మాస్కోపై డ్రోన్ దాడులకు రష్యా ప్రతీకారం తీర్చుకుంటోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మరోసారి క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో తొమ్మిదేళ్ల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా… 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కీవ్‌లో ఈ స్థాయిలో ప్రాణనష్టం నమోదుకావడం నెల రోజుల్లో ఇదే తొలిసారి. ఉక్రెయిన్ జరిపిన షెల్లింగ్ కారణంగా లుహాన్స్‌క్ ప్రాంతంలో ఓ కోళ్లఫారం వద్ద అయిదుగురు చనిపోగా.. 19 మంది గాయపడినట్లు రష్యా తెలిపింది. ఇటు రష్యా డ్రోన్లను, మిసైళ్లను ఉక్రెయిన్ క్షిపణి విధ్వంసక వ్యవస్థ సమర్థంగా తిప్పికొడుతోంది. వాటి శకలాలు ఇళ్ల మీద పడి అగ్నిప్రమాదాలకు కారణమవుతున్నాయి. అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు మరో 300 మిలియన్ డాలర్ల సాయం ఖరారు చేయడం పై రష్యా మండిపడింది. తమను వ్యూహాత్మకంగా ఓడించాలనే లక్ష్యంతో అమెరికా ఇలా చేస్తున్నట్లు పేర్కొంది.
మరోవైపు ఏడాదికి పైగా జరుగుతున్నా యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ భావిస్తోంది. ఇందులో భాగంగా నాటో సభ్యత్వం పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశాడు. నాటో మెంబర్‌షిప్ విషయమై జూలై కల్లా స్పష్టమైన ప్రకటన ఇవ్వాలన్నారు. యూరోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్ చేరికపై కూడా పురోగతి ఆశిస్తున్నటు జెలెన్‌స్కీ వెల్లడించాడు. జూలైలో మాల్డోవాలో జరగనున్న నాటో సమావేశంలో ఉక్రెయిన్ సభ్యత్వం గురించి స్పష్టమైన, సానుకూలమైన నిర్ణయం వెలువరించాలని కోరారు.
రష్యాతో యుద్ధాన్ని ముగించడానికి మేము శాంతి సమావేశం కోసం చూస్తున్నామన్నారు. నాటో సమావేశంలో 40 యూరోపియన్ దేశాల ప్రతినిధులు పొల్గొననున్నారు. ఉక్రెయిన్ కోరుతున్న శాంతి సమావేశం నిర్వహణపై నాటో ఇంతవరకు నిర్ణయం వెల్లడించకపోవడం చర్చనీయాంశమైంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..