Britan PM Race: బ్రిటన్ ప్రధాని పదవికి జరుగుతున్న ఎన్నికల్లో మొదట్లో జోరుమీద కనిపించిన భారత సంతతి నేత రిషి సునాక్ ఇప్పుడు చాలా వెనుకబడిపోయారు. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడైన రిషి బ్రిటన్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటినుంచి ఎంపీల అనూహ్య మద్దతుతో రిషి సునాక్ (Rishi Sunak) ప్రధాని రేసులో ముందు నిలిచారు. అయితే తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రిషిని వెనక్కి నెట్టి ముందుకొచ్చారు లిజ్ ట్రస్.. ప్రస్తుతం 90 శాతం విజయావకాశాలు లిజ్ ట్రస్ (Liz Truss) కే ఉన్నాయని అంచనాలు చెబుతున్నాయి. ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జాన్సన్ క్యాబినెట్‌లో మంత్రులుగా పని చేసిన రిషి, లిజ్ ట్రస్ ప్రధాని పదవికి పోటీపడుతున్నారు. ముందు రిషికి విజయావకాశాలు ఎక్కువగా కనిపించినా, తర్వాత లిజ్ ట్రస్ పైచేయి సాధించారు. ఇద్దరి మధ్య 60-40 శాతం రేటింగ్ ఉందని.. అయితే అసమానత లిజ్ ట్రస్ కు అనుకూలంగా కొనసాగుతూనే ఉందని స్మార్కెట్స్‌లోని పొలిటికల్ మార్కెట్స్ అధిపతి మాథ్యూ షాడిక్ బ్లూమ్‌బెర్గ్‌తో పేర్కొన్నారు. రిషి సునాక్ మంచి ప్రచారకుడని చాలామంది అంచనా వేశారు, కానీ ట్రస్ ప్రదర్శనలు అంచనాలను అధిగమించాయని.. బెట్టింగ్ ఎక్స్చేంజ్ సంస్థ స్మార్కెట్ తెలిపింది. తాజా అంచనాలతో సునాక్ ప్రధాని అయ్యే అవకాశాలు 10 శాతానికి పడిపోయారని స్మార్కెట్ తెలిపింది.
కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలతో పాటు సభ్యుల మద్దతు దక్కిన వారే పార్టీ అధ్యక్షులుగా, ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. దీంతో వారి మద్దతు కోరేందుకు రిషి, ట్రస్ దేశమంతా పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. వారి మధ్య పోరు దాదాపు తుది దశకు చేరుకుంది. వచ్చే వారం నుంచి పార్టీ ఓటర్లకు బ్యాలెట్ పత్రాలు పంపిణీ కానున్నాయి. సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసిన బ్యాలెట్లను సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 5న ఫలితాలు వెలువడుతాయి. ప్రస్తుతం అర్హులైన కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల సంఖ్య 1,75,000గా ఉంది. పార్టీలో ఎంపీల మద్దతు రిషికి ఉన్నా సభ్యుల్లో ఎక్కువమంది లిజ్ ట్రస్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు పలు అంచనాలు వెలువడుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం