Mexico Earthquake: మెక్సికోను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు..

Mexico Earthquake: మెక్సికోలోని సెంట్రల్‌ పసిఫిక్‌ తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతతో భారీ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Mexico Earthquake: మెక్సికోను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు..
Mexico Earthquake

Updated on: Sep 20, 2022 | 8:54 AM

Mexico Earthquake: మెక్సికోలోని సెంట్రల్‌ పసిఫిక్‌ తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతతో భారీ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం.. భూకంపం సోమవారం మధ్యాహ్నం 1:05 గంటలకు సంభవించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భవనాలు చిగురుటాకులా వణికాయి. మెక్సికో పసిఫిక్ తీరంలోని మైకోకాన్ రాష్ట్రంలోని కోల్‌కోమన్‌కు దక్షిణంగా 59 కిలోమీటర్లు, అక్విలాకు ఆగ్నేయంగా 37 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయినట్లు మెక్సికన్ భూకంప శాస్త్రవేత్తల పేర్కొన్నారు. భూకంపం తీవ్రత 7.4గా నమోదైందని జాతీయ భూకంప శాస్త్ర సంస్థ నివేదించగా, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే 7.6గా అంచనా వేసింది. దీని ప్రభావంతో మెక్సికోలోని మిచోకాన్ తీరం వెంబడి సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఈ భారీ భూకంపంతో కోలోకోమన్‌ పట్టణంలో పలు భవనాలు ధ్వంసమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఒకరు చనిపోయినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.

కాగా, ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరుగలేదని మెక్సికో సిటీ మేయర్‌ క్లాడియా షీన్‌బాయ్‌ ట్వీట్‌ చేసి వెల్లడించారు. అయితే, ప్రాణ నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

అంతకుముందు 1985, 2017లో సెప్టెంబర్ నెలలోనే మెక్సికో నగరంలో భారీ భూకంపాలు వణికించాయి. సెప్టెంబరు 19, 1985న మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 10,000 మందికి పైగా మరణించారు. వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. 2017లో 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 370 మంది చనిపోయారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం