Sudiksha Konanki Case: అవి సుదీక్ష దుస్తులే..! ఆ రోజున అర్ధరాత్రి బీచ్‌లో ఏం జరిగి ఉంటుంది..
భారత సంతత విద్యార్థిని.. సుదీక్ష మిస్సింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె చివరిసారిగా కనిపించిన బీచ్‌లో సుదీక్షకు సంబంధించిన.. కీలక ఆధారాలు సేకరించారు. ఇంతకీ పోలీసులకు లభించిన ఆధారాలు ఏంటి?. సుదీక్ష కేసు అప్డేట్స్ ఏంటి?. అనే వివరాలను తెలుసుకోండి..

అమెరికా పిట్స్ బర్గ్ యూనివర్సిటీలో చదువుతూ.. డొమినికన్ రిపబ్లిక్‌లో మిస్సైన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి కేసు మిస్టరీగా మారింది. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. తాజాగా సుదీక్ష చివరిసారిగా కనిపించిన ప్యూంటా కానా బీచ్ దగ్గర ఆమె దుస్తులను అధికారులు గుర్తించారు. బీచ్ దగ్గరున్న లాంజ్ చైర్‌పై తెల్లటి నెటెడ్ సరోంగ్‌తో పాటు ఆమె ధరించిన పాదరక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుదీక్ష కోణంకి అదృశ్యమైన రోజు.. సీసీటీవీ ఫుటేజ్‌లో ఆమె ధరించిన దుస్తులే ఇవి అని పోలీసులు భావిస్తున్నారు. ఆ దుస్తులలో ఎలాంటి ట్యాంపరింగ్ సంకేతాలు కనిపించడం లేదు. భారత సంతతికి చెందిన యువతి తన దుస్తులను లాంజ్ చైర్‌పై వదిలివేసి, ఆపై గోధుమ రంగు బికినీలో సముద్రంలోకి దూకి, మునిగిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు
వర్జీనియాకు చెందిన భారత సంతతి యువతి.. 20ఏళ్ల సుదీక్ష కోణంకి పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతోంది. అయితే.. ఇటీవల మరో ఐదుగురు అమ్మాయిలతో కలిసి డొమినికన్ రిపబ్లిక్‌లోని ప్రముఖ పర్యటక పట్టణమైన ప్యూంటా కానా ప్రాంతానికి వెకేషన్‌కు వెళ్లింది. మార్చి 6న స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్ బీచ్ దగ్గర చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత ఆమె గదికి తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. సుదీక్ష.. ఐయోవాకు చెందిన 24 ఏళ్ల టూరిస్టు జాషువా స్టీవెన్ రిబెతో కలిసి బీచ్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో అతడిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. తమ కుమార్తెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని సుదీక్ష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరారు. ఈ క్రమంలో సుదీక్ష దుస్తులు బీచ్ దగ్గర దొరకడంతో.. ఆమె సముద్రంలో గల్లంతై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.. అయితే.. ఆమె దుస్తులు లభించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
