దౌత్య సంబంధాలతో విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు విముక్తి!
విదేశీ జైళ్ళలో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను విడుదల చేయడంలో మోదీ ప్రభుత్వం గణనీయమైన విజయం సాధించింది. దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం, అరబ్ దేశాలతో సహకారం ద్వారా చిన్న చిన్న నేరాలకు శిక్ష అనుభవిస్తున్నవారి విడుదలకు కృషి చేసింది. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంది.

చిన్న తప్పు చేసినా చట్టం దృష్టిలో అది నేరమైతే శిక్ష అనుభవించాల్సిందే. ఒక్కోసారి తెలియకుండా చేసే తప్పులకు సైతం శిక్షలు ఎదుర్కోక తప్పదు. ఒక్కోసారి ఏ తప్పూ చేయకపోయినా.. పరిస్థితులు వారిని చట్టం ముందు దోషిగా నిలబెడుతుంటాయి. న్యాయసహాయం లభిస్తే తప్పుడు కేసుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. తప్పుడు కేసుల నుంచి మనల్ని రక్షించేందుకు మనకోసం పోరాడే సొంత మనుషులు, హక్కుల సంఘాలు, మీడియా.. ఇలా ఎన్నో ఉంటాయి. కానీ దేశం కాని దేశంలో తెలిసో, తెలియకో చేసిన తప్పులకు జైలు పాలైతే.. పరిస్థితి ఓసారి ఊహించుకోండి. మన అనుకునేవారెవరూ అక్కడ ఉండరు.
పోనీ తమ కేసు తామే వాదించుకుందామంటే.. ఎంత చదువుకున్నవారికైనా అక్కడి భాష, చట్టాల గురించి తెలియదు. పైగా సౌదీ దేశాల్లో చట్టాలు మరింత కఠినంగా ఉంటాయి. దారుణమైన శిక్షలు అమలు చేస్తారు. అలాంటి చోట జైలు పాలైతే.. భూమ్మీద నరకం అంటే ఏంటో రుచి చూడాల్సిందే. ఇలా చిన్న చిన్న తప్పులకు, అవగాహన లేక చేసిన పొరపాట్లకు విదేశాల్లో జైలుపాలై శిక్ష అనుభవిస్తున్న భారతీయులు వేల సంఖ్యలో ఉన్నారు. వారందరినీ విడిపించే ప్రయత్నాల్లో గత పదేళ్లలో భారత ప్రభుత్వం గణనీయమైన విజయాన్ని సాధించింది. ఇందుకు కారరణం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఒకటైతే, ప్రపంచ పటంపై భారతదేశ స్థాయి ఒక్కసారిగా పెరిగి అగ్రరాజ్యాల సరసన నిలవడం మరొకటి.
థండేల్ కథలే ఎక్కువ
విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల విషయంలో ‘థండేల్’ సినిమా కథలే ఎక్కువ కనిపిస్తాయి. అంటే ఆ సినిమాలో ఉన్న ప్రేమకథ కాదు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి పొరుగు దేశం ఆధీనంలో ఉన్న జలాల్లోకి తెలియకుండా ప్రవేశించి పట్టుబడిన కథలే ఎక్కువ. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు శ్రీలంక సైన్యానికి పట్టుబడ్డారన్న వార్తలు, గుజరాత్ తీరం వెళ్లిన మత్స్యకారులు పాకిస్తాన్ బలగాలకు దొరికిపోయారన్న వార్తలు నిత్యం చూస్తూనే ఉంటాం. భూమ్మీద అంటే సరిహద్దు రేఖలు, కంచె, సరిహద్దు రాళ్లు వంటివి ఉంటాయి. సముద్ర జలాల్లో కేవలం గస్తీ కాసే నావికాదళం, కోస్ట్ గార్డ్ వంటి బలగాలు తప్ప ఫలానా దేశ సరిహద్దు అని చెప్పడానికి ఆనవాళ్లు ఏమీ ఉండవు. ఒక్కోసారి తుఫాన్లు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా మత్స్యకారుల పడవలను పొరుగుదేశం జలాల్లోకి నెట్టేస్తుంటాయి.
