ఉక్రెయిన్‌పై(Ukraine) వెనక్కి తగ్గడం లేదు రష్యా(Russia). ఆరో రోజు కూడా బాంబులమోత మోగుతోంది. కీవ్(kiev), కార్కివ్( Korkiv ) లోని నివాస ప్రాంతాలపై బాంబు దాడులకు దిగాయి రష్యా సైన్యాలు. దీంతో క్షణాల్లోనే భారీ భవనాలు కూడా నేలమట్టమయ్యాయి. నిన్న జరిగిన చర్చలు విఫలం కావడంతో రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపుగా రష్యా సైన్యాలు భారీగా మోహరిస్తున్నాయి. కీవ్ నగరానికి సుమారు 65 కిలొమీటర్ల వరకు రష్యాన్ సైన్యం విస్తరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన శాటిలైట్ మ్యాప్‌లు కూడా బయటకి వచ్చాయి. సైనిక వాహనాలు, ఫిరంగులు, యుద్ధ ట్యాంకులతో కీవ్ నగరం చుట్టు ఉన్న ప్రాంతాలు నిండిపోయాయి. దీంతో ఉక్రెయిన్ రాజధానిపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు రష్యా సైన్యాలు ప్రయత్నిస్తున్నాయి.
నివాస ప్రాంతాలపై కూడా బాంబుల దాడికి దిగడంతో పిల్లాపాపలతో సహా దేశం వీడుతున్నారు ఉక్రెయిన్ వాసులు. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది సరిహద్దు దేశాలకు వలస వెళుతున్నారు. సోలాండ్‌తో పాటు ఇతర దేశాల్లో తల దాచుకుంటున్నారు. ఉక్రెయిన్ బంకర్లలతో ఉన్నవారు కూడా బయటకి వస్తున్నారు.
తమ దేశంలోకి దురాక్రమణ చేసిన రష్యా సైనికుల్లో 5300 చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఇందులో 29 రష్యా విమానాలు , 29 హెలికాప్టర్లు ధ్వంసం అయ్యాయి. 191 రష్యా యుద్ద ట్యాంకులను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు రష్యా దాడుల్లో 352 మంది తమ పౌరులు చనిపోయారని ఉక్రెయిన్ రక్షణశాఖ తెలిపింది.
మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. దాదాపు 3 గంటల పాటు ఈ రెండు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఎలాంటి తీర్మానం లేకుండానే చర్చలు ముగిశాయి. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని, ఈయూలో సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. క్రిమియా, డాన్‌బాస్ నుంచి రష్యా సైన్యం వైదొలగాలని డిమాండ్ చేసింది.
అయితే రష్యా మాత్రం నాటోలొ ఉక్రెయిన్ చేరకూడదని ప్రధానంగా డిమాండ్ చేసింది.
తమ డిమాండ్ల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా కోరింది. అయితే ఈ డిమాండ్లపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు, దీంతో మరోసారి చర్చలు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. పోలాండ్- బెలారస్ సరిహద్దులో మరో దఫా చర్చలు జరగనున్నాయి.
మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు కొనసాగుతోంది. బుకారెస్ట్ నుంచి 182 మంది విద్యార్థులతో వచ్చిన విమానం ముంబై చేరుకుంది. మరో రెండు విమానాల్లో కూడా విద్యార్థులను తరలిస్తున్నారు. ఒక విమానంలో 216, మరో విమానంలో 218 మంది విద్యార్థులు వస్తున్నారు. తాజాగా స్పైస్ జెట్ ప్రత్యేక విమానంలో స్లోవేకియాకు వెళ్లారు కేంద్రమంత్రి కిరణ్‌రిజుజు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురానున్నారు కేంద్రమంత్రి.
ఇవి కూడా చదవండి: Uric Acid Problem: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. సొరకాయ సూప్‌తో చెక్ పెట్టండి.. ఎలా తయారు చేయాలంటే..