భారత్ తో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ తెలిపారు. బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలిపిన భారత ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు రిషి సునాక్. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఫోన్ లో మాట్లాడారు. భారత్, యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడం పై ఇద్దరు నాయకులు చర్చించారు. వీలైనంత త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టిఎ) కుదుర్చుకోవడంపై కూడా మాట్లాడారు. రిషి సునాక్ తో ఫోన్ సంభాషణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. యూకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలిపానన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కలిసి పని చేస్తామన్నారు. అలాగే యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ కూడా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అనేక రంగాల్లో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. భద్రత, రక్షణ రంగాలతో పాటు ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడంలో రెండు ప్రజాస్వామ్య దేశాలు ఉమ్మడిగా ఏం సాధించగలవోననే ఉత్సహం తనలో ఉందన్నారు. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా కొత్త ప్రధానమంత్రిగా రిషి సునక్ బాధ్యతలు స్వీకరించడంతో పెండింగ్ లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై వీలైనంత త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌తో “ఓపెన్ బోర్డర్స్ మైగ్రేషన్ పాలసీ”కి సంబంధించి హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే బ్రిటన్ లో రాజకీయ పరిస్థితుల కారణంగా దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా రిషి సునాక్ బ్రావర్‌మన్‌ను హోం సెక్రటరీగా మళ్లీ నియమించారు.
ఈఏడాది జూలైలో రిషి సునాక్ మాట్లాడుతూ.. వీసా విధానంలో మార్పుతో భారతీయ పౌరులకు ప్రయోజనం చేకూర్చడం పై ప్రస్తావించారు. కొత్త విధానం భారతీయ పౌరులకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. భారత్, యూకే ఈ సంవత్సరం జనవరిలో ఎఫ్‌టిఎ చర్చలను ప్రారంభించాయి. రెండు దేశాల మధ్య 90% వాణిజ్య సుంకాలను కవర్ చేయడానికి ఇది ఉద్దేశించబడింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $100 బిలియన్లకు రెట్టింపు చేయాలని ఎఫ్‌టిఎ లక్ష్యంగా పెట్టుకుంది.
బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవెర్లీ శుక్రవారం భారత్‌కు చేరుకోనున్నారు. తొలుత ముంబయికి వెళ్లి 2008 ఉగ్రదాడిలో తాజ్‌ప్యాలెస్ హోటల్లో ప్రాణాలు కోల్పోయినవారికి ఆయన నివాళులర్పిస్తారు. శనివారం ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌తో చర్చలు జరుపుతారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..