మనిషి ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. మరోవైపు శాస్త్రవేత్తలు ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు శాస్త్రవేత్తలే కాదు..త్వరలో సాధారణ మనుషులు కూడా గ్రహాంతర జీవులను కలుసుకుంటారని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మాజీ శాస్త్రవేత్త ఒకరు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అతి త్వరలోనే మానవులు గ్రహాంతరవాసులను సన్నిహితంగా కలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. మరి కొన్నేళ్లలోనే మనుషులు, గ్రహాంతర వాసులను అతి సమీపంగా కలుసుకుంటారని నాసా మాజీ చీఫ్ సైంటిస్ట్ జిమ్ గ్రీన్ వెల్లడించారు.
US స్పేస్ ఏజెన్సీలో 40 సంవత్సరాలు పనిచేసిన జిమ్, తన జీవితకాలంలో ఏలియన్స్ ను చూస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్య కిరణాలు తాకేంత దూరంలో అనేక గ్రహాలు ఉన్నాయన్నారు. అవి శుక్రుడిలా, అంగార గ్రహంలా ఉన్నాయని చెప్పారు. వాటిలో భూమిలాంటి గ్రహాలు కూడా ఉన్నాయన్నారు. వాటిపై తాగేందుకు నీరు కూడా ఉంటుందని జిమ్ వివరించారు. గ్రహాలు, వాటిపై ఉన్న వాతావరణ పరిస్థితులను గమనించనేదుకు..ఇటీవల శక్తివంతమైన ‘జేమ్స్ వెబ్” టెలీస్కోప్ ను నాసా అంతరిక్షంలోకి పంపింది. ఈ టెలీస్కోప్ ద్వారా గ్రహాలపై నీటి జాడలను కనిపెట్టడం తేలిక అవుతుందని..చాలా వరకు గ్రహాల్లో నీరు ఉంటే..జీవం కూడా ఉండే అవకాశం ఉందని జిమ్ గ్రీన్ తెలిపారు. అతి త్వరలోనే మానవులు నిజంగా ఆశ్చర్యపరిచే ఆవిష్కరణ కు దగ్గరలోనే ఉన్నారని గ్రీన్ ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నాసా పంపిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన, సంక్లిష్టమైన అంతరిక్ష శాస్త్ర టెలిస్కోప్. ఇది మన సౌర వ్యవస్థ రహస్యాలను పరిష్కరించడంలో, ఇతర నక్షత్రాల చుట్టూ ఉన్న సుదూర ప్రపంచాలకు మించి చూడటం, మన విశ్వం రహస్య నిర్మాణాలు, మూలాలను పరిశీలించడంలో సహాయపడటానికి రూపొందించారు. జేమ్స్ వెబ్ టెలీస్కోప్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే..భూమికి సుదూర ప్రాంతాల్లోని గ్రహాల ఉపరితలంపై వాతావరణ పరిస్థితులను పసిగట్టి వాటిని ఇతర గ్రహాల పరిసితులతో అంచనా వేయడం ద్వారా ఊహకు అందని విషయాలు వెలుగులోకి వస్తాయని జిమ్ గ్రీన్ వెల్లడించారు.