ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో విపరీతంగా మద్యం సేవిస్తూ.. ఏడుస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కిమ్ గురించి ఈ విధమైన వార్తలు బయటికి రావడం ఇదేం మొదటి సారి కాదు. కిమ్ సన్నబడినట్లు, శస్త్రచికిత్స అనంతరం కోమాలోకి వెళ్లారంటూ పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఐతే ఈ మధ్య కాలంలో తరచూ కిమ్ ఆరోగ్యం గురించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన జీవనశైలి గురించిన విషయాలు ప్రపంచానికి ఎప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉంటాయి. తాజాగా కిమ్ మధ్య వయస్సు సంబంధిత సమస్యల (మిడ్-లైఫ్ క్రిసిస్)తో తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు, అధిక సమయం వైన్, ఆల్కహాల్ తాగుతూ, అనారోగ్యకరమైన జీవన శైలిని జీవిస్తున్నారని మిర్రర్ మీడియా సంస్థ పేర్కొంది.
సియోల్‌కు చెందిన ఉత్తర కొరియా వ్యవహారాలను పరిశీలిస్తున్న డాక్టర్ చోయ్ జిన్‌వూక్ మాట్లాడుతూ.. ’40 ఏళ్లకు చేరుకోవడంతో ఆయన తన వ్యక్తిగత ఆరోగ్యం, భద్రతపై మథనపడుతున్నాడు. అధిరంగా తాగి ఏడుస్తున్నాడని నేను విన్నాను. ఒంటరితనాన్ని, ఒత్తిడిని అనుభవిస్తున్నాడని’ వెల్లడించాడు. తరచూ వ్యాయామాలు చేయాలంటూ ఆయన భార్య, వైద్యులు చెప్పే సూచనలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తన అనారోగ్యం గురించి కిమ్ చాలా ఆందోళన చెందుతున్నట్లు మిర్రర్ నివేదించింది. ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచే కిమ్ జోంగ్ ఉన్, గత ఏడాది ఓ బహిరంగ సభలో తన కుమార్తెను బాహ్య ప్రపంచానికి పరిచయం చేశాడు కూడా. ఈ పరిణామాల వెనుక అసలు నిజం ఏమిటో కిమ్ నోట వింటే గానీ క్లారిటీ రాదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.