రోబో తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా..? వీడియో వైరల్..
మనుషులు చెప్పినట్లు నడుచుకోవాల్సిన ఒక రోబో, తనను తోసేసిన వ్యక్తి పైకి ఎదురుతిరిగి కాళ్లతో తన్నబోయింది. రష్యాలోని ఒక దుకాణంలో జరిగిన ఈ వింత ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ షాప్‌లో రోబోట్ వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ముందుగా దానితో షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే రోబోట్ స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి దాన్ని గట్టిగా తోసేశాడు. ఆ తోపుడుకు షాకైన రోబోట్ ఒక్కసారిగా బ్యాలెన్స్ సరిచేసుకుంటూ రివర్స్ అయ్యింది. అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్ స్టైల్‌లో కాలుతో ఆ వ్యక్తిపైకి తన్నేందుకు ప్రయత్నించింది.

ఎక్స్ వేదికగా వైరల్ అయిన ఈ వీడియోలో తెలుపు రంగు టీ-షర్టు వేసుకున్న ఒక వ్యక్తి షాప్‌లో ఉన్న రోబో దగ్గరకు వెళ్లి దాన్ని చేతులతో తోసేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తక్షణమే ఆ రోబో తన కాలును ఆ వ్యక్తి వైపునకు వేగంగా కదిలించి, కిక్ ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు ఆ వీడియోలో ఉంది. అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తుండగానే, ఆ యంత్రం తన కదలికలను అలాగే కొనసాగించింది. పరిస్థితి మరింత చేయి దాటిపోవడంతో, చివరికి దాని పవర్ డౌన్ చేయాల్సి వచ్చిందని పోస్టులో తెలిపారు.
Rusya’da bir teknoloji mağazasında robot, kendisini iten müşteriye saldırmaya çalıştı. pic.twitter.com/8q16sHfhX0
— Boşuna Tıklama (@bosunatiklama) September 1, 2026
ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. “ఇక మనుషుల మీద రోబోల తిరుగుబాటు మొదలైంది” అంటూ ఒక నెటిజన్ సరదాగా చేసిన కామెంట్ అందరినీ నవ్విస్తోంది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో లాగా రోబోలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయంటూ కొందరు సరదాగా భయపడుతుంటే, మరికొందరు మాత్రం ఇది ఎవరో కావాలని చేసిన స్టంట్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. “రోబోట్‌ను మరీ ఎక్కువగా రెచ్చగొడితే ఇలాగే జరుగుతుంది” అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, “మొదట ఎంతో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించింది.. కానీ చివరికి దాని సహనం కోల్పోయింది” అంటూ మరొకరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. రోబోట్లు కూడా మనుషుల్లాగే కోపం తెచ్చుకుంటాయా అంటూ ఈ కామెంట్లు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.
అక్కడే ఉన్న మిగతా సిబ్బంది, కస్టమర్లు వెంటనే అప్రమత్తమై ఆ రోబోను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేవలం ఒక చిన్న తోపుడుకు రోబోట్ ఇలా రివర్స్ అటాక్ చేయడం చూస్తుంటే, టెక్నాలజీ భవిష్యత్తులో ఎలాంటి ఊహించని పరిణామాలకు దారితీస్తుందోనని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో రోబో తనంతట తానుగా కదిలినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, ఆ సమయంలో ఆ రోబో ఏ సిస్టమ్‌తో లేదా ఏ మోడ్‌లో పనిచేస్తోందనే పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. దీన్ని ఎవరో కావాలనే రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసి ఉంటారని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
యంత్రాలు మనుషులపై ప్రతీకారం తీర్చుకుంటాయంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘మనిషి అహంకారం చివరకు రోబోలకు కూడా కోపం తెప్పించింది అని ఒకరు, ‘రోబోలకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది.. మితిమీరి కెలికితే ఇలాగే జరుగుతుంది’ అని మరొకరు రాసుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుతానికి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో మాత్రం టెక్నాలజీ ప్రియులను, సాధారణ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటూ చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి !