చైనా, జపాన్ తదితర దేశాలు జనాభా సంక్షోభం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటలీలో సైతం గతేడాది జననాల రేటు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం జనాభా పెంపుదలపై చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే పోప్ ఫ్రాన్సిస్ సైతం.. ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ శుక్రవారం ఇటలీ ప్రజలకు పిలుపునిచ్చారు. జనాభా పెరుగుదల మందగమనాన్ని తిప్పికొట్టేందుకు రాజకీయ చర్యలు అవసరమని తెలిపారు. పిల్లలకు బదులు పెంపుడు జంతువులను కలిగి ఉన్న జంటలను ఈ సందర్భంగా పోప్ విమర్శించారు. అలాగే తమ కుటుంబాలను వృద్ధి చేసుకునేందుకు వీలుగా జంటలకు తగిన వనరులను అందుబాటులో ఉంచాలని సూచించారు.
అయితే ఇటలీలో గతేడాది రికార్డు స్థాయిలో కనిష్ఠంగా జననాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కేవలం 3.92 లక్షల మంది మాత్రమే జన్మించారు. అయితే మరణాల సంఖ్య మాత్రం 7.13 లక్షలుగా ఉంది. ఇటలీలో మహిళల సంతానోత్పత్తి రేటు సగటున 1.24గా ఉంది. చిన్నారులకు సరైన సంరక్షణ కేంద్రాలు లేకపోవడం, తక్కువ వేతనాలు, పని భారం తదితర అంశాలు సైతం జననాల రేటు తగ్గుదలకు కారణమని అక్కడి అధ్యయనాల్లో తేలిసింది
ఈ క్రమంలో జననాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే 2033 నాటికి ఏడాదికి కనీసం 5లక్షల జననాలు నమోదవ్వడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.