AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dr CR Rao Passes Away: ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్‌ సీఆర్‌ రావు కన్నుమూత..! ఆంధ్రా నుంచి అమెరికా వరకు..

భారత్‌కు చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధా కృష్ణారావు (సీఆర్ రావు) 102 ఏళ్ల వయసులో కన్నుమూశారు. సీఆర్ రావు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన గణిత శాస్త్రజ్ఞుడు. అమెరికాలో ఉంటోన్న ఆయన అనారోగ్యంతో బుధవారం (ఆగస్టు 23) తుదిశ్వాస విడిచారు. గణిత శాస్త్రంలో స్టాటిస్టిక్స్‌ రంగంలో ఆయన అందించిన సేవలకు గానూ ఎన్నో అత్యున్నత పురస్కారాలు ఆయన అందుకున్నారు. ఆయన సేవలకుగానూ 1968లో పద్మభూషణ్‌, 2001లో పద్మవిభూషణ్‌, ఎన్‌ఎస్‌ భట్నాగర్‌ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. 2002లో అమెరికా..

Dr CR Rao Passes Away: ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్‌ సీఆర్‌ రావు కన్నుమూత..! ఆంధ్రా నుంచి అమెరికా వరకు..
Mathematician Dr CR Rao
Srilakshmi C
|

Updated on: Aug 23, 2023 | 11:18 AM

Share

వాషింగ్టన్‌, ఆగస్టు 23: భారత్‌కు చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధా కృష్ణారావు (సీఆర్ రావు) 102 ఏళ్ల వయసులో కన్నుమూశారు. సీఆర్ రావు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన గణిత శాస్త్రజ్ఞుడు. అమెరికాలో ఉంటోన్న ఆయన అనారోగ్యంతో బుధవారం (ఆగస్టు 23) తుదిశ్వాస విడిచారు. గణిత శాస్త్రంలో స్టాటిస్టిక్స్‌ రంగంలో ఆయన అందించిన సేవలకు గానూ ఎన్నో అత్యున్నత పురస్కారాలు ఆయన అందుకున్నారు. ఆయన సేవలకుగానూ 1968లో పద్మభూషణ్‌, 2001లో పద్మవిభూషణ్‌, ఎన్‌ఎస్‌ భట్నాగర్‌ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. 2002లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జార్జి బుష్‌ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత పురస్కారంగా భావించే నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌ అవార్డు అందుకున్నారు. ఇక స్టాటిస్టిక్స్‌లో నోబెల్‌ బహుమతితో సమానమైన ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అవార్డు ఈ ఏడాదే ఆయన అందుకున్నారు.1945లో కోల్‌కతా మేథమేటికల్‌ సొసైటీలో ప్రచురితమైన సీఆర్‌ రావు పరిశోధన పత్రానికి గానూ ఈ అవార్డు దక్కింది. గణిత రంగంలో ఆయన చేసిన కృషి ఇప్పటికీ సైన్స్‌పై పలు విధాలుగా ప్రభావం చూపుతోందని ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌ ఫౌండేషన్‌ తెలిపింది.

ఆయన మన ఆంధ్రాకు చెందిన వారే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బళ్లారి జిల్లా హడగళిలో తెలుగు కుటుంబంలో డా సీఆర్‌ రావు 1920 సెప్టెంబరు 10న జన్మించారు. రాష్ట్రంలోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో విద్యాబ్యాసం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతాలో ఎంఏ స్టాటిస్టిక్స్‌ చేశారు. 1948లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరిన ఆయన ఆ తర్వాత క్రమంగా అదే సంస్థకు డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. అక్కడ రిటైర్డ్‌ అయిన తర్వాత అమెరికాలో స్థిరపడిపోయారు. అంతేకాకుండా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ బఫెలోలో రీసెర్చ్‌ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. దాదాపు 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్నారు. ఇప్పటి వరకూ 477 రీసెర్చ్‌ పేపర్స్ సమర్పించారు. తన జీవిత కాలంలో 15 పుస్తకాలు రాశారు.

సీఆర్‌ రావు పరిశోధనలివే..

సీఆర్‌ రావు తన పరిశోధనలో భాగంగా 1945లో మూడు ప్రాథమిక ఫలితాలను విశ్లేషించారు. అవేంటంటే..

ఇవి కూడా చదవండి
  • మొదటిది.. క్రామెర్‌-రావు లోయర్‌ బౌండ్‌.
  • రెండవది.. రావు-బ్లాక్‌వెల్‌ సిద్ధాంతం.
  • మూడవది.. సమాచార జామెట్రీ విస్తృతికి కొత్త ఇంటర్‌ డిసిప్లినరీ ఫీల్డ్‌ అభివృద్ధి.

హైదరాబాద్‌లోని సీఆర్‌ రావు అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాలకు ఆయన వ్యవస్థాపకులు. ఆయన సేవలు కేవలం స్టాటిస్టికల్‌ విభాగానికే మాత్రమేకాకుండా ఎకనమిక్స్‌, జెనెటిక్స్‌, ఆంత్రోపాలజీ వంటి ఇతర రంగాలకు సైతం ఎంతగానో ఉపయోగపడినట్లు పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.