తిండితిప్పలు లేక అలమటిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు దారికొస్తోంది. భారత్‌తో మూడు యుద్దాలు చేసి తప్పు చేశామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. ఆర్ధికసంక్షోభం నుంచి తమ దేశాన్ని గట్టెక్కించాలని కోరుతున్న షెహబాజ్ యుద్దాల నుంచి పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకుందని అన్నారు. ఇండియాతో శాంతిని కోరుకుంటున్నామని ప్రకటించారు. కశ్మీర్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్చలకు ముందుకు రావాలని భారత్‌ను కోరారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలపై నిజాయితీగా చర్చలు జరగాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పిలుపునిచ్చారు.
యుద్దం కారణంగా ఇరుదేశాలకు నష్టం జరుగుతోందని , ఆర్ధికవనరులను కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు పాక్ ప్రధాని. యుద్దాలతో ప్రజలకు చివరకు మిగిలింది పేదరికం, వేదన, నిరుద్యోగం మాత్రమే అని అన్నారు. ఉభయదేశాల దగ్గర ఇంజినీర్లు, డాక్టర్లు, నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారని అన్నారు. . దక్షిణాసియా కోసం ఈ వనరులను ఉపయోగించుకొని ఇక్కడ శాంతిని నెలకొల్పాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఆయుధాల పోటీ రెండు దేశాలకు తీరని నష్టం చేస్తోందని అన్నారు షెహబాజ్ షరీఫ్.
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ తమ పౌరులకు కనీస నిత్యావసర వస్తువులను సబ్సిడీ కింద ఇవ్వలేకపోతోంది. ద్రవ్యోల్బణంతో పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. గోధుమ పిండి కోసం పాకిస్తాన్‌లో యుద్దాలే జరుగుతున్నాయి. ప్రజలు కొట్లాడుకుంటున్న పరిస్థితులు తలెత్తాయి.
అధికధరలు , తాలిబన్ల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ ఇప్పడు శాంతి ప్రవచనాలు వల్లిస్తోంది. యుద్దం వద్దని భారత్‌ను వేడుకుంటోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం