎప్పుడో నమ్మకం పోయింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
