పామ్ సండే సంబురాల్లో జనం.. అంతలోనే దూసుకొచ్చిన మిస్సైల్! చెల్లా చెదురుగా ఎగిరిపడ్డ మృతదేహాలు..
పామ్ సండే రోజున ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో రష్యా చేసిన క్షిపణి దాడిలో 20 మందికిపైగా మరణించారు. రెండు బాలిస్టిక్ క్షిపణులు నగరంపై దాడి చేశాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడిని ఖండించారు. ప్రపంచం మొత్తం దీన్ని ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై ఆదివారం రష్యా క్షిపణి దాడిలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని నగర తాత్కాలిక మేయర్, ఉక్రెయిన్ జనరల్ ప్రాసిక్యూటర్ తెలిపారు. పామ్ సండే(ఉక్రెయిన్‌లో ఈస్టర్‌కు ముందు ఇది ఒక ప్రత్యేక రోజు) జరుపుకోవడానికి స్థానిక ప్రజలు గుమిగూడగా రెండు బాలిస్టిక్ క్షిపణులు నగరం నడిబొడ్డుపై దాడి చేశాయి. ఉదయం 10:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడితో మృతదేహాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. ఆ దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి.
20 మందికి పైగా మృతి, 34 మందికి గాయాలు..
“ఈ ప్రకాశవంతమైన పామ్ సండే నాడు, మా సమాజం భయంకరమైన విషాదాన్ని చవిచూసింది” అని ఆర్టెమ్ కోబ్జార్ సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో తెలిపారు. “ఇప్పటికే 20 కంటే ఎక్కువ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది” ప్రాథమిక దర్యాప్తు ఫలితాలను ఉటంకిస్తూ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. శత్రువుల దాడిలో 21 మంది వరకు మరణించారని, ఐదుగురు పిల్లలు సహా 34 మంది గాయపడ్డారని తెలిపింది. ఈ దారుణ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్పందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. “ప్రాథమిక సమాచారం ప్రకారం, డజన్ల కొద్దీ పౌరులు మరణించారు, మరికొంత మంది గాయపడ్డారు. సాధారణ ప్రజల ప్రాణాలను బలిగొనే వాళ్లే ఇలా వ్యవహరిస్తారు” ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దాడికి ప్రపంచం మొత్తం ఖండించాలని జెలెన్స్కీ పిలుపునిచ్చారు. “చర్చలు బాలిస్టిక్ క్షిపణులు, వైమానిక బాంబులను ఎప్పుడూ ఆపలేదు. రష్యా పట్ల ఉగ్రవాదికి అర్హమైన వైఖరి అవసరం” అని ఆయన అన్నారు. ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేయడానికి అమెరికా మధ్యవర్తిత్వంతో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించారని రష్యా, ఉక్రెయిన్‌లకు చెందిన అగ్ర దౌత్యవేత్తలు ఒకరినొకరు ఆరోపించుకున్న ఒక రోజు లోపే ఈ దాడి జరిగింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.