Sri Lanka Crisis: ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో శ్రీలంక(Sri Lanka)లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతున్నాయి. ఆందోళనకారులు, ప్రభుత్వ మద్దతు దారుల మధ్య పరస్పర ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. హింసాత్మక ఆందోళనలతో ప్రభుత్వ ఆస్తులు, భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుండడమే కాకుండా ఈ అల్లర్లలో వేలాదిమంది గాయపడుతున్నారు. కాగా ప్రధాని పీఠం నుంచి వైదొలగిన మహీంద రాజపక్స (Mahinda Rajapaksa), అధ్యక్షుడు గొటబాయ రాజపక్స (Gotabaya Rajapaksa) తదితర రాజకీయ నాయకులకు నిరసనకారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల మహీంద కేబినెట్ మంత్రులతో పాటు పలువురు రాజకీయ నేతల నివాసాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. హంబన్‌టోటలోని రాజపక్స పూర్వీకుల ఇంటికి నిప్పంటించారు. అక్కడి రాజపక్స మ్యూజియాన్ని కూడా తగలబెట్టారు. ఇక కరునెగాలలోని మహీంద నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు.
పెట్రోల్ బాంబులతో దాడి..
కాగా తాజాగా ప్రధాని అధికారిక నివాసమైన టెంపుల్ ట్రీస్‌ను కూడా ఆందోళన కారులు ముట్టడించారు. బారికేడ్లను దాటుకుని భవనంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. కొందరు నిరసనకారులు భవనం కాంపౌండ్‌లోకి పెట్రోల్ బాంబులు కూడా విసిరి విధ్వంసం సృష్టించారు. ప్రధాని భద్రతాసిబ్బంది ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం అత్యంత భద్రత నడుమ సైన్యం మహీంద, ఆయన కుటుంబసభ్యులను ట్రింకోమలిలోని నౌకాదళ స్థావరానికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా ఈ నేవీ బేస్ శ్రీలంక రాజధాని కొలంబోకు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా ట్రింకోమలి నౌకాదళ స్థావరం వద్ద మహీంద, కొంత మంది కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం రాగానే నిరసనకారులు అక్కడకు చేరుకుని ఆందోళనలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక మహీంద కుమారుడు నమల్ కుటుంబం కొలంబోను వీడి అజ్ఞాత ప్రాంతానికి వెళ్లినట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: