అమెరికా కోసమే ఉగ్రవాదులకు మద్దతు..! అసలు నిజం బయటపెట్టిన పాకిస్థాన్ మంత్రి
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, పశ్చిమ దేశాల కోసం దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా ఒప్పుకున్నారు. పహల్గామ్ దాడికి పాకిస్తాన్ బాధ్యత వహించాలని భారత్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఆసిఫ్ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, పాకిస్తాన్ ఉగ్రవాదానికి బలి అని వాదించారు.

అమెరికా, పశ్చిమ దేశాల కోసం పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి పరోక్షంగా వ్యాఖ్యానించారు. 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ బాధ్యత వహించాలని భారత్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే పాకిస్తాన్ చరిత్ర గురించి జర్నలిస్ట్ యాల్డా హకీమ్ అడిగినప్పుడు, పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బదులిస్తూ.. మేము మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసం ఈ నీచమైన పని చేస్తున్నాం అని అన్నారు. అయితే, అది తప్పు అని, దానికి పాకిస్తాన్ ముల్యం చెల్లించుకుంటుందని కూడా ఆయన పేర్కొన్నారు.
సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో, తరువాత 9/11 దాడులలో మనం చేరకపోతే, పాకిస్తాన్ నిష్కళంకమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉండేది అని మంత్రి అన్నారు. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధ సమయంలో పాకిస్తాన్ అమెరికాకు మద్దతు ఇచ్చింది. సెప్టెంబర్ 11, 2001న న్యూయార్క్‌లో అల్-ఖైదా ఉగ్రవాద దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌పై దాడికి కూడా మద్దతు ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ యూనియన్‌తో పోరాడటానికి అమెరికా, ఉగ్రవాదులను ప్రాక్సీలుగా ఉపయోగించుకుందని ఆసిఫ్ పేర్కొన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్‌లో సంక్షోభం సృష్టించే ప్రయత్నంలో భాగంగా భారతదేశం పహల్గామ్ ఉగ్రవాద దాడిని వాడుకుంటుందని పాకిస్తాన్ మంత్రి ఆరోపించారు.
అలాగే లష్కరే తోయిబా ఇక లేదని, దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ గురించి తాను ఎప్పుడూ వినలేదని ఆయన అన్నారు. “లష్కర్ అనేది పాత పేరు. అది ఉనికిలో లేదు… మా ప్రభుత్వం దానిని (పహల్గామ్ దాడి) నిర్ద్వంద్వంగా ఖండించింది. పాకిస్తాన్ దశాబ్దాలుగా ఉగ్రవాద బాధితురాలిగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. 2019 పుల్వామా దాడి తరువాత బాలాకోట్ వైమానిక దాడుల మాదిరిగానే ఇండియా సైనిక ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని పాకిస్తాన్ ఆందోళన చెందుతుందా అని అడిగినప్పుడు, ప్రతి దాడి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. “ఒకవేళ పూర్తి స్థాయి దాడి జరిగితే అప్పుడు కచ్చితంగా పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుంది. రెండు అణ్వాయుధ శక్తుల మధ్య ఘర్షణ ఎల్లప్పుడూ ఆందోళన కలిగించేదే” అని ఆసిఫ్ అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