కారణం ఏదైతేనేం.. తమ దేశంలోకి అక్రమంగా చొరబడడం ‘నేరం’ కాబట్టి ఆయా దేశాలు వారిని అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతుంటాయి. భారత జలాల్లోకి ప్రవేశించిన విదేశీయుల విషయంలో భారతదేశం కూడా ఇదే పని చేస్తుంది. పాకిస్తాన్‌తో సత్సంబంధాలు లేనప్పటికీ.. ఆ దేశ మత్స్యకారులు మన జైళ్లలో, మన దేశ మత్స్యకారులు ఆ దేశం జైళ్లలో ఉంటారు. ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ మత్స్యకారుల విషయంలో మానవతాదృక్ఫథాన్ని అనుసరిస్తూ విడుదల చేసుకుంటున్నాయి. శ్రీలంకతో భారత్‌కు ఉన్న సత్సంబంధాల కారణంగా ఆ దేశం కూడా మత్స్యకారులను విడుదల చేస్తుంది. గత పదేళ్ల కాలంలో ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేస్తూ.. సాఫీగా జరగడంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవ కనిపిస్తోంది.
అరబ్ దేశాలతోనే అసలు సమస్య
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ వంటి అరబ్ దేశాల్లో చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. చమురు నిల్వలతో ధనిక దేశాలుగా మారిన ఈ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లే భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. అక్కడి ఇళ్లల్లో పనిచేసే పనిమనుషుల నుంచి కంపెనీల్లో పనిచేసే ఫిట్టర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు సహా ఇతర పనులు చేసేవారిలో భారతీయుల సంఖ్యే అధికం. అక్కడి భాష రాకపోయినా సరే.. ఆ దేశాల కరెన్సీ విలువ భారత కరెన్సీ కంటే ఎక్కువ కావడంతో కొన్నాళ్లు అక్కడ పనిచేసి, సంపాదించుకుని స్వదేశానికి తిరిగొచ్చేయాలని అనుకుంటూ ఉంటారు. అలా వెళ్లినవారు అక్కడి చట్టాలు, నిబంధనలు తెలియక చేసిన తప్పులకు జైలు పాలవుతుంటారు. కొందరు ఏజెంట్ల చేతిలో మోసపోయి విజిటర్ వీసాపై ఆ దేశానికి వెళ్లి, గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోతుంటారు. ఇలాంటివారు అక్కడి జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గిపోతుంటారు.
సొంత దేశంలోనే జైలుకు వెళ్లడం అంటే ఒక పీడ కల. అలాంటిది తమదికాని దేశంలో ఎలాంటి న్యాయసహాయం లభించని పరిస్థితుల్లో చిక్కుకుపోయిన భారతీయుల విషయంలో మోదీ సర్కారు ప్రత్యేక చొరవ చూపిస్తోంది. వారికి అక్కడి భారత రాయబార కార్యాలయాల ద్వారా న్యాయసహాయం అందించడంతో పాటు ఆయా దేశాధినేతల క్షమాభిక్ష పొందేలా చూస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన మత్స్యకారుల సమస్యతో పాటు అరబ్ దేశాల్లో జైలుపాలైనవారి కష్టాలు నరేంద్ర మోదీకి తెలుసు. అందుకే ప్రధాన మంత్రి అవ్వగానే.. ఈ అంశాన్ని తన ప్రాధాన్యతాంశాల్లో చేర్చారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల సంఖ్య 10 వేలకు పైగానే ఉంది. వారిలో 80 శాతానికి పైగా చిన్న చిన్న కేసుల్లో న్యాయసహాయం అందిస్తే బయటపడేవారే ఎక్కువ.
