Srilanka Crisis: శ్రీలంక కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే(Ranil Wickremesinghe)కు వ్యతిరేకంగా నిరసనకారులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆయన అధ్యక్ష భవనాన్ని విడిచి ఇంటికి వెళ్లాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో అధ్యక్ష భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరసనకారుల ‘గో హోమ్’ డిమాండ్‌పై రణిల్ విక్రమసింఘే స్పందించారు. వెళ్లడానికి తనకు ఇళ్లు లేదని ఆయన పేర్కొన్నారు. జులై 9న నాటి శ్రీలంక ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమసింఘే ప్రైవేట్ నివాసంలోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు.. ఆ ఇంటిని తగలబెట్టడం తెలిసిందే. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన.. శ్రీలంక కొత్త అధ్యక్షుడయ్యారు. తాజాగా అధ్యక్ష అధికారిక భవనాన్ని ముట్టడిస్తామని నిరసనకారులు హెచ్చరించడంపై స్పందించిన రణిల్.. వారు తమ ప్రయత్నాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. దీనికి బదులుగా కాల్చివేసిన తన ఇంటిని పునర్నిర్మించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇళ్లు లేని వ్యక్తిని ఇంటికి వెళ్లాలని డిమాండ్ చేయడం సహేతుకం కాదన్నారు.
ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అన్ని పార్టీలు ఒకేతాటిపైకి రావాలని రణిల్ విక్రమ సింఘే పిలుపునిచ్చారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సెని నిందించడం సరికాదన్నారు. దేశంలో నెలకొన్న అశాంతి కారణంగానే రుణ సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)తో జరగాల్సిన ఒప్పందం జాప్యం జరిగిందన్నారు. ఐఎమ్ఎఫ్‌తో డీల్ కుదిరే వరకు శ్రీలంకకు ఆర్థిక సాయం చేసేందుకు ఇతర దేశాలేవీ ముందుకురావడం లేదన్నారు. రుణాలను తిరిగి చెల్లించేందుకు శ్రీలంక సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాల్సి ఉందన్నారు. అప్పటి వరకు దేశాన్ని ప్రస్తుత ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి ఐఎంఎఫ్ పూర్తిగా గట్టెక్కించే అవకాశం లేదన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి