AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆ మంత్రమే బతికించింది’..9 రోజులకు..నేపాల్ టన్నెల్ నుంచి ఇద్దరు రెస్క్యూ!

నేపాల్-టిబెట్ సరిహద్దు జిల్లాలలో కొండచరియలు, మంచుచరియలు  విరిగిపడటంతో వరద ప్రవాహం త్రిశూలి నది నుంచి  దాదాపు 100 కిలోమీటర్ల మేర ఉధృతంగా ప్రవహించి దారి అంతటా  తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరద ధాటికి త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్ లోకి వరద నీరు వచ్చి చేరడంతో వందలాది మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు.  తాజాగా టన్నెల్‌లో రెస్క్యూ టీమ్స్ చేపట్టిన గాలింపు చర్యల్లో ఊహించని అద్భుతం జరిగింది!త్రిశూలి 3ఏ ప్రాజెక్ట్ టన్నెల్ శిథిలాల  నుంచి ఇద్దరు కార్మికులు ఏకంగా 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు  

‘ఆ మంత్రమే బతికించింది’..9 రోజులకు..నేపాల్ టన్నెల్ నుంచి ఇద్దరు రెస్క్యూ!
Kept Chanting Mahamantra Nepal Tunnel Worker Rescued After 9 Days
Sharada V
|

Updated on: Sep 04, 2026 | 6:47 PM

Share

రెస్క్యూ టీమ్స్ బురదను తొలగించి, టన్నెల్ సందు గుండా  మెకానికల్ ఫోర్‌మన్ సంజయ్ షా, మెకానికల్ సూపర్‌వైజర్ కబీర్ మహర్జన్ ను బయటకు తీసారు. 9 రోజుల చీకటి నరకం నుంచి ప్రాణాలతో బయటపడడంపై సంజయ్ షా మాట్లాడారు. “రెస్క్యూ సిబ్బంది నన్ను రక్షించినప్పుడు నా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇది నాకు పునర్జన్మ” అని భావోద్వేగానికి గురయ్యారు. కబీర్ మహర్జన్ ఆరోగ్యస్థితి క్షీణించడంతో ఆయనను హెలికాప్టర్‌లో కాట్మండు సైనిక ఆసుపత్రికి తరలించగా, సంజయ్ షా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంజయ్ షా తనకు ఎదురైన ప్రాణాంతక క్షణాలను వివరించారు. ‘నేను కంట్రోల్ రూమ్‌లో ఉండగా వరద నీరు ఒక్కసారిగా టన్నెల్‌లోకి దూసుకొచ్చింది. ఇతరుల ప్రాణాలు కాపాడటం నా బాధ్యతగా భావించి అందరినీ వెంటనే బయటకు పరిగెత్తమని కేకలు వేశా. అందరూ సురక్షితంగా బయటకు వెళ్లేలా చూసే సమయంలో నేను వెనకబడిపోయాను. అప్పటికే టన్నెల్ ద్వారాలన్నీ నీరు, బురదతో మూసుకుపోయాయి.

చుట్టూ చీకటి, తాగునీరు, ఆహారం లేని 9 రోజులు నన్ను బతికించింది కేవలం దైవచింతనే. నిరంతరం ‘హరే కృష్ణ’ మహామంత్రాన్ని జపిస్తూ ధైర్యంగా ఉన్నాను’ అన్నారు. వారు సురక్షితంగా బయటపడిన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి కావడం విశేషం. తనకు దగ్గరలో కొంత మంది కార్మికుల శబ్దాలు వినబడ్డాయని, అయితే టన్నెల్ చాలా పొడవుగా ఉందనీ పవర్‌హౌస్ వైపు మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని సంజయ్ చెప్పారు. నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీస్,  భారతదేశానికి చెందిన టన్నెల్ నిపుణుల బృందాలు సంయుక్తంగా అత్యంత సంకిష్టమైన పరిస్థితుల్లో టన్నెల్‌లోకి ప్రవేశించాయి.  మిగిలిన వారి కోసం సహాయక చర్యలను వేగవంతం చేశాయి.

Follow Us