‘దౌత్యం’ బలోపేతం.. ఖైదీల విడుదలకు మార్గం
2014 నుంచి దాదాపు 10,000 మంది భారతీయ పౌరులను విదేశీ జైళ్ల నుంచి విడుదల చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇటీవల 500 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేస్తున్నట్టే.. విదేశాల్లోనూ ఆ తరహా విధానం అమలవుతోంది. ముఖ్యంగా అరబ్ దేశాల్లో ‘రమ్‌జాన్’ పర్వదినం సందర్భంగా ఆయా దేశాధినేతలు, రాజులు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉంటారు. భారత్ ఆయా దేశాలతో దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా క్షమాభిక్ష మార్గంలో భారతీయ ఖైదీల విడుదలకు ప్రయత్నాలు చేస్తోంది.
2022-2025 మధ్య UAE ప్రతి సంవత్సరం వందలాది మంది భారతీయ ఖైదీలను క్షమించి విడుదల చేయడంలో భారత ప్రభుత్వ చొరవ చాలా ఉంది. పవిత్రమైన రంజాన్ లేదా ఇతర ఇస్లాం పర్వదినాల సమయంలో శిక్షలను మాఫీ చేస్తూ విడుదల చేస్తున్నారు. 2022లో UAE 639 మంది భారతీయ ఖైదీలను విడుదల చేయగా, 2023లో ఈ సంఖ్య 700కు చేరింది. 2024లో 944 మంది, తాజాగా 2025లో 500 మంది భారతీయ ఖైదీలు విడుదలయ్యారు.
యుఏఈతో పాటు సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఇరాన్, కువైట్ జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు కూడా క్షమాభిక్ష లభించేలా చేయడంలో భారత ప్రభుత్వం సఫలమైంది. 2019లో తన భారత పర్యటన సందర్భంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 850 మంది భారతీయ ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. ఖతార్ దేశంలో ఏకంగా మరణశిక్ష విధించిన 8 మంది భారత నావికాదళం సిబ్బందిని విడుదల చేయించడంలో భారత ప్రభుత్వం ఆ దేశంలో ఏర్పర్చుకున్న దౌత్య సంబంధాలే దోహదపడ్డాయి.
2023లో 43 మంది, 2024లో 77 మంది భారతీయ పౌరులను ఇరాన్ విడుదల చేసింది. 2023లో విడుదలైన 43 మంది భారతీయుల్లో 12 మంది మత్స్యకారులే. 2019లో జైలులో ఉన్న 250 మంది భారతీయులను విడుదల చేయాలని బహ్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఏడాది ప్రధాని మోదీ దేశ పర్యటన సందర్భంగా ఖైదీలు విడుదలయ్యారు. 2017లో దౌత్య మార్గాల ద్వారా అనేక రౌండ్ల చర్చల తర్వాత, కువైట్ ఎమిర్ 22 మంది భారతీయ పౌరులను విడుదల చేయడంతో పాటు మరో 97 మంది శిక్షలను మార్చడానికి అంగీకరించారు.
వేటకు వెళ్లి అనుకోకుండా విదేశీ జలాల్లోకి ప్రవేశించిన మత్స్యకారుల విషయంలో 2014 నుండి మొత్తం 3,697 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక విడుదల చేసింది. 2014 తర్వాత పాకిస్తాన్‌తో సుదీర్ఘ దౌత్య ప్రయత్నాల తర్వాత 2,639 మంది మత్స్యకారులతో పాటు 71 మంది ఇతర నేరాలపై జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీలను విడుదల చేయగలిగింది. భారత ప్రధాని వివిధ దేశాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తూ.. భారత్ కంటే పేద దేశాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ దౌత్య సంబంధాలను మెరుగురుచుకుంటున్నారు. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపేసినప్పుడు భారత్ అందించిన వ్యాక్సిన్ దౌత్యం ఎంతో కీలకంగా మారింది. అదిప్పుడు భారత్‌కు ఉపయోగపడుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.