Wagner Group: రష్యాలో తిరుగుబాటు ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్.. ‘వాగ్నర్’ దళపతి కీలక ప్రకటన..
రష్యాలో అంతర్యుద్ధం దాకా వెళ్లిన పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తిరుగుబాటు ఎపిసోడ్‌లో అనూహ్యమైన మలుపు చొటు చేసుకుంది. మాస్కోవైపు వేగంగా కదులుతూ వెళ్లిన వాగ్నర్ దళాలు హాఠాత్తుగా ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. కారణం..
రష్యాలో అంతర్యుద్ధం దాకా వెళ్లిన పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మాస్కోవైపు వేగంగా కదులుతూ వెళ్లిన వాగ్నర్ దళాలు హాఠాత్తుగా ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. కారణం.. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌తో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో చర్చలు జరిపి సంధి ప్రయత్నాలు చేయడమే. ఉద్రిక్తతను సడలించడానికి బలగాలను నిలువరించాలని కోరారు లుకషెంకో. మరోవైపు ప్రిగోజిన్ కూడా టెలిగ్రాం ద్వారా తన సందేశాన్ని వినిపించారు. రక్తపాతం లేకుండా చేయడానికి తమ దళాల నిలువరింతకు అంగీకరించగామన్నారు. తిరిగి తమతమ స్థానాల్లోకి వెళ్లిపోతున్నామని ప్రకటించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అధ్యక్షుడు పుతిన్ పెంచి పోషించిన కిరాయి సేన వాగ్నర్ గ్రూపు. ఆ గ్రూప్ ఆయనపైనే తిరుగుబాటు జెండా ఎగురవేసింది. కలవరపెట్టేలా కదం తొక్కింది. ఈ దళం దాదాపు మాస్కోకు 200 కిలోమీటర్ల దూరం దాకా వెళ్లింది. అయితే, ఈ తిరుగుబాటును సమర్థంగా తిప్పికొట్టేందుకు పుతిన్ సేనలు సై అన్నాయి. ఆమేరకు సన్నద్ధమయ్యాయి. భారీగా సైనిక వాహనాలు, బలగాల్ని మోహరించాయి. దీంతో పెద్దఎత్తున రక్తపాతం తప్పదన్న భయానక వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో పుతిన్ మాస్కోను వీడారనీ, ఓ బంకర్‌లోకి తలదాచుకున్నారన్న వార్తలొచ్చాయి. చివరికి బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తాము ఉక్రెయిన్ సరిహద్దులోని తమ స్థావరాలకు తిరిగి వెళ్లిపోతున్నామని ప్రకటించారు వాగ్నర్ అధినేత ప్రిగోజిన్.
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభంలో రష్యా జైళ్లలోని దాదాపు 50వేల మంది ఖైదీలను విడుదల చేసి వాగ్నర్ గ్రూపులో చేర్చుకున్నారు. అంతకన్నా ముందే ఉన్న మరింత మంది కిరాయి సైన్యంతో ఉక్రెయిన్‌లోని బఖ్‌ముత్‌పై ప్రిగోజన్ దాడి చేయించాడు. అయితే ఉక్రెయిన్ సైనికుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైనప్పటికీ వాగ్నర్ గ్రూప్‌కి రష్యా సైన్యం ఆయుధాలు పంపలేదు. దీంతో ఈ కిరాయి సైన్యానికి చెందిన వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి రష్యా డిఫెన్స్ మినిస్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులపై ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రిగోజిన్.. తిరుగుబాటు ప్రకటించాడు. రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చేస్తామని ప్రకటించాడు. అంతేకాదూ.. మాస్కోవైపు తమ దళాలు కదులుతున్నాయని చెప్పడంతో టెన్షన్ మొదలైంది.
మరోవైపు వాగ్నర్ చర్యలపై పుతిన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలను రక్షించుకునేందుకు ఏమైనా చేస్తానని హెచ్చరించారు. సొంతలాభం కోసం వాగ్నర్ గ్రూప్ రష్యాకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. దేశద్రోహ చర్యకు దిగిన వారిపై చర్యలు తప్పవు వార్నింగ్ ఇచ్చారు. ఇక అంతర్యుద్ధం తప్పదని భావించిన క్రమంలో బెలారస్ దౌత్యంతో పరిస్థితి మారిపోయింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